1, జనవరి 2012, ఆదివారం

పేదలకు భరోసా... రూపాయికే కిలో బియ్యం...2011లో పౌర సరఫరాలు

దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న పేదవర్గాలు, రైతుల సంక్షేమానికి కొత్త పథకాలు చేపడుతూ వారికి తామున్నామని రాష్ట్ర ప్రభుత్వం భరోసా ఇస్తోంది. ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం 2011 సంవత్సరంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నప్పటికీ, ఒక్కో అడుగు ముందుకు వేస్తూ సంక్షేమ బాటను పట్టింది.
పేద వర్గాలకు ఆహారభద్రత ఇవ్వాలనే ఉద్దేశంతో కేవలం రూపాయికే కిలోబియ్యం పథకం ప్రారంభించి ఈ వర్గాలలో ధైర్యాన్ని నింపింది. అదే సందర్భంలో ధాన్యం సేకరణలో ముందడగు వేస్తూ రైతులకు కూడా అండగా ఉన్నామని చాటుతోంది. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ పరిధిలో ఈ రెండు కార్యక్రమాలను విజయవంతంగా చేపడుతోంది.
ప్రభుత్వం ప్రారంభించిన రూపాయికే కిలోబియ్యం పథకం ద్వారా రాష్ట్రంలోని తెల్లకార్డులున్న 2.26 కోట్ల కుటుంబాలకు లబ్ది చేకూరుతోంది. దీని వల్ల ప్రభుత్వంపై రూ. 2,600 కోట్ల భారం పడుతుందని అంచనా వేసినప్పటికీ, ఆహారభద్రతలో భాగంగా చౌకధరకే బియ్యం పంపిణీకే సిద్ధపడింది. రాష్ట్ర అవతరణ దినోత్సవమైన నవంబర్‌ 1 న ఈ పథకాన్ని ప్రారంభించింది. కూరగాయల ధరలు పెంచి రూపాయికే బియ్యం ఇస్తే ప్రయోజనమేమని ప్రభుత్వంపై విమర్శలు వచ్చినప్పటికీ, ప్రభుత్వం వెరవకుండా ఈ పథకాన్ని కొనసాగిస్తోంది.
ధాన్యం సేకరణలో సైతం ప్రభుత్వం పురోగతిలో ఉంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సంవత్సరం ధాన్యం సేకరణ జరిగింది. ప్రభుత్వం చూపిన చొరవతో పాటు రైతు సంఘాలు, ప్రభుత్వేతర సంఘాలు, రాజకీయ పార్టీల ఒత్తిడుల మూలంగా ధాన్యం సేకరణ ఈ సారి బాగా పెరిగింది. గత ఖరీఫ్‌ కంటె ఈ సారి ధాన్యం కొనుగోలులో ప్రభుత్వ, ప్రైవేట్‌ ఏజెన్సీలు ఆసక్తిని పెంచాయి. ఈ ఖరీఫ్‌ సీజన్‌లో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ, భారత ఆహార సంస్థ (ఎఫ్‌సిఆ), ఇందిరాక్రాంతి పథం( ఐకెపి) సంస్థలు 1577 కొనుగోలు కేంద్రాల ద్వారా 7,39,577 మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరించాయి. రైస్‌ మిల్లర్లు 27,59,492 మెట్రిక్‌ టన్నుల ధాన్యం ఆధికంగా కొనుగోలు చేశారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ ఏజెన్సీలు కలిపి గత డిసెంబర్‌ 26 వరకు 35,35,980మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరించాయి. గత సంవత్సరం 20,51,056 మెట్రిక్‌ టన్నుల ధాన్యం మాత్రమే సేకరించాయి. నిరుడు కంటె ఈ సంవత్సరం 14,84,924 మెట్రిక్‌ టన్నుల ధాన్యం అధికంగా కొనుగోలు చేయడం విశేషం. లెవీ కింద భారత ఆహార సంస్థ (ఎఫ్‌సిఐ) 9,54,732 మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరించింది.
వరి గ్రేడ్‌ -ఎ రకం ధాన్యానికి రూ. 1110, సాధారణ రకం వరికి రూ. 1080 చెల్లిస్తున్నామని, మద్దతు ధర, ఇతర సమస్యలపై తమ ఫిర్యాదులను టోల్‌ ఫ్రీ నంబర్‌ 1804 252977 , 1804 250082 లను అందుబాటులో ఉంచారు. కొనుగోలు కేంద్రాలు పెంచాల్సిన అవసరం ఉందనుకుంటే వెంటనే ప్రారంభించేందుకు జాయింట్‌ కలెక్టర్లు, పౌరసరఫరాల శాఖ అధికారులకు అధికారాలను దఖలు చేసింది. ఇవేగాక చౌకధరల దుకాణాలను సరకులు నల్లబజారుకు తరలించకుండా తనిఖీలను కూడా పెంచింది. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి డి శ్రీధర్‌బాబు ఈ పథకాలను పకడ్బందీగా చేపట్టేందుకు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు.