23, జూన్ 2011, గురువారం

జూలై 2 లేదా 9 వ తేదీలలో మంత్రి వర్గ విస్తరణ?

హస్తిన రాజకీయం వేడెక్కుతోంది. కేంద్ర మంత్రి వర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. జూలై 2 లేదా 9 వ తేదీలలో మంత్రి వర్గ విస్తరణ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. తిరుపతి ఎమ్మెల్యే, ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి కి కేంద్ర సహాయ మంత్రి పదవి దక్కే అవకాశాలు పుష్కలంగా వున్నాయి. అలాగే కేంద్ర మంత్రి పదవి కోసం పట్టుబడుతున్న బలమైన సామాజిక వర్గానికి చెందిన గుంటూరు ఎంపి రాయపాటి సాంబశివ రావుకు తిరుమల, తిరుపతి దేవస్థానం బోర్డు ఛైర్మన్‌ పదవి ఖరారైనట్లు విశ్వసనీయ సమాచారం. కేంద్ర మంత్రి వర్గ విస్తరణ అనంతరం కేంద్ర సహాయ మంత్రి హోదాలో ప్రజా రాజ్యం పార్టీని, చిరంజీవి కాంగ్రెస్‌ పార్టీలో విలీనం చేసేందుకు జూలై 15 న మూహూర్త నిర్ణయించనున్నట్లు తెలుస్తోంది. మంత్రి వర్గ విస్తరణ పూర్తయిన వెంటనే తిరుపతి నియోజక వర్గ శాసన సభ సభ్యత్వానికి చిరంజీవి రాజీనామా చేయనున్నారు. దీంతో తిరుపతి శాసన సభ నియోజకవర్గానికి సె ప్టెంబర్‌ ఆఖరులో గానీ, అక్టోబర్‌ మాసంలో గానీ ఉప ఎన్నికలు జరిగే అవకాశాలు వున్నాయి. ఇదిలా వుండగా జిల్లా కాంగ్రెస్‌ లో సియం కు వ్యతిరేకంగా రెబల్‌ వర్గం బలం పుంజుకుంటోంది. రాష్ట్ర పిసిసి అధ్యక్షుడిగా సియం అనుకూల శత్రువుగా పేరుపడ్డ బొత్స సత్య నారాయణ నియమితులు కావడం, జిల్లాలో సియంపై మీసం మెలేస్తున్న మాజీ మంత్రి పుంగనూరు శాసన సభ్యులు పెద్ది రెడ్డికి, బొత్సకు మధ్య సత్సంబందాలు కలిగివుండడం, మరో వైపు చిరంజీవి, బొత్సకు వున్న సమన్వయంతో చిరు ఇటీవల పెద్ది రెడ్డిని కలవడంతో జిల్లాలో సియం ప్రాబల్యాన్ని తగ్గించేందుకు కుట్ర జరుగుతోందని, సియం ను ఉక్కిరి బిక్కిరి చేసేందుకు మొదట జిల్లానే ప్రధాన వేదికగా చేసుకుంటున్నారనే విశ్లేషణ రాజకీయ మేధావుల నుండి బలంగా వినిపిస్తోంది. ఇప్పటికే జిల్లా కాంగ్రెస్‌ లో బలమైన రెబల్‌ వర్గం నాయకుడిగా పేరు పడ్డ పెద్దిరెడ్డి ఇటీవల కాంగ్రెస్‌ అధిష్టానం జోక్యంతో కాస్తా వెనక్కు తగ్గట్లు కనిపించినా, ఓ వైపు పార్టీ రాగం ఆలపిస్తూనే మరో వైపు సియం పై కత్తి నూరుతూ, అందివస్తున్న అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకునేందుకు ఇదే సరైన తరుణంగా భావిస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో సియం కిరణ్‌ జట్టు నుండి పూతలపట్టు ఎమ్మెల్యే రవి వేరుపడగా, పెద్ది రెడ్డి, కుతూహలమ్మ, షాజహాన్‌ బాషలు తటస్థంగా వుంటూ, కిరణ్‌ ను వ్యతిరేకిస్తున్నారు.వీరందరూ కూడా సమయం చూసి ఫిరాయించడమా లేక, పార్టీలో వుంటూ తమ పంతం నెగ్గించుకోవడమో చేస్తారనే అభిప్రాయమూ కూడా లేకపోలేదు. ఇదిలా వుండగా చిరంజీవికి కేంద్ర మంత్రి వర్గంలో చోటు లభించే అవకాశాలు పుష్కలంగా వున్న నేపథ్యంలో తిరుపతి స్థానానికి ఇటు పెద్ది రెడ్డి , అటు బొత్స సత్యనారాయణకు అనుకూలురుగా మెలుగుతున్న మాజీ ఎమ్మెల్యే వెంకట రమణకు ఉప ఎన్నికలో టిక్కెట్టు ఇప్పించి గెలిపించుకోవాలని, దీంతో జిల్లాలో సియంకు వ్యతిరేకంగా పూర్తి స్థాయి బలాన్ని సొంతం చేసుకుని, తద్వారా కాంగ్రెస్‌ అధిష్టానానికి తన సత్తా ఏమిటో చాటాలని పెద్ది రెడ్డి వ్యూహం రచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ముందు జాగ్రత్తగా ఇప్పటికే పె ద్ది రెడ్డి, పిసిసి ఛీప్‌ బొత్స తో చర్చించినట్లు సమాచారం. తిరుపతికి ఉప ఎన్నికలు తథ్యమైన నేపథ్యంలో ఈ స్థానంలో విజయావకాశాలు కాంగ్రెస్‌ పార్టీకే అధికంగా కనిపిస్తున్నాయి. తిరుపతి నియోజకవర్గంలో కాంగ్రెస్‌, వై.యస్‌ .ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీల మధ్యే ప్రధాన పోటీ నెలకొనే అవకాశాలు కనిపిస్తుండగా, ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం తృతీయ స్థానాని కి పరిమితమయ్యే అవకాశాం వుంది. కాంగ్రెస్‌ పార్టీకి బలమైన ఓటు బ్యాంకు కలిగిన వెంకటరమణ రూపంలో సమర్థ వంతమైన అభ్యర్థి వుండడం, మరో వైపు వై.యస్‌.ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో నెలకొన్న పరిణామాల నేపథ్యంలో అక్కడ టిటిడి మాజీ ఛైర్మన్‌ భూమన కరుణాకర్‌ రెడ్డిని కాదని, తుడా మాజీ ఛైర్మన్‌ చెవిరెడ్డి బాస్కర్‌ రెడ్డికే పోటీ చేసే అవకాశం కలుగనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా వుండగా తెలుగుదేశం పార్టీకి ఇప్పటి వరకూ సరైన అభ్యర్థి తిరుపతి నియోజకవర్గంలో కరువయ్యారు. స్థానిక అభ్యర్థుల నెవరినైనా పోటీ చేయిస్తారా, లేక నియోజక వర్గం వెలుపల నుండి అరువుతెచ్చిన అభ్యర్థిని ఎన్నికల్లో పోటీ చేయిస్తారా అనే సంశయం ఇంకా జిల్లా టీడీపిని వీడడం లేదు. ఇప్పుటికే పెద్దిరెడ్డికి రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ వ్యవహారాల ఇన్‌ చార్జ్‌ గులాం నబీ ఆజాద్‌ నుండి స్పష్టమైన హామీ రావడంతో ముందు ముందు, రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణలోను, అలాగే జిల్లాలోని నామినేటెడ్‌ పోస్టుల భర్తీలోను పెద్దిరె డ్డి వర్గాని కి పెద్ద పీట వేయనున్నారని ఆయన అనుచరులు ధీమాగా వున్నారు. మారు తున్న రాజకీయ సమీకరణాలు, వ్యూహాలు పరిశీలిస్తే తిరుపతి నియోజకవర్గంలో ఉప ఎన్నికలు జరిగి, అక్కడ కాంగ్రెస్‌ గెలిచిన నేపథ్యంలో పెద్ది రెడ్డి వర్గంలో మరో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే చేరే అవకాశం కనిపిస్తోంది. దీంతో పాటూ ఇటు పెద్ది రెడ్డి వర్గం కూడా జిల్లాలో బలం పుంజుకుని, అటు పిసిసి ఛీఫ్‌ బొత్స, ఇటు చిరంజీవి అండదండలతో జిల్లాలో పెద్ది రెడ్డి వర్గం రాష్ట్ర ముఖ్యమంత్రిని మరింతగా ఇబ్బంది పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ త్వరలో జరుగునున్న కేంద్ర మంత్రి వర్గ విస్తరణతో జిల్లా రాజకీయం విశ్లేషకులకు సైతం అందని అనూహ్య మార్పులు సంభవించడం ఖాయంగా తెలుస్తోంది.