మొత్తానికి ఎన్నాళ్లకి గాంధీ కుంటుంబంలో పెళ్లి బాజాలు మోగబోతున్నాయి. భాజపా యువనేత వరుణ్‌గాంధీ పెళ్లి పీఠలు ఎక్కేందుకు రెడీ అయిపోతున్నాడు. మార్చి 6వ తేదీని అంగరంగ వైభవంగా వారణాసి విశాలాక్షి సాక్షిగా బెంగాలి యువతి యామిని మెడలో వరమాల వేసేందుకు ముహూర్తం ఖ రారైనట్టు వరుణ్ తల్లి మేనకా గాంధీ మీడియాకు వెల్లడించారు. బెరేలీలో ఆమె మీడియాతో మాట్లాడుతూ ఈ వివాహానికి దేశ వ్యాప్తంగా ఉన్న పలువురు రాజకీయ ప్రముఖులతోపాటు తమ గాంధీ కుటుంబం యావత్తు సోనియాతో సహా పాల్గొంటారని, వీరందరికీ ఆహ్వానాలు సిద్ధం చేస్తునట్టు ఆమె ప్రకటించారు.
అలాగే వరుణ్‌గాంధీని ఎంపీగా ఎన్నుకుంటూ వస్తున్న ఫిలిబిత్ పార్లమెంట్ నియోజక వర్గ ప్రజలకు కూడా విందు ఏర్పాట్లు చేస్తున్నామని, ఢిల్లిలో వివాహ రిసెప్షన్ ఏర్పాట్లు చేస్తున్నట్టు మేనకా మీడియాకు తెలిపారు.
కాగా, వయస్సులో చిన్నవాడైనా కాస్త అటుఇటుగానైనా సమయానికి పెళ్లి చేసుకుంటూ సంసార జీవితంలోనికి వరుణ్ అడుగుబెడుతుంటే ఆయన గారి అన్నయ్య రాహుల్ గాంధీకి ఇంకా పెళ్లి ధ్యాస కలగకపోవడం పట్ల కాంగ్రెస్ కార్యకర్తల్లో నిరుత్సాహం కలుగుతోంది. మరి వీరి కోరిక మన్నించైనా రాహుల్ 2011లోనైనా పెళ్లి కొడుకుగా మారతాడని ఆశిద్దాం.