గోద్రా రైలు దగ్ధం కేసులో అహ్మదాబాద్ ప్రత్యేక కోర్టు తొమ్మిదేళ్ల తర్వాత సంచలన తీర్పు వెలువరించింది. 11 మందికి ఉరిశిక్ష విధిస్తూ, మరో 20 మందికి జీవితఖైదు విధిస్తూ కోర్టు మంగళవారం తన నిర్ణయాన్ని వెలువరించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు మౌల్వీ ఉమర్జీతో పాటు 63 మందిని నిర్దోషులుగా విడుదల చేస్తూ... 31 మందిని దోషులుగా నిర్ధారించింది.
గుజారత్‌లో 2002లో జరిగిన గోద్రా రైలు దగ్ధం సంఘటనలో 59 మంది మరణించారు. అనంతరం చెలరేగిన అల్లర్లలో 1200 మంది దాకా చనిపోయారు.మొత్తం 94 మందిపై నేరారోపణ చేస్తూ పోలీసులు చార్జిషీట్ దాఖలు చేశారు. ఈ కేసు విచారణ 2009 జూన్‌లో సబర్మతి జైలు ఆవరణలో ప్రారంభమైంది. గోద్రా రైలు ఆరో కోచ్‌ను దగ్ధం చేయడంలో క్రిమినల్ కుట్రకు పాల్పడి, 59 మంది మరణానికి కారణమయ్యారంటూ వారిపై నేరారోపణ చేశారు. తగిన సాక్ష్యాధారాలు లేకపోవడంతో గోద్రా రైలు దగ్ధం కేసులో హజీ బిల్లా, రజాక్ కుర్కుర్‌లతో పాటు ప్రధాన నిందితుడు ఉమర్జీకి కేసు నుంచి విముక్తిని ప్రసాదించింది.