అర్ధ శతాబ్దానికి పైగా వివిధ రూపాల్ని సంతరించుకున్న తెలంగాణ ఉద్యమం రాజ్యాంగం కల్పించిన హక్కుల్ని కూడా కాలరాచే ప్రయత్నం చేస్తోంది. రాష్ట్ర విభజనాంశాలపై అధ్యయనం చేసి సిఫార్సులిచ్చే నిమిత్తం కేంద్రం నియమించిన శ్రీకృష్ణ కమిటీ సభ్యుల భావప్రకటనా స్వేచ్ఛను కూడా తప్పుబడుతోంది. కమిటీ సభ్యులు తమకనుకూలంగా సిఫార్సులివ్వలేదని, తమ మనోభావాల్ని గౌరవించలేదని, వారందరినీ ప్రాసిక్యూట్ చేసి జైలుపాలు చేయాలంటూ ఉద్యమాకారులు చేస్తున్న డిమాండ్‌లు ఉద్యమగతికి అద్దం పడుతున్నాయి. కేంద్రంపై విభజనవాదులు తెచ్చిన ఒత్తిడి కారణంగానే గత ఏడాది మార్చిలో యుపిఎ ప్రభుత్వం శ్రీకృష్ణ కమిటీని నియమించింది. ఈ కమిటీ పది మాసాల పాటు రాష్ట్రంలో విస్తృతంగా పర్యటించింది. వివిధ వర్గాల ప్రజల మనోభావాల్ని తెలుసుకుంది. గ్రామాల నుంచి పట్టణాలు, నగరాలు, సామాన్యుల నుంచి సంపన్నులు, నిరక్షరాస్యుల నుంచి విద్యాధికులు, రాజకీయ నాయకులు, విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు ఇలా సమాజంలోని అన్ని వర్గాల్లో విభజనపై నెలకొన్న అభిప్రాయాల్ని ఆరాతీసింది. తమ దృష్టికొచ్చిన అంశాలన్నింటితో ఒక నివేదికను రూపొందించి కేంద్రానికి అందజేసింది. అయితే సమస్య మూలాలు జటిలంగా ఉండడంతో ఏకపక్ష పరిష్కారం సాధ్యం కాదని తలచి కొన్ని సిఫార్సులు చేసింది. వీటిలో ప్రభుత్వానికి అనుకూలమైన ప్రతిపాదనలపై సానుకూల నిర్ణయం తీసుకోమని సూచించింది. వీరి సిఫార్సులేవీ తమకనుకూలంగా లేవన్నది తెలంగాణ వాదుల ఆరోపణ. తాజాగా ఎనిమిదో ప్రతిపాదనపై వీరు మరింత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రతిపాదనలన్నీ తమకు వ్యతిరేకంగా ఉన్నాయంటూ సభ్యుల్ని దూషిస్తున్నారు.
ప్రభుత్వం నియమించిన శ్రీకృష్ణ కమిటీ సభ్యుల్లో ఏ ఒక్కరికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో గాని, ఇక్కడి రాజకీయాలు లేదా ప్రాంతాలు, రాజకీయ పార్టీలతో ఎలాంటి సంబంధం లేదు. వీరిలో ఒక్కొక్కరు ఒక్కో రంగంలో నిష్ణాతులు. తమ తమ రంగాల్లో అనేక రకాల అధ్యయనాలు నిర్వహించి ప్రభుత్వానికి సమర్పించిన మేధావులు. రాష్ట్ర విభజన చేయాల్సొస్తే నైసర్గిక భౌగోళిక స్వరూపంతో పాటు ఖనిజాలు, జలవనరులు, విద్యుత్, సంపద ఇలా సంయుక్త వనరుల విభజనపై కూడా అధ్యయనం నిర్వహించి సిఫార్సులు చేస్తారన్న ఉద్దేశంతోనే వీరిని కమిటీ సభ్యులుగా కేంద్రం నియమించింది. వీరిలో ఒక మహిళ, ముస్లిం కూడా ఉన్నారు. ఇలా అన్ని వర్గాలకు ఈ కమిటీలో ప్రాతినిథ్యం కల్పించారు. కమిటీ సభ్య కార్యదర్శిగా వ్యవహరించిన వినోద్ కుమార్ దుగ్గల్ కేంద్ర హోమ్ శాఖ కార్యదర్శిగా వ్యవహరించారు. 1968 బ్యాచ్‌కు చెందిన ఐఎఎస్ అధికారి ఆయన. తొలుత నేషనల్ డిఫెన్స్ అకాడమీలో కొంతకాలం సేవలందించారు. ఆ తర్వాత ఐఎఎస్‌కు ఎంపికయ్యారు. దీర్ఘకాలం పాటు జలవనరుల శాఖలో ఆయన పని చేశారు. దేశంలో జలవనరుల పంపిణీపై ఆయనకు స్పష్టమైన అవగాహన ఉంది. అంతేకాదు కేంద్ర, రాష్ట్రాల మధ్య సంబంధాల్ని పునర్‌నిర్వచించే నిమిత్తం ఏర్పాటు చేసిన జస్టిస్ పూంచి కమిషన్‌లో కూడా ఆయన సభ్యుడిగా వ్యవహరించారు. డాక్టర్ రవీంద్రకౌర్ పంజాబీ మహిళ. ఢిల్లీ ఐఐటిలో సోషియాలజీ ప్రొఫెసర్‌గా పనిచేశారు. భారత సమాజంలో సామాజిక వర్గాల మధ్య విభేదాలు, రిజర్వేషన్లపై ఆమె ప్రత్యేక అధ్యయనం నిర్వహించారు. దేశంలో పట్టణ, గ్రామీణ ప్రజల మధ్య సంబంధాలపై ఆమె పలు పుస్తకాలు వెలువరించారు. సామాజిక రంగంలో ఆమె విశేష కృషి చేశారు. వివిధ ప్రాంతాల ప్రజల మధ్య భావ ప్రకటన స్వేచ్ఛలో వ్యత్యాసాలు, జీవన విధానాలపై అధ్యయనాలు నిర్వహించారు. మరో సభ్యుడు అబుసలేషరీఫ్ ఇండియన్ ముస్లిం. మంచి ఆర్థికవేత్త. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లయిడ్ ఎకనామిక్ రీసెర్చ్ సెంటర్‌లో చీఫ్ ఎకానమిస్ట్‌గా సేవలందించారు. ఆయన ఆహార విధానంపై పలు అధ్యయనాలు
నిర్వహించారు. ఆర్థిక వ్యత్యాసాలు, ఆహారం సమకూర్చుకోవడంలో అసమానతలు, తద్వారా ఒనగూరే నష్టాలపై అనేక పేపర్లను ప్రజెంట్ చేశారు. అమెరికాలోని ఎకనామిక్ గ్రోత్‌సెంటర్‌కు విజిటింగ్ ప్రొఫెసర్‌గా సేవలందించారు. దేశంలోని ముస్లింల సామాజిక, ఆర్థిక, విద్యాపర వివరాలపై అధ్యయనం నిర్వహించి కేంద్రానికో నివేదిక సమర్పించారు. ఇటీవలె భారత్‌లో మానవ వనరుల అభివృద్ధిపై పుస్తకాన్ని వెలువరించారు. దీర్ఘకాలం పాటు కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖలో సభ్యుడిగా పనిచేశారు. ప్రతిష్టాత్మక ఇండియా టుడే మ్యాగజైన్ 2000 జనవరి నాటి సంచికలో ప్రపంచ వ్యాప్తంగా పేరెన్నికగన్న మేధావుల జాబితాను ప్రచించింది. ఇందులోని 25 మందిలో షరీఫ్ స్థానం సంపాదించారు. ఇక రణబీర్‌సింగ్ నేషనల్ లా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్‌గా వ్యవహరించారు. న్యాయ వ్యవస్థను పరిరక్షించే వేలాది మంది న్యాయ నిపుణుల్ని ఆయన తీర్చిదిద్దారు. కమిటీకి నాయకత్వం వహించిన జస్టిస్ బిఎన్ శ్రీకృష్ణ దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందారు.
1991--92లో ముంబయ్‌లో జరిగిన మతకల్లోలాలపై ప్రభుత్వం నియమించిన కమిషన్‌కు ఆయనే నేతృత్వం వహించారు. బాబ్రీ మసీదు విధ్వంసానంతరం జరిగిన ఈ అల్లర్లతో ముంబయ్ నగరం అతలాకుతలమైంది. ఆయనకు ముందు మరికొంత మంది న్యాయ నిపుణుల్ని కేంద్రం సంప్రదించినప్పటికీ ఆ కమిటీకి నాయకత్వం వహించేందుకెవరూ ముందుకురాలేదు. 1998 వరకు సాక్షుల్ని విచారించిన జస్టిస్ శ్రీకృష్ణ ముంబయ్ అల్లర్ల మూలకారకుల వివరాల్ని బట్టబయలు చేయడంతో ఒక్కసారిగా ఆయన పేరు దేశమంతా మారుమ్రోగిపోయింది. ఆ తర్వాత మద్రాస్ హైకోర్టులో 2009 ఫిబ్రవరి 19న జరిగిన అల్లర్లకు సంబంధించి శ్రీకృష్ణ నేతృత్వంలోనే ఏకసభ్య కమిషన్‌ను కేంద్రం ఏర్పాటు చేసింది. ఇందులో కూడా ఆయన ఇచ్చిన నివేదిక నిందితుల్ని బయటపెట్టింది. యుకెలోని ఇంటర్‌నేషనల్ బార్ అసోసియేషన్‌లో జీవితకాల సభ్యుడిగా ఉన్న శ్రీకృష్ణకు భారత్‌లోనేకాదు ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది.
ఇలా వివిధ రంగాల్లో నిష్ణాతులైన వారిని శ్రీకృష్ణ కమిటీ సభ్యులుగా కేంద్రం నియమించింది. తెలంగాణ ప్రాంతంలోని ముస్లింల సంఖ్యను దృష్టిలో పెట్టుకునే సభ్యుల్లో ఒక ముస్లింను కూడా చేర్చింది. తెలంగాణ , సీమాంధ్ర ప్రాంతాల మధ్య నెలకొన్న ఆర్థిక అసమానతలు, జీవన వైరుధ్యాలపై స్పష్టమైన నివేదికిచ్చే నిమిత్తమే ఆయన రంగాల్లో ప్రతిభావంతులకు కమిటీలో స్థానం కల్పించింది. వీరంతా తమకు నిర్దేశించిన విధుల్ని పూర్తి చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యధికుల మనోభావాల్ని గౌరవించి తీరాల్సిందే. అలాగే ప్రతిఒక్కరికి స్పష్టమైన భావప్రకటనా స్వేచ్ఛ ఉంది. ఈరెండింటికి రాజ్యాంగం తగిన రక్షణ కల్పించింది. కానీ తెలంగాణ వాదులు తమకనుకూలంగా సిఫార్సులివ్వలేదన్న ఏకైక కారణంతో రాష్ట్రానికి సంబంధంలేని జాతీయ స్థాయి మేధావులైన కమిటీ సభ్యుల భావ ప్రకటనా స్వేచ్ఛను కూడా ప్రశ్నించడం రాజ్యాంగ ఉల్లంఘనేనని పరిశీలకులు పేర్కొంటున్నారు. అయినా తెలంగాణ ఏర్పాటు అన్నది ఓ రాజకీయ ప్రక్రియ. ఇంత వరకు రాష్ట్రంలోని ప్రధాన పార్టీలేవీ దీనిపై ఇదమిత్ధంగా తమ విధానాల్ని స్పష్టం చేయలేదు. కాంగ్రెస్, తెలుగుదేశం రెండూ తకూడా దోబూచులాట లాడుతున్నాయి. తెలంగాణ వాదులు రాజకీయ పార్టీలపై ఒత్తిడి తెచ్చిరాష్ట్ర విభజనపై ఏకాభిప్రాయ తీర్మానాన్ని అమోదింపజేయడం ద్వారానే తెలంగాణ ఏర్పాటు సాధ్యపడుతుందని వీరు సూచిస్తున్నారు. అంతేగాని ఓ గౌరవనీయ వృత్తి అయిన ప్రొఫెసర్ హోదాలో ఉన్న కోదండరామ్ కూడా శ్రీకృష్ణ కమిటీ సభ్యులపై విరుచుకుపడటం వారి రాజ్యాంగ హక్కులకు విరుద్ధంగా మాట్లాడటం తగదని వీరు పేర్కొంటున్నారు.