మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రోత్సాహం ఉండడం వల్ల ఇసుక మాఫియా ఎక్కువైందని దానివల్ల భావితరాలకు భూగర్భజలాలు ప్రశ్నార్ధకమేనన్నారు. భూగర్భజలాలు అడుగంటుతున్నా, అడిగే నాధుడే కరువయ్యారని అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమైందని, మంత్రి ధర్మానకు తొత్తుగా వ్యవహరిస్తూ, అండగా ఉంటున్నారని టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు, కేంద్ర మాజీ మంత్రి కింజరాపు ఎర్రన్నాయుడు విమర్శించారు.
ఇసుక మాఫియాపై ప్రభుత్వం కొత్త విధానం తీసుకురావాలని లేకపోతే భూగర్భజలాలు అడుగంటక తప్పదని విమర్శించారు. అలాగే తెలుగుదేశం పార్టీ హయాంలోనే పాఠశాల భవనాలు ఎక్కువగా మంజూరు అయ్యాయని, వాటికి ప్రస్తుతం అధికారులు, కాంగ్రెస్ నాయకులు సున్నాలు వేస్తూ, మంత్రిధర్మాన ప్రసాదరావు గొప్పలు చెప్పుకుంటున్నారని ఆరోపించారు. పాఠశాల భవనాలలో నాణ్యత లేదని, అధికార యంత్రాంగం నిఘా కరువైందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో విద్యకు అనేక ఆటంకాలు ఎదురవుతున్నాయన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవినీతిలో కూరుకుపోవడం వల్ల దోపిడీ పాలన కొనసాగుతోందని దుయ్యబట్టారు.