1, మార్చి 2011, మంగళవారం

నిరాకారం నిరామయం

మానవుడు జన్మించినపుడుగాని, మరణించినపుడు గాని బట్టతో రాడు మరియు పోడు కదా! జీవుడే దిగంబరుడు పరమేశ్వరుడు దిగంబరుడే. శరీరమంతా విభూతిని రాసుకుంటాడు.
ఇక్కడ విభూతి అంటే జ్ఞాన సంపద. దీన్నే జీవులు ఎల్లప్పుడు కలిగి ఉండాలని వేదాంత విదులు చెబుతున్నారు. లౌకికపరంగా ఆలోచిస్తే మానవునితో వెంటవచ్చేది ఏదియు లేదు. జ్ఞాన సందప (విభూతి) ఒక్కటే వెంట వస్తుంది.
కనుక నశ్వరమైన మానవ శరీరంపై వ్యామోహం వదిలి శాశ్వతమైన మోక్షాన్ని పొందాలంటే శివరాత్రి రోజునైనా మానవుడు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందాలన్నదే పరమార్థ తత్త్వంగా భక్తులు స్వీకరిస్తారు.
రాగరహితుడైన శివుడు దిగంబరుడు. స్మశానవాసి. విభూతితో నిండిన శరీరం. బిక్షాటన, పులిగజ చర్మధారణ నిరాడంబరత్వం ఇలా ఈ శివుడిచ్చే దర్శనంతో భక్తులు నిరాడంబరత్వానికి హేతువుగా మనుగడ సాగిస్తారు. ఏ జీవుడైనా మరణించిన తర్వాత స్మశానంలోనే కదా శాశ్వతంగా నిద్రపోయేది.
మానవాళి కూడా నిరాడంబరమైన మనుగడను సాగించమని సందేశంగా గైకొంటారు. అంతేకాక ఈ శివరాత్రి పర్వం శిశిర రుతువు చివరలో వసంతాగమనంలో వస్తుంది.
వేదాంతపరంగా ఆలోచిస్తే అజ్ఞానపు చీకట్లు తొలగి మానవాళిని జ్ఞానవంతులుగా చేయడమే మహా శివరాత్రి ఆంతర్యం.
ప్రకృతి పరంగా ఆలోచిస్తే వృక్షాలు శిశిర రుతువులో ఆకులు రాలిస్తే మరల వసంతాగమనంతో ఆ చెట్లు చిగుర్చి నవనవోన్మేషంగా విలసిల్లుతుంటాయి.
అలాగే మానవాళి పాతబాధల (రుగ్మతలు) విరణమకూ, కొత్త ఆశలు చిగురించడానికి ఈ శివరాత్రి ప్రతీకయైందని భావించవచ్చు కదా!
శివతత్త్వం :
సృష్టి స్థితిలయకారాల్లో మూడవవాడు. అయిదు మోములు కలవాడు. మూడు కన్నులవాడు. జఠలను ధరించినవాడు. తెల్లని దేహవర్ణం కలిగినవాడు. నిడివి కన్నులవాడు. భస్మము (విభూతి) పూయబడిన శరీరం కలవాడు. పదిచేతులతో ప్రకాశించే నీలకంఠుడు. నాగుబాములనే ఆభరణాలుగా ధరించిన సర్వాంగ సుందరుడు. దిగంబరుడు నిర్వికారుడు. నిరంజనుడు నిరాడంబరుడు. భస్మత్రి పుండ్రమంచే అలంకరింపబడిన లలాటం కలవాడు. దయామయుడు. బోళాశంకరుడని లోకోక్తి కలదు. జగత్స్వరూపుడు. మహా ప్రళయకర్త.
లింగాకారంలో శివుణ్ణి పూజించుట :
''నిన్నే రూపముగా భజింతు మదిలో
నీ రూపు మోకాలో, స్త్రీ
చన్నో, కుంచమొ, మేకపెంటికయొ, యీ
సందేహముల్మాన్పింప నా
కన్నారన్భవదీయ మూర్తి గుణా
కారంబుగా జూన్‌
చిన్నీరేజ విహారమత్త మధుసా!
శ్రీకాళహస్తీశ్వరా!''
- మనసు అనెడి పద్మాన విహరించు తుమ్మెద వంటి వాడవగు ఓ శ్రీకాళహస్తీశ్వరా! నిన్ను ఏ రూపంగా భావించి కొలవను. పూజింతమన్న నీ రూపం మోకాలో, స్త్రీ చన్నా, కుంచనూ, మేకపెంటికా, ఎటూ తేల్చుకోలేని సందేహంతో ఉన్న నన్ను కరుణించి నాకనులారా నీ రూపాన్ని నా ఎదుట ప్రత్యక్షమగునట్లుగా అనుగ్రహించమని ధూర్జటి ఆ పరమశివుణ్ణి ప్రార్థించాడు.
ఈ జగత్తు ఆవిర్భవించక ముందే జగత్తంతా శూన్యం ఆ శూన్యమే నికాకారం. ఆ నిరాకారమే పరమాత్మ. ఈ పరమాత్మను జ్ఞాన సాధనతో గుర్తించాల్సిందే తప్ప బాహ్య రూపంలో దృగ్గోచరం కాదు. ఇలా గుర్తించబడిన చిహ్నానికి 'లింగం' అని అంటారు. కనుకనే భౌతిక రూపంలేని శివుణ్ణి లింగాకారాన్ని బాహ్యరూపంగా పూజించడం ప్రారంభమైంది.
''లింగ గర్భం జగత్సర్వం - త్రైలోక్యంచ చరాచరమ్‌
లింగ బాహ్యాత్సర్వం నాస్తి - తల్లింగంచ ప్రపూజయేత్‌''
- అని స్మృతి కదా!
సకల చరాచర సృష్టి ఈ లింగాకారంలోనే దాగుంది. శివ పురాణం విద్యేశ్వర సంహితలో శివలింగం బిందునాదాత్మ కమైందని విశదీకరించింది.
ఎట్లన - బిందు స్వరూపిణియైన ఆదిశక్తే తల్లి, నాద స్వరూపుడైన ఈశ్వరుడు (శివుడు) తండ్రి.
కాళిదాసు చెప్పినట్లు ఈ జగత్తుకు జనన జనకుల స్వరూపమే శివలింగం. జగత్తు యావత్తూ శివశక్త్యాత్మకం, బిందువుకు నాదమే ఆధారం. బిందు, నాదం రెండూ జగతికి ఆధారాలు కనుక దానిచేతనే ఆవిర్భవించింది.
ఈ లింగాలు రెండు రకాలు.
(1) స్థావర జంగాలు అనగా చలనం లేనివి.
(2) జంగమలింగాలు అనగా చలనలింగాలు.
ఈ చలన లింగాలు మరల ఆరు విధాలున్నాయని ఆధ్యాత్మిక కోవిదులు విశదీకరించారు.
(1) క్షణికలింగాలు - గంధం, ఇసుకలతో చేయబడిన లింగా లు, వీనినే సైకతలింగాలు అంటారు.
ఈ సైకత లింగాన్ని శ్రీరామచంద్రుడు ప్రతి ష్ఠించడంతో
'రామేశ్వరం'గా పేరుగాంచిందని ప్రతీతి.
(2) శైలజలింగాలు - శిలలతో చేయబడినవి.
(3) దారుజలింగాలు - కొయ్యతో చేయబడినవి.
(4) రత్నజలింగాలు - రత్న వైడుర్యాలతో చేయబడినవి.
(5) లోహజ లింగాలు - లోహాల (ఇనుము వైగరాలు)తో చేయబడినవి
(6) మృణ్మయలింగాలు - మట్టితో చేయబడినవి.
భక్తిని, ముక్తిని ఇచ్చే శంభుడు లింగంలో ప్రతిష్ఠితుడై ఉన్నాడు. లింగం యొక్క వేది మహాదేవియగు ఉమ. లింగం సాక్షాత్తుగా మహేశ్వరుడు. దానిపట్ల జగత్తంతయు లయ మగుటచే 'లింగ'మని పేరు వచ్చిందని శివ పురాణం వివరిస్తోంది.
ద్వాదశ జ్యోతిర్లింగాలు :
మన భారతదేశంలో ప్రసిద్ధమై అతి ప్రాచీన కాలంనుంచి ద్వాదశ జ్యోతిర్లింగాలు విరాజిల్లుతున్నాయి.
1. ఎల్లోరా - ఘసృణశ్వరుడు
2. హిమాలయం - కేదారేశ్వరుడు
3. మిథిలానగరం - త్య్రంబకేశ్వరుడు (సీత జన్మించిన ప్రదేశం)
4. రామేశ్వరం - రామేశ్వరుడు (శ్రీరామ చంద్రుడు ప్రతిష్ఠించిన ప్రదేశం)
5. జున్మారుదం పుణ్యక్షేత్రం - భీమశంకరుడు
6. దారుకావనం - నాగేశుడు
7. కాశీ - విశ్వేశ్వరుడు
8. వర్గీవైద్యనాదం - వైద్యనాధుడు
9. ఓంకార క్షేత్రం - అమరేశ్వరుడు
10. శ్రీశైలం - మల్లిఖార్జునుడు
11. ఉజ్జయినీ - మహాకాళేశ్వరుడు
12. సౌరాష్ట్రం - సోమనాధుడు
ముఖ్యమైన పంచజ్యోతిర్లింగాలు ప్రసిద్ధికెక్కాయి.
అవి. 1. భీమేశ్వరుడు, 2. రామేశ్వరుడు, 3. విశ్వేశ్వరుడు, 4. మల్లిఖార్జునుడు, 5. విరూపాక్షుడు.
కనుకనే లింగానికి ఇంతటి విశిష్టత కలిగింది. ఈ లింగం ఆద్యంతాలు కనుగొనుటకు, నేను గొప్పంటే నేను గొప్ప అనుచు తగవులాడుకొన్న బ్రహ్మ, విష్ణువు లిరువురూ దివ్యకాంతులతో ప్రకాశించే లింగంలోకి ప్రవేశించారు. వారిరువురూ చెరొక వైపునకు వెళ్లారు. కాని వారి కది సాధ్యం కాలేదు. అంత వారిరువురు బయటికి మరలివచ్చి తమకంటే అధికుడైన లింగరూపంలోనున్న శివుడని గ్రహించారు.
శివుని రూపానికి పూజలేదు. భృగమహర్షి శాప కారణంగా లింగాకారంగానే శివుడు భూ లోకంలో పూజింపబడుతున్నాడు.
ప్రణవమ్‌ - పంచాక్షరీ మంత్ర మహిమ :
'ఓం'కారం ప్రణవం. ఆ ఉ మ్‌ - 'ఓమ్‌' మంగళప్రదమైంది. ఇది ఈశ్వరబీజం. ఓంకారంలో భూత భవిష్యత్వర్తన కాలాలు, త్రిగుణాత్మకాలు ఇమిడి ఉన్నాయని వేదాంత విదుల అభిభాషణం.
ప్రపంచానికి మూలం 'ఓం'కారం, సర్వ శక్తిమయం. పరమ పవిత్రమైన ఓంకారానికి చినమంత్రం మరొకటి లేదు.
'ఓం నమశ్శివాయ' అనునది ఓంకార సహిత పంచాక్షరీ మంత్రమని యజుర్వేదం విశదీకరించింది.
'ఓం'కారం - పరబ్రహ్మ స్వరూపం. 'న' - పృథ్వీ, బ్రహ్మ, 'మ' - జలము, విష్ణువు, 'శి' - అగ్ని, మహేశ్వరుడు 'వా' - వాయువు, ఆత్మ, 'య' - ఆకాశం, పరమాత్మ, 'నమశ్శివాయ' అనగా పంచాక్షరీ మంత్రంలో ఇమిడియున్న జీవాత్మ పరమాత్మలు.
'నమ' - జీవాత్మ, 'శివ' పరమాత్మ, 'ఆయ' ఐక్యం అనగా జీవాత్మ పరమాత్మయందు ఐక్యము పొందుట అనియర్థం.
ఈ విధంగా ఏకాక్షర నిఘంటువు వివరించింది. సమస్త వాఙ్మయ రూపమైన నిత్యశుద్ధమైన బీజాక్షరమే ఈశ్వరుడని పెద్దలు చెబుతున్నారు.
ఈ పంచాక్షరీ మంత్రాన్ని ద్విజులు (బ్రాహ్మణులు) 'నమ:' పూర్వకముగాను (ఓంనమశ్శివాయ), బ్రాహ్మణతరులు 'నమ:' అంతముగను, (ఓం శివాయనమ:) జపించాలి. అలాగే స్త్రీలు కూడా నమ: అంతముగానే జపించాలి. బ్రాహ్మణ స్త్రీలు మాత్రం 'నమ:' పూర్వకంగానే జపించాలి. ప్రతిరోజూ ఉదయం వెయ్యిసార్లు జపించినచో శివసాయుజ్యం పొందుదురని శివపురాణం వివరించింది.
లింగాభిషేకం :
''అలంకార ప్రియోవిష్ణు:
అభిషేక ప్రియశ్శివ:''
శ్రీమన్నారాయణునికి ఎంత సుందరంగా అలంకరిస్తే అంత ఇష్టమనియు, శివునికి ఎంత అభిషేకాన్ని చేస్తే అంత సంతోషమని పై శ్లోకార్థం.
పరమేశ్వరునికి మహన్యాసంతో కూడిన అభిషేకమంటే చాలా ప్రీతి. శివునికి ఒక్కో పదార్థంతో అభిషేకం చేస్తే ఒక్కో ఫలితం కలుగుతుందని పురాణ ప్రవచనం.
ఆవు పాలతో - సర్వసౌఖ్యాలు
ఆవు పెరుగుతో - ఆరోగ్యం మరియు బలం
ఆవు నెయ్యితో - ఐశ్వర్యం
మెత్తని పంచదారతో - దు:ఖ నాశనం
తేనెతో - తేజోవృద్ధి
భస్మజలంతో - మహా పాపహరం
గంధోదకంతో - పుత్రలాభం
పుష్పోదకంతో - భూలాభం
బిల్వజలంతో - భోగభాగ్యాలు
నువ్వుల నూనెతో - అపమృత్యుహరం
రుద్రాక్షోదకంతో - మహా ఐశ్వర్యం
సువర్ణ జలంతో - దంద్రనాశనం
అన్నంతో - రాజ్యప్రాప్తి మరియు ఆయుర్వృద్ధి
ద్రాక్షరసంతో - సకల కార్యసిద్ధి
ఖర్జూర ఫలరసంతో - శత్రువులకు హాని
నేరేడు పండ్లరసంతో - వైరాగ్యం
కస్తూరీ జలంతో - చక్రవర్తిత్వం
నవరత్న జలంతో - ధాన్యం, గృహప్రాప్తి
మామిడి రసంతో - దీర్ఘవ్యాధి నాశనం
విభూది - పుణ్యం, అష్టైశ్వర్యాలు కలుగుతాయి.,
పూజా పుష్పఫలం :
శివుణ్ణి పూజిస్తే దీర్ఘాయుష్షు కలుగుతుంది. ఉమ్మెత్తలతో - సంతానం, జిల్లేడు పువ్వులతో - శౌర్యం, కలువపూలతో - విక్రమవృద్ధి, గన్నేరు పూలతో - శత్రు నాశనం, బంధూక సుమములతో పూజిస్తే భూషణ ప్రాప్తి, జాజిపూలతో - వాహన ప్రాప్తి, మల్లెపూలతో - భోగప్రాప్తి, అవిసెపూలతో - పరమేశ్వరునితోఎ స్నేహం, కొండగోగు పూలతో - వస్త్రలాభం, శిరీష పుష్పాలతో - సంతోష ప్రాప్తి, నువ్వు పువ్వులతో - మౌవన ప్రాప్తి, తుమ్మ పువ్వులతో - మోక్షలాభం, నందివర్ధన పుష్పాలతో అర్చిస్తే సౌందర్యం కలుగుతుందని శివపురాణం విశ్లేషించింది.
శివకేశవుల విశిష్టత :
వ్యాస భారతాన్ని ఆంధ్రీకరించిన కవిత్రయంలో రెండవ వాడైన తిక్కన మాత్యుల వారు శివకేశవులకు భేదం లేదని తెలియజెప్పుటకై హరిహరనాథుని దేవాలయాన్ని ప్రతిష్ఠించాడు. తను ఆంధ్రీకరించిన భారతాన్ని ఆ దేవునికే అంకితం ఇచ్చాడు.
శాంతి పర్వంలో ఇలా విశదీకరించాడు.
''విష్ణుండనగా - శివుడన నొక్కటే దివ్యచిత్తమ యెఱుగన్‌'' అని బ్రహ్మదేవుడు చెప్పాడు.
'విష్ణువు అన్నా శివుడు అన్నా ఒక్కరే' అనిఒ నీ దివ్య చిత్తానికి తెలుసును కదా! శివుణ్ణినుగ్రహిస్తే విష్ణువును గ్రహించినట్లే. అలాగే విష్ణువుని సేవిస్తే శివుణ్ణి సేవించినట్లే, శివకేశవు లిరువురు భేదం లేదు.
విష్ణువు గుండెలపైనున్న శ్రీవత్సం శివుని శూలానికి ప్రతీకయైంది. ఈశ్వరుని కంఠంపైనున్న నలుపు విష్ణువు చేతి ముద్రగా ఖ్యాతి పొంది శివుడు శ్రీకంఠుడైనాడని భారతం తెలియజేస్తోంది.
అలాగే వైష్ణవులు శివనింద చేసినా, శైవులు వైష్ణవ నింద చేసినా వారు కోటి జన్మలు నరకంలో ఉంటారని పురాణాలు ఘోషిస్తున్నాయి.
శివ పూజావిధి :
శివ పూజా విధానాన్ని ఎఱ్ఱాప్రగడ తన హరివంశంలో చక్కని రీతిలో విశదీకరించాడు.
శ్రీకృష్ణ పరమాత్మ గోప బాలబాలికలకు శివభక్తిని, మంత్ర జ్ఞానాన్ని, ఆచార క్రమాన్ని, బ్రాహ్మణుల్ని సేవించే విధానాన్ని విశదీకరించి శివపూజా వ్రతాన్ని చెప్పాడు.
''పంచామృతమ్ముల బంచగవ్యంబుల
విములోదకంబుల గ్రమముతోడ
నభిషేక మొనరించి యఖిలేశ్వరుని సమం
చిత గంధ సమితి నర్చితుని జేసి
భూరి సౌరభ చారు పుష్పదామంబుల
బూజించి బహువిధ స్ఫురిత ధూప
తల యిచ్చి కపిలాఘృత ప్లుత వర్తికా
రమ్య దీపముల నారతుల మర్చి
భక్ష్యభోజ్య లేహ్య పానీయ బహుళ నై
వేద్యములు ఘటించి హృద్యవీల
బలుగ రేలు నట్లు పరిచర్య నడపు చు
గొలిచి రేడు దివసములు గ్రమమున''
(హరివంశం. పూర్వభాగం - 6:57)
ఈ విధంగా శివపూజచేస్తే పరమాత్మ అయిన ఆ పరమేశ్వరుడు సాక్షాత్కరించి రోగ నివారణ కలిగి మనశ్శాంతి కలుగుతుందని ఆధ్యాత్మిక కోవిదులు చెబుతున్నారు.
1. పంచామృతములు : ఆవుపాలు, ఆవునెయ్యి, ఆవు పెరుగు, తేనె, పంచదార,
2. పంచగవ్యాలు : ఆవుపాలు (ఇంద్రుని స్థావరం), ఆవుపు పెరుగు (వాయువుని స్థావరం), ఆవునెయ్యి (సూర్యుని స్థావరం), ఆవుపేడ (అగ్ని స్థావరం), ఆవుమూత్రం (వరుణుని స్థావరం)
కనుకనే వీనిని పంచగవ్యాలనియు, సర్వదేవతామయమని అన్నారు.
3. విమలోదకములు : కృష్ణా, గంగా, కావేరి, గోదావరి, సింధు నదీజలాలు.
4. దివ్య పుష్పాలు : (సువాసన కలిగిన పువ్వులు) మరియు గంధం, ధూపం, పసుపు, కుంకుమ, అక్షతలు సామగ్రితో పూజించుట. కర్పూర హారతిచ్చుట.
5. కపిల ఘృతం : నల్లని ఆవు పాలలో వచ్చిన నెయ్యితో దీపారాధన చెయ్యాలి.
6. భక్ష్యాలు - పిండివంటలు
7. భోజ్యాలు - పులిహోర, శర్కర పొంగలి, దధ్యోదనం, చిత్రాన్నములు
8. లేహ్యాలు - రకరకాల పాయసాలు
9. పానీయాలు - మధుర ఫలరసాలు
వీనితో గొప్పగా నైవేద్యం చేయాలి. అప్పుడు వ్రతం పూర్తవుతుంది.
అంతేకాక వ్రత విధానాన్ని శ్రీనాథుడు 'శివరాత్రి మహాత్మ్యం'లో చాలా అద్భుతంగా విశదీకరించి చెప్పాడు.
''మకర రాశిస్థుడై మార్తాండు డుండంగ
సమకొన్న మాఘ మాసంబునందు
సిత చతుర్దశి నిశి శివరాత్రి యనుపేర
ప్రఖ్యాతి గనిన యారాత్రి యందు
నట్టి నాల్జాలును నవధాన పరతమై
జాగర వ్రతచర్య జరుపవలయు
నాజాగర వ్రతం బనఘ ప్రాజాపత్య
సత్ఫలంబీనోపు సాధకునకు
నవని సురుడాది చండాలుడాదిగా గ
నీ వ్రతము సేయగా నర్హులెల్ల వారు
నన్న చందాల నీవ్రతం బలఘ ఘోర
పాతకంబుల నెల్ల గాల్పం గ జాలు
(శివరాత్రి మాహాత్మ్యం - 5:36)
సూర్యుడు మకరరాశిలో ఉన్నప్పుడు వచ్చు మాఘమాస శుక్ల పక్ష చతుర్దశి రాత్రి శివరాత్రి అని ప్రసిద్ధి పొందింది. ఆ రాత్రి నాలుగు జాములును ఏకాగ్ర బుద్ధితో జాగరణ వ్రతాన్ని చేయాలి. ఆ జాగరణ వ్రతం సాధకునకు ప్రాజాపత్య (ప్రజాపతివల్ల పుట్టినది) సత్ఫలాన్ని కలిగిస్తుందిట. బ్రాహ్మణుడుగాని, చండాలుడు గాని లేదా ఎవ్వరైనను కాని ఈ వ్రతం చేయడానికి అర్హులు. అన్ని విధాలా ఈ వ్రతం భయంకరమైన పాపాల్ని దహింపవేస్తుంది.
ఫలశ్రుతి :
జ్ఞానాజ్ఞాన కృతంబులయ్యు బశు హిం
సా బ్రహ్మహత్యా సురా
పానన్తేయము లాదిగా గలుగు పా
పంబుల్‌ దహించున్నిమే
షానన్‌ శంభు నిశావ్రతంబు ప్రజల జ్వా
లా వ్రతం బగ్నియె
ట్లేనిం గాలుచు నార్ద్ర శుష్కముల నొ
క్కింతి ధ్మ భారంబులన్‌
(శివరాత్రి మాహాత్మ్యం - 5:37)
మిక్కిలి తీక్షణములైన జ్వాలలతో కూడిన యగ్ని తడిసిన వయినను, ఎండిన వయినను కొలదిపాటి కట్టెల బరువు నెట్లు కాల్చునో, అట్లే శివరాత్రి వ్రతము తెలిసి చేసినవైనను, తెలియక చేసినవైనను ప్రాణిహింస, బ్రహ్మహత్య, మద్యపానం, దొంగతనం మున్నగు పాపాలు నిముష కాలంలో నశించి పోతాయి.
- ఆచార్య శ్రీవత్స