23, జూన్ 2011, గురువారం

నల్లధనం రప్పించడానికి ఉద్యమాలే శరణ్యం

విదేశీ బ్యాంకుల్లో మూలుగుతున్న భారతీయ నల్లధనం తిరిగి దేశంలోకి రప్పించడానికి ప్రజా ఉద్యమాలే శరణ్యమని బిజెపి నేత బండారు దత్తాత్రేయ అన్నారు. అవినీతికి వ్యతిరేకంగా నోరెత్తే ప్రతివారిపై ఎదురుదాడే తప్ప దేశంలో రోజురోజుకూ వెలుగు చూస్తున్న అవినీతి కుంభకోణాలపై దేశ ప్రజలకు జవాబు చెప్పే పరిస్థితి లేదన్నారు. నాటి బోఫోర్స్‌ కుంభకోణంలో చేతులు మారాయని ఒప్పుకున్న 50కోట్ల రూపాయల కుంభకోణంతో పోల్చుకుంటే ఇప్పుడు వెలుగు చూస్తున్న కుంభకోణాలు ఎన్నో రెట్లు పెద్దవని, పివి. నరసింహారావు ప్రభుత్వంలో జరిగిన సిమెంట్‌ కుంభకోణంలో 150కోట్ల కుంభకోణం కూడా చాలా చిన్నదన్నారు.
ప్రధాన మంత్రి యుపిఎ చైర్‌పర్సన్‌ సోనియా గాంధీ కేవలం పనికిమాలిన ఉపన్యాసాలు ఇస్తున్నారే తప్ప, ఈ కేసులు విచారణకు ప్రభుత్వం వైపు నుంచి సహకరించటం లేదని, ప్రభుత్వంలోని పెద్దలు దిగ్విజయ్‌ సింగ్‌, కపిల్‌సింగ్‌ వంటి నాయకులు పౌర సమాజం ప్రతిపాదించిన లోక్‌పాల్‌ బిల్లుకు కొర్రీలు పెడుతూ, అవినీతిని ప్రశ్నించిన వారిపై సిబిఐ వంటి రాజ్యాంగ సంస్థలను ఉసిగోల్పుతున్నారని, ఈరోజు 2జి స్కాంపై జరుగుతున్న విచారణ కూడా బిజెపి పార్లమెంటును 25 రోజులు స్థంభింపజేస్తే తప్ప ఈ ప్రభుత్వం జెపిసి వెయ్యడానికి ఒప్పకోలేదని, ఆకారణంగానే 2జీ కేసు సుప్రీం ప్రత్యక్ష పర్యవేక్షణలో కొనసాగుతోందని ఆయన చెప్పారు.