23, జూన్ 2011, గురువారం
మరో నిత్య పెళ్లికొడుకు?
విజయనగరం జిల్లా నెల్లిమర్లకు చెందిన సురేష్ అనే యువకుడు అక్కడే హోమ్‌గార్డుగా పనిచేసేవాడు. అక్కడి నుంచి అతను భోగాపురానికి ఉద్యోగ రీత్యా వెళ్లాడు. భోగాపురంలోని గీత అనే అమ్మాయిని ప్రేమించాడు. పెళ్లి కూడా చేసుకున్నాడు. రెండు నెలల పసిబిడ్డ కూడా ఉంది. ఆ తర్వాత సురేష్‌కి ఎపిఎస్పీలో ఉద్యోగం వచ్చింది. శిక్షణ నిమిత్తం వరంగల్ వెళ్లాడు. శిక్షణ పూర్తయ్యాక తిరిగి విజయనగరంలోని ఎపిఎస్‌పికి వచ్చాడు. బంధువులు సంబంధం చూడటం మొదలుపెట్టారు. గంట్యాడ మండలం నరవ గ్రామంలో ఒక సంబంధం కుదిరింది. కావ్యశ్రీ అనే యువతితో సంబంధం నిశ్చయమైంది. తల్లిలేని కావ్యశ్రీ తన అమ్మమ్మ సత్యవతమ్మ దగ్గర ఉంటోంది. ఉద్యోగస్తుడు కాబట్టి లక్షల రూపాయల కట్నంతో పాటూ మూడు తులాల బంగారం, అర ఎకరా పొలం ఇచ్చేందుకు అంగీకారం కుదిరింది. ఈ మేరకు ఈ నెల 24న కావ్యశ్రీ, సురేష్‌ల వివాహం అన్నవరంలో జరగాల్సింది. ఈ క్రమంలోనే శుభలేఖలు అచ్చువేయించారు. కావ్యశ్రీ బంధువులు శుభలేఖ ఇచ్చేందుకు భోగాపురం లోని బంధువులు ఇంటికి వెళ్లారు. కావ్యశ్రీ బంధువులు శుభలేఖలో ఉన్న సురేష్ ఫోటో చూసి నివ్వెరపోయారు. ఇప్పటికే ఇతనికి వివాహమైందని కావ్యశ్రీ బంధువులకు చెప్పారు. విషయాన్ని స్పష్టంగా తెలుసుకునేందుకు కావ్యశ్రీ బంధువులు భోగాపురంలోనే ఉన్న గీత దగ్గరకు వెళ్లి నిర్ధారించుకున్నారు. దీంతో షాక్ కు గురైన కావ్యశ్రీ బంధువులు వెనుదిరిగి వచ్చేశారు. అయితే ఈనెల 21న మంగళవారం సురేష్ తల్లిదండ్రులు నరవ లోని కావ్యశ్రీ ఇంటికి భోజనాలకు వచ్చారు. సహజంగానే కావ్యశ్రీ బంధువులు సురేష్ తల్లిదండ్రులను నిలదీశారు. సురేష్‌కు పెళ్లయిన విషయం ఇంతకుముందే ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. అయితే ఈ విషయమై తమ కుమారుడు చెబుతాడని, సురేష్ తల్లిదండ్రులు చెప్పడంతో సంతృప్తి చెందని కావ్యశ్రీ బంధువులు సురేష్ తల్లిదండ్రులను ఒక గదిలో పెట్టి నిర్భందించారు. వెంటనే సురేష్ రంగంలోకి దిగాడు. గంట్యాడ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. కావ్యశ్రీ బంధువులు నిర్భందించిన తన తల్లిదండ్రులను కోరాడు. పోలీసులు కూడా రంగ ప్రవేశం చేసి ఎట్టకేలకు సురేష్ తల్లిదండ్రులను విడిపించారు. తర్వాత వ్యవహారం మొదలైంది. సురేష్, కావ్యశ్రీల బంధువులు, గ్రామ పెద్దలు రంగంలో దిగారు. కొంతమంది రాజకీయ నాయుకులు కూడా మధ్యవర్తిత్వం నెరిపారు. మొత్తంమీద ఇరువర్గాల మధ్య చర్చోపచర్చలు నిరాటంకంగా సాగుతున్నాయి. చర్చలు ఓకే అయితే సరే... లేకపోతే పోలీస్ కేసే... కాగా, దీనిపై పోలీసులు ఎప్పటిలాగానే స్పందించారు. ఈ విషయం తమకు తెలియనట్లు చెప్పారు. దీంతో మరోసారి పోలీసులు తమంతట తామే తమ బేలతనాన్ని చాటుకున్నారు