25, మార్చి 2011, శుక్రవారం

ఐదుగురు హీరోల 'శ్రీ జగద్గురు ఆదిశంకర'


'అన్నమయ్య', 'శ్రీరామదాసు', 'శ్రీమంజునాథ' చిత్రాల రచయిత జె.కె.భారవి స్వీయ దర్శకత్వంలో నిర్మించే 'శ్రీ జగద్గురు ఆదిశంకర' చిత్రం షూటింగ్‌ ఉగాది పర్వదినాన మొదలవుతుంది. గ్లోబల్‌ పీస్‌ క్రియేటర్స్‌ పతాకంపై ఈ చిత్రం రూపొందనుంది. ఈ చిత్రం వివరాలను గురువారం ఫిలిం చాంబర్‌లో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో జె.కె.భారవి వెల్లడించారు. 'శంకరాచార్య జీవితత్వాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. సినిమా టైటిల్‌కు 'ఎ ఫిల్మ్‌ ఫర్‌ యూత్‌' అనే ఉపశీర్షిక ఉంటుంది. నేటితరానికి సనాతన ధర్మం గురించి తెలియజెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 32 ఏళ్లకే తనువుచాలించిన శంకరాచార్య రాసినన్ని రచనలు మరెవరూ రాయలేదు. నాలుగు సార్లు కాశ్మీర్‌ నుండి కన్యాకుమారి వరకు పాదయాత్ర చేశారు. ఈ చరిత్ర అంతా యువతరానికి కౌన్సిలింగ్‌లాగా ఉపయోగపడుతుంది ' అని భారవి పేర్కొన్నారు. 'ఈ చిత్రం గురించి చాలామంది స్వాములకు చెప్పడం జరిగింది. వారంతా బావుందని అభినందించారు. కథ గురించి, పాటల గురించి విన్న తారలు, సాంకేతిక నిపుణులు స్పందించారు. ఇప్పటికి ఐదుగురు హీరోలు నటించడానికి అంగీకరించారు. ఇతర తారల వివరాలు, సాంకేతికనిపుణుల గురించి ఉగాది రోజన వెల్లడిస్తాం. ఇందులో 16 పాటలున్నాయి. ప్రముఖ నేపథ్యగాయనీగాయకులు శంకర్‌మహదేవన్‌, హరిహరన్‌, మధుబాలకృష్ణ, మను, కార్తీక్‌, ఉన్నికృష్ణన్‌, రంజిత, శ్రీరామచంద్ర తదితరులు ఆలపించారు. బాలుగారు పాడాల్సిన పాట కూడా ఉంది. ఈ చిత్రం ద్వారా నాగ్‌శ్రీవత్స సంగీత దర్శకుడిగా పరిచయం అవుతున్నారు' అని భారవి వివరించారు.