నిన్నటి వరకు ప్రజారాజ్యం అధినేత చిరంజీవివికి మద్దతుగా నిలిచిన అభిమానులు, పార్టీ కార్యకర్తలు ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించుకుంటున్నారు. చిరంజీవి పార్టీ పెట్టడంతో వివిధ రాజకీయ పార్టీల నుంచి వచ్చి చేరిన నాయకులు ఇప్పుడు మరో గత్యంతరంలేక తమ మాతృ సంస్థలకు తరలిపోవడమో, లేదా ఇతర పార్టీల్లో చేరే ప్రయత్నాల్లో ఉన్నారు.
పీఆర్పీని కాంగ్రెస్‌పార్టీలో విలీనం చేయడంతో యూకేలోని మెగాస్టార్ అభిమానులు కడప మాజీ ఎంపీ వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి మద్దతు తెలిపారు. పోలవరం ప్రాజెక్టు సాధన కోసం ఆయన చేస్తున్న హరిత యాత్రకు మద్దతు తెలుపుతున్నట్లు చిరంజీవి యూకే(యూరప్) అసోసియేషన్ ఓ ప్రకటనలో తెలిపింది. బ్రిస్టాల్, కేమ్‌బ్రిడ్జి, లండన్, స్కాట్లాండ్‌లోని తెలుగు ఎన్నారైలు, వెస్ట్ ఇంగ్లండ్ యూనివర్శిటీలో చదువుతున్న విద్యార్థులు సమావేశమై ఈ నిర్ణయం తీసుకున్నారని అసోసియేషన్ ఓ ప్రకటనలో పేర్కొంది.