మాతృదేశము కన్న మాతృ భాష కన్న
మధురమైనదేది మానవులకు!
స్వర్గమైన నేమి సౌఖ్యమ్ము లొనగూర్చు
తల్లి కన్నతల్లి భాష కన్న!
ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అనీ, దేశ భాషలందు తెలుగులెస్స అనీ గొప్పపేరు తెచ్చుకున్న తేనెలొలికే తెలుగు భాష తెలుగువారి చేతనే నిరాదరణకు గురి అవుతుంటే తెలుగు బాషాభిమానులకు చాలా బాధ కలుగుతోంది. తెలుగుకు ప్రాచీన భాష హోదా వచ్చినందువల్ల ఏమి ఒరిగింది? చాలామంది తెలుగువాళ్లు తెలుగులో మాట్లాడడం చిన్నతనంగా భావిస్తూ ఇంట్లోవాళ్లతో, బంధువులతో స్నేహితులతో ఇంగ్లీష్‌లో మాట్లాడుతున్నారు. అది ఒక గొప్ప ఫ్యాషన్‌గా భావిస్తున్నారు. మాతృభాషలో మాట్లాడడమే నిజమైన సంస్కృతీ ఫ్యాషనూ అని తెలుసుకోవడం లేదు వాళ్లు పాపం!
వీళ్లు పిల్లల్ని కూడా తెలుగులో మాట్లాడవద్దనీ ఇంగ్లీష్‌లోనే మాట్లాడమనీ నూరిపోస్తున్నారు. అందువల్ల ఈ రోజుల్లో చాలామంది పిల్లలకి తెలుగుమాటలు అర్థం కాక ''అంటే ఏమిటీ'' అని అడుగుతున్నారు. మమ్మీ, డాడీ అని పిల్లల చేత పిలిపించుకుంటూ చాలా మోడ్రర్న్ వాళ్లమని మురిసిపోతున్నారు తెలుగు తల్లితండ్రులు! అమ్మ, నాన్న అనే పిలుపులో ఉన్న మాధుర్యమూ, ఆప్యాయతా వీళ్లకి తెలియడంలేదు.
ఇప్పటి పిల్లలే కదా భావిపౌరులు? వీళ్లకి తెలుగురాకపోతే రాబోయే కాలంలో తెలుగుభాషే వినపడకుండా పోతుందేమోననీ తెలుగు క్రమంగా అంతరించిపోతుందేమోననీ భయం కలుగుతోందంటే అతిశయోక్తి కానేకాదు. ఈ ఇంగ్లీష్ పిచ్చి తెలుగువాళ్లకి ఉన్నంతగా మన దేశంలో ఇతర రాష్ట్రాల వాళ్ల కెవరికీ లేదు. వాళ్లు వాళ్ల మాతృభాషలలోనే మాట్లాడుకుంటారు.
ఈ మధ్య ఒక సినీ కవిగారు అన్నారుట ''నలుగురైదుగురు కూర్చుని ఆపకుండా ఇంగ్లీష్‌లో మాట్లాడుతున్నారంటే వాళ్లు తప్పకుండా తెలుగువాళ్లే అయి ఉంటారని తెలుస్తుంది అని''.
ఇక్కడ షాపుల వాళ్లకి కూడా ఇంగ్లీష్ మోజు ఎక్కువే! వాళ్లు ఇంగ్లీష్ మాట్లాడుతూ వచ్చిన కస్టమర్లకిచ్చే అతి గౌరవం తెలుగులో మాట్లాడేవాళ్లకివ్వరనిపిస్తుంది.
ఈ ధోరణిని అరికట్టాలంటే, ఇలా ఇంగ్లీష్‌లో మాట్లాడడం మొదలుపెట్టిన వాళ్లతో ఏమాత్రం సందేహించకుండా గట్టిగా ''ఏం? మీకు తెలుగు వచ్చుకదా ఇంగ్లీష్‌లో ఎందుకు మాట్లాడుతున్నారు?'' అని మన నిరసనని వాళ్లకి బాగా తెలియచెయ్యాలి. అలా వాళ్లకి చెప్పడం ఏమీ తప్పుకాదు. తప్పకుండా అందరూ నిర్భయంగా చెప్పాలి కూడాను.
ఎప్పుడైనా తెలుగుమాట సరైనది స్ఫురించకపోతే ఇంగ్లీష్ మాటలు ఉపయోగించడం ఏమీ తప్పుకాదు.
తెలుగు భాష అంతరించిపోకుండా ఉండాలంటే తెలుగు భాషాభిమానులు అందరూ పెద్దఎత్తున ఉద్యమం చేపట్టాలి. తెలుగు భాషను కాపాడుకోవాలి. తప్పకుండా చివరిగా ఒక మాటఏమిటంటే -ఇంగ్లీష్ భాషను ద్వేషించవలసిన అవసరమెంత మాత్రమూ లేదు. అది గొప్ప ప్రపంచ భాష? అందరూ తప్పకుండా నేర్చుకుని ప్రావీణ్యత సంపాదించవలసిన భాష? అందుకేమీ సందేహం లేదు.
--శ్రీమతి కె.హైమవతీ శాస్త్రి