ముంబాయి వదిలి హైదరాబాద్‌లో మకాం వేసిన రాం గోపాల్ వర్మ వరుసగా చిత్రాలు తీస్తున్నారు. ప్రకటిస్తున్నారు. సినిమా ప్రారంభానికి ముందే హడావుడి ప్రచారం చేయడం ఆయన ప్రత్యేకత. ఐదు రోజుల సినిమా 'దొంగలదోపిడి' ఇంకా పూర్తికాలేదు. తీస్తానని ప్రకటించిన 'బెజవాడరౌడీలు', 'అమ్మ' చిత్రాల గురించి ఇంకా స్పష్టమైన సమాచారం లేదు. తాజాగా మరో కొత్త సినిమా గురించి ప్రకటించారు. కొత్త చిత్రం పేరు పెళ్లి. ఈ చిత్రం ప్రత్యేకత ఏమంటే దీనిని ముగ్గురు దర్శకులు కలిసి డైరెక్ట్ చేస్తారట. రాంగోపాలవర్మతో పాటుగా పూరి జగన్నాథ్, హరీష్‌శంకర్ దర్శకులు. ఇలా ముగ్గురు కలిసి దర్శకత్వం వహించడం గతంలో ఎప్పుడూ లేదు. మూడు వేరు వేరు కథల ప్రభావం, మరో నాలుగో కథ మీద ఎలా ఉండబోతున్నదనేది ఈ చిత్రం ప్రత్యేకత. ఒక వ్యక్తి ఒక అమ్మాయిని గాఢంగా ప్రేమిస్తాడు. కానీ అతనికి పెళ్లి అనే వ్యవస్త మీద వివిధ కారణాల వల్ల విభిన్న అభిప్రాయాలు ఏర్పడతాయి. ఆ కారణాల చేత పెళ్లి చేసుకున్న మూడు జంటలు, పెళ్లి మూలాన వారు ఎదుర్కొన మానసిక స్థితులు అతనికి తెలిసి ఉండడం. ఈ నేపథ్యంలో తను తన పెళ్లి గురించి ఏ విధంగా, ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడనేది ఈ చిత్రం ఇతివృత్తం అని రాంగోపాల్‌వర్మ ఒక ప్రకటనలో తెలియజేశారు.