11, నవంబర్ 2010, గురువారం

కరంట్ 'డవలప్ మెంట్' బాదుడు

రాష్ట్ర ప్రభుత్వం ప్రజల నుంచి ప్రత్యక్షంగా, పరోక్షంగా పన్నులు వసూళ్లు చేయడమే కాకుండా డెవలప్‌మెంట్ చార్జీల పేరుతో విద్యుత్ వినియోగదారులపైన అదనంగా డిపాజిట్ల కోసం వాత పెడుతోంది.. గృహ, వ్యాపార విద్యుత్ వినియోగ దారులపై విద్యుత్ శాఖాధికారులు వేలాది రూపాయలు డిపాజిట్లు చెల్లించాలంటూ నోటీసులను అందచేస్తున్నారు

విద్యుత్ శాఖకు చెందిన ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు విద్యుత్ వినియోగాన్ని రెట్టింపుగా వినియోగిస్తున్నారా.. తెలుసుకునేందుకు ..విద్యుత్‌శాఖ ఉద్యోగులు, సిబ్బంది విద్యుత్ పోల్,పోల్‌కు తిరుగుతూ అక్కడున్న గృహ, వ్యాపార విద్యుత్ సర్వీసులను లెక్కిస్తున్నారు. ఆ ఇంటి వద్దకు వెళ్లి ఇంట్లో విద్యుత్ వినియోగానికి సంబంధించిన వస్తువులను లెక్కిస్తున్నారు. నెలకు ఆ ఇంటికి ఎంత విద్యుత్ వాడకం జరుగుతుందో కూడా విద్యుత్‌శాఖాధికారులు లెక్కలు వేసుకొని ఒక రిపోర్టును సైతం తయారు చేసి దాని ప్రకారం ప్రతి ఇంటికి నోటీసులను అందచేస్తున్నారు

వేలాది రూపాయలు డవలప్‌మెంట్ చార్జీల పేరుతో విద్యుత్‌శాఖాధికారులు ఇస్తున్న నోటీసులను చూసుకొని వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. విద్యుత్ వాడుకున్నంత ప్రకారం చార్జీలు చెల్లిస్తున్నప్పటికీ మళ్లీ అదనంగా భారం వేయడం ఏమిటని విద్యుత్‌శాఖాధికారులు మళ్లీ ఆలోచించి ఈ డెవలప్‌మెంట్‌ చార్జీల వసూళ్లను నిలిపివేయాలని కోరుతున్నారు.