తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకునే వేలకోట్ల రూపాయల అక్రమ ఆస్తులు సంపాదించిన కడప మాజీ ఎంపీ వై.ఎస్.జగన్ ముఖ్యమంత్రి అయితే ఏకంగా రాష్ట్రాన్నే అమ్మేయడం ఖాయమని రాష్ట్రానికి చెందిన సీనియర్ కాం గ్రెస్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు ఆరోపించారు. సొం త పార్టీ పెట్టుకొని ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోవాలని ఉవ్విళ్లూరుతున్న జగన్ కూడబెట్టిన అక్రమ ఆస్తులపై విచారణ జరిపించాలని ఆయన గురువారంనాడిక్కడ ఏర్పాటు చేసిన పత్రికా గోష్ఠిలో డిమాండ్ చేశారు. దివంగత నేత వైఎస్ అధికారంలో ఉండగా దానిని అడ్డుపెట్టుకుని జగన్ రాష్ట్రాన్ని దోచుకొన్నట్లు ఈమధ్య కాలంలో వెలుగులోకి వస్తున్న అనేక విషయాలతో స్పష్టమౌతోందని ఆయన చెప్పారు. ప్రస్తుతం జగన్ వద్ద ఉన్నంత డబ్బు దేశంలోని ఏ ముఖ్యమంత్రి వద్ద కూడా లేదని, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరుతో ప్రజల్లోకి వెళ్తున్న జగన్ తన విశ్వసనీయతను పెంచుకోవాలంటే కేవలం ఆరేళ్ల వ్యవధిలో ఇన్ని వేలకోట్ల ఆస్తులు ఎలా సమకూరాయో వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు. జగన్ ఆస్తులపై విచారణ జరిపించాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డిని కోరినట్లు హనుమంతరావు వెల్లడించారు.
అయితే, వైఎస్ హయాంలోనే విపరీతమైన అవినీతి చోటుచేసుకున్నట్లు ప్రతిపక్ష తెలుగు దేశం చేసిన ఆరోపణలపై కాంగ్రెస్ పార్టీ గత ఆరేళ్లుగా ఎందుకు నోరుమెదపలేదన్న ప్రశ్నలకు సమాధానంగా ఆనాడు ప్రతిపక్షం కావాలనే కాంగ్రెస్ ముఖ్యమంత్రిపై బురద జల్లుతున్నదనే అభిప్రాయం ఉండేదని, అయితే, ఆ తర్వాత వెలుగులోకి వస్తున్న అనేక కుంభకోణాలు, అవకతవకలను చూసిన తర్వాత తండ్రి అధికారంలో ఉండడాన్ని జగన్ అడ్వాంటేజ్‌గా తీసుకొన్నారని రుజువౌతున్నదని వివరించారు.