23, జూన్ 2011, గురువారం

పారిపోయిన ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్‌

సర్కస్‌ రాముడు చిత్రంలో ఎన్టీఆర్‌ హీరో. ఒక విగ్రహానికి ఆయన దండ వేసే సన్నివేశం చిత్రీకరణకు ఏర్పాట్లు జరిగాయి. ఆ విగ్రహంకి పక్కన ఏర్పాటు చేసిన నిచ్చెన ఎక్కి పూలదండ వేయాలి ఎన్టీఆర్‌. ఆర్ట్‌ డిపార్ట్‌ మెంట్‌ వారు ఆ ఏర్పాట్లు చేసారు.

''షాట్‌ రెడీ'' అని డైరక్టర్‌ దాసరి నారాయణరావు అనగానే ఎన్టీఆర్‌ నిచ్చెన ఎక్కుతున్నారు. కొన్ని మెట్లు ఎక్కాక ఒక అడ్డుమెట్టు విరిగింది. ఎన్టీఆర్‌ దఢాల్న కింద పడ్డారు. ఆ చప్పుడుకు అందరూ కంగారు పడిపోయారు. విషయం తెలుసుకున్న ఆర్ట్‌ డిపార్ట్‌ మెంట్‌కి చెందిన సభ్యులంతా తుపాకీ దెబ్బకు దొరకని వారై ఆచూకీ తెలీకుండా పారిపోయారు.

ఎన్టీఆర్‌ లేచి నిలబడ్డారు.

ఎవర్నీ ఏమీ అనలేదు. అడగలేదు.

ఏమీ జరగనట్టుగా ''నారాయణరావుగారూ నెక్ట్‌ ్స సీన్‌ ఏమిటి?'' అన్నారు కూల్‌గా. ఇంకెవరయినా అయివుంటే ఎంత హడావుడి జరిగేదో కదా అనిపిస్తుంది. అనిపించడమేమిటి చాలా గందరగోళం హడావుడి, ఉరుకులు పరుగులు వుండేవి.

ఎన్టీఆర్‌తో పని చేయడమే ఒక అదృష్టం. ఎన్టీఆర్‌ శోభన్‌బాబు, కృష్ణ, అక్కినేని, కృష్ణంరాజు తరం ఆర్టిస్టులుతో పనిచేయడం నిజంగా అదృష్టం. తరువాత తరాల్లో కాదా అంటే ఇప్పటి తరంతో నేను పనిచేయలేను. వారంతా మంచి క్రమశిక్షణ గలవారు. క్రమశిక్షణ కాదు చాలా విషయాలు వీరిదగ్గర పనిచేసిన వారు నేర్చుకోవచ్చు. ప్రొఫెషన్‌ మీద వారికి వుండే గౌరవం అంతా ఇంతాకాదు. ఎన్టీఆర్‌ నటించిన చిత్రాన్ని నేను డైరక్ట్‌ చేయలేదు గాని మా గురువుగారు డైరక్ట్‌ చేస్తున్న వాటికి అసిస్టెంట్‌గా, అసోసియేట్‌గా పనిచేసాను. ఎన్టీఆర్‌ తన పనేదో తాను చూసుకుంటారు. ఎవరినీ కించపరచరు. అందర్నీ గౌరవంగా సంబోధిస్తారు. బాయ్‌ని కూడా 'బాయ్‌గారూ' అని పిలుస్తారు. నేను సర్కస్‌రాముడు, మనుష్యులంతా ఒక్కటే, బొబ్బిలి పులి వగైరా చిత్రాలకు పనిచేసాను. 'సర్దార్‌ పాపారాయుడు'కి పనిచేయలేదు గాని షూటింగ్‌కి వెళ్ళేవాణ్ణి.

- డైరెక్టర్ రేలంగి నరసింహ రావు