తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలపై దాడికి పాల్పడితే తెలంగాణ వస్తుందా అని పంచాయతీరాజ్ శాఖ మంతి జానారెడ్డి తెలంగాణవాదులను సూటిగా ప్రశ్నించారు. ఇలా పరస్పరం దాడులకు పాల్పడితే తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ మరింత జాప్యం అవుతుందని జానారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రొఫెసర్ జయశంకర్ మృతదేహాన్ని సందర్శించడానికి వెళ్లిన కాంగ్రెస్ ఎంపిలు, ఎంఎల్‌ఏలపై తెలంగాణ వాదులు చేసిన దాడిని ఆయన ఖండించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తాము చిత్తశుద్ధితో ఉన్నామని, తమ వాదనను గత వారం ఢిల్లీకి వెళ్లినపుడు అధిష్టానం ముందు తీవ్ర స్థాయిలో వినిపించామన్నారు. సమస్యకు పరిష్కారం ఎక్కడ ఉఉందో..అక్కడే తీవ్ర స్థాయిలో తమ వాదనను వినిపించాలి తప్ప బహిరంగంగా ఢాంబికాలు, ప్రగల్భాలు పలకొద్దని ఆయన హితవు పలికారు. రెండు సమూహాలుగా విడిపోతే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అంతరాయం కల్గుతుందని, అలా ఆటంకపరిచే వారు కారణభూతులు అవుతారన్నారు.