1, జనవరి 2012, ఆదివారం

సుందర సముద్యమం..సుందర చైతన్యం

''తరువులు కరువు తీర్చవచ్చు బ్రతుకుతెరువు మార్చలేవు. నీడను ప్రసాదించవచ్చు మాయను తొలగించలేవు.
ఏ తరువు ఆ ఫలాన్నే ఇస్తుంది. కానీ కల్పతరవు కోరినవన్నీ ఇస్తుంది. కల్పతరువు నీడలో కరవులు తీరతాయి.
బరువులు దిగుతాయి. కానీ అజ్ఞానాన్నీ తొలగించి మోక్షాన్ని ప్రసాదించడం కల్పతరువుకు కూడా సాధ్యం కాదు.
అది గోవింద కల్పతరువు లాంటి గీతాజ్ఞానంతో మాత్రమే అది సాధ్యపడుతుంది.
ఎందుకంటే అసలు మోహం, కోరికలే నశించినప్పుడు ఇక కల్పతరువు అవసరం ఏముంటుంది?''
గీతాసారాన్ని ఇంత అద్భుతంగా, అలవోకగా, అలతి అలతి పదాలతో ఆవిష్కరించడంలో, మారాం చేస్తున్న బాలుడికి తల్లికొసరి కొసరి
గోరుముద్దలు రుచి చూపిస్తూ దారికి తెచ్చుకొనే తీరులో బోధించడంలో ఆయనదొక విలక్షణ శైలి. ఘనీభవించిన హృదాంతరాలను కూడా
చలింప చేయగల శక్తి ఆయన మాటలకు ఉంది. ఆయన ప్రవచనాలకు ఆధ్యాత్మిక పరిమళాలు గుబాళించడమే కాదు సమతా, మమతా, మానవతా విలువలు రవళిస్తాయి. అజ్ఞాన అమవస కుటిలో జ్ఞానకాంతులు అఖండ దీపావళులై ప్రకాశిస్తాయి. భక్తి తాత్పర్యాలే కాదు
గీర్వాణాంధ్ర భాషామతల్లి జాతీయాల స్వర్ణాంబరాలతో అలలరారుతుంది ఆయన రచనలకు, అమృతోపమానమైన పలుకులకు.
అందుకే ధార్మిక మహోద్యమంలో ఆయన ఒక చైతన్య కెరటం. సమస్త వేదార్ధ సార ప్రభోదంలో ఆయన వ్యాఖ్యానం సుందరం, సుమధురం.
అశేష, విశేష భక్తజనావళికి ఆయన ఆరాధ్య దైవం. సంక్లిష్టమైన భగవద్గీతను సమకాలీన సమాజానికి అర్థమయ్యే రీతిలో విరచించిన ధన్యులు. ఆయనే శ్రీశ్రీశ్రీ సుందర చైతన్యానంద స్వామి. ప్రపంచంలో భౌతిక వాదంవైపు ఉరుకులు, పరుగులూ పెడుతూ ఉన్నస్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకోవాలనే దురాశలో ఉన్న స్థితినే భిన్న భిన్నం చేసుకొంటున్న వేళ ధర్మభూమి, కర్మభూమి, వేదభూమిలయిన భరత భూమిలో విలువలకు అర్థాన్ని వివరిస్తూ మానవ జీవితానికి సార్థకతను ప్రభోదిస్తూ మానవాళికి దిశానిర్దేశం చేస్తోన్న స్వామి సుందర చైతన్యానంద స్వామి.
శ్రీ స్వామీజీ వారి మాటలూ, పాటలూ, వ్యాసాలూ, వ్యా ఖ్యా నాలూ, కవితలూ, సర్వతోముఖ వికాసాన్ని సంతరించుకొన్నాయి. అవి జనులలోని జడత్వాన్ని పోగొ ట్టి, హృదయాలకు చైతన్యాన్ని సమకూర్చే పదునైనసాధనాలుగారూపొందాయిమానవ జాతి ని ఒక మహోన్నత స్థితికి, ఉదాత్త రసాన్విత స్థాయికీ, ధర్మబద్ధ జీవనరీతికి నడిపించడానికి యుగయుగాలు గా మహానుభావులు జన్మిస్తూ ఉం టారు. వారు దేవుని దూతలుగా మాన వ లోకానికి వచ్చి మానవుల్ని చైతన్యవంతులుగా చేస్తూ ప్రతిఫలాపేక్ష లేకుండా తమవంతు కృషిని భగవదర్పణగా నిర్వహిస్తారు. అట్టి మహనీయుల కోవకు చెందినవారేశ్రీసుందర చైతన్యానంద స్వామి.
లలిత లలిత పదాలతో, మలయమారుతంగా సాగే వీరి ప్రవచనాలు విన్నా, సువర్ణాలతో సద్గుణ శోభితమైన వీరి రచనలు చదివినా, తనువు మనసూ పులకరించ వలసిందే. సాధారణంగా లోకంలో ఉత్తమ ప్రవచనం చేసేవారు పెద్ద గా రాతకోతల వైపు శ్రద్ధ పెట్టరు. శబ్దార్థబంధుర రస సమన్వయంగా రచనలు చేసేవారు ప్రవచనాల జోలికి పోరు. అలా కాకుండా రచన,ప్రవచనమూకూడా రమ్యాతి రమ్యం గా చేయగల శక్తి శ్రీ సుందర చైతన్యస్వామి వారి సొత్తు. వారి రచనలు అన్నీ ఆణిముత్యాలే. చదువుల తల్లికి సమర్పించిన అపూర్వ ఆభరణాలే. ఆస్తిక ప్రపంచానికి సర్వదా ఆదరణీయాలే. సర్వధా శిరోధార్యాలే.
స్వామి అమృత లేఖి ని నుండి ఎన్నో! ఎన్నెన్నో! మరెన్నో! ఇంకెన్నో! అమూల్య గ్రంథాలనుహిందూసమాజం ఆశిస్తోం ది. అనితర సాధ్యంగా, అసమాన తేజంతో స్వామీజీ నిర్వి రా మంగా సాగిస్తున్న ప్రచారోద్యమానికి లబ్ధ ప్రతిష్ఠులు, సర్వసంగ పరిత్యాగులు అయిన పరమహంసలు కూడా మహాజ్ఞాన యజ్ఞానికి పులకించిపోయారు.
''సుందర చైతన్యస్వామి కలకాలం జీవించుగాక! పూర్ణ ఆయురారోగ్యాలతో ఈ ధర్మ ప్రచార ఉద్యమంలో, జన జాగరణ కార్యములో వర్థిల్లు గాక అంటూ అమృత వాక్కులు కురిపించారు.' వేదాలలో, రామాయణ భాగవతాది పురాణ ఇతిహాసాలలో నిక్షిప్తమై ఉన్న జ్ఞానమణులను వెలికితీసి వితరణ చేయడంలో వారికి వారే సాటి. వారి జీవన విధానం, వారి ప్రచోరోద్యమం అంతులేని కళలతో, విశేషజ్ఞానవైభవంతో విరాజిల్లుతూ ఉన్నాయి.
గహనమైన విషయాలను సరళమైన శైలిలో అక్షర రూపంలో లిఖించి అలరించే నేర్పు పరమాత్మవారికిచ్చిన అపురూపమైన వరం. సరస్వతీ కటాక్షం వారిపై పూర్ణంగా ఉంది' అన్నారు ఋషీకేశం శివానందాశ్రమం పీఠాధిపతులు శ్రీ చిదానంద స్వామి.
అనాదిగా ఏర్పడి,శాఖోపశాఖలుగా విస్తరించి, మహర్షి ప్రవ ర పరిపుష్టమై శాంతి సుఖ పుష్పఫలాలనందిస్తూ, ఆశ్రితుల నందరినీ ఆనందపరుస్తోన్న సనాతన భారతీయ హైందవ ధర్మ సంప్రదాయ వృక్షాన్ని పరిరక్షించడమే -సర్వతోముఖంగా పునర్వికాస పరచడమే స్వామీజీ సముద్యమ లక్ష్యం. కేవలం పట్టణాలలో నగరాలలోనే గాక గ్రామా గ్రామాల్లో, వాడవాడలా ప్రసంగించడం -గ్రంథాలు చదివించడం -గీతా ప్రబోధం చేయడం, సంకీర్తనం, గానం చేయడం, త ద్వారా ఎల్లరనూ ఆకర్షించి, వారికి కర్తవ్యాన్ని ప్రబోధించి, వారు స్వధర్మాన్ని అనుష్ఠించేటట్లుగా పరధర్మ వ్యామోహితులు కాకుండా కర్తవ్య పాలనం చేసేటట్లుగా, నవ్య వాతావరణాన్ని పునర్నిర్మించడం సముద్యమ స్వరూపం. అసాధారణ ధారణాశక్తితో అనర్ఘ -అపార విజ్ఞానంతో అకుంఠిత సమయస్ఫూర్తితో, అసమానమేధాసంపన్నతతో, శ్రీ స్వామీ జీ చేస్తున్న నిర్విరామ ధర్మ ప్రచార ప్రసారాలు ఫలవంతమౌతున్నాయి. సోమరులు కార్యశూరులౌతున్నారు. అజ్ఞానులు జడత్వాన్ని వదలుతున్నారు.అశ్రద్ధాళువులు శ్రద్ధా ళువులౌతున్నారు. అజిజ్ఞాసువులు జిజ్ఞాసువులౌతున్నారు.
ఆధ్యాత్మికానుష్ఠానం ప్రారంభిస్తున్నారు. చైతన్యం తన స్వభావ ధర్మం తో వెల్లివిరుస్తోంది. ఈ మహోన్నత వైభవానికి, సమాజ అభ్యుదయానికి హారతీ కర్పూరంలా సాగిపోతున్న శ్రీ స్వామివారి అద్భుత కార్యాలను స్వయంగా వీక్షించిన అంతర్జాతీయ రామకృష్ణ మఠాధ్యక్షులు శ్రీ రంగనాథానంద స్వాముల వారు సైతం ఆశ్చర్యచకితులయ్యారు.
1994లో కడపలో సుందర చైతన్యానంద స్వామీజీ 18 రోజుల పాటు నిర్వహించిన భాగవత యజ్ఞానికి ముఖ్య అతిథిగా హాజరైన ఉడిపి పెజావరు మఠాధ్యక్షులు శ్రీశ్రీశ్రీ విశ్వేశ తీర్థులు వారు 'జ్ఞానబ్రహ్మ' బిరుదముతో స్వామి వారిని సత్కరించారు. శబ్దమాధుర్యం, అర్థగాంభీర్యం, అలంకార చాతుర్యం, వ్యంగ్య వైభవం, లలిత పదవిన్యాస కళా ప్రావీణ్యం, ఆంగ్లభాషా వైదుష్యం, సంస్కృతాంధ్ర సాహిత్య సర్వంకష ప్రజ్ఞా విశేష వాగ్వైభవం, ప్రతిభా సంపద, ధారణాబలం, ధారుశుద్ధి, అభ్రంగంగా వేగం, ఇవన్నీ కలిసిమెలసి, ఒక్కటిగా, ఒక్కొక్కటిగా ఆయన ఆశించాయి. శ్రీ సుందర చైతన్యానంద స్వామి భారతీయ విజ్ఞాన సర్వస్వం. సనాతన ధర్మ పరిమళం. ఆర్ష సంస్కృతీ సభ్యతల భాండాగారం. ఆధునిక లోకంలో, ధర్మ ప్రబోధం చేయడం సులభసాధ్యం కాదు. వేద, శాస్త్ర, పురాణరహస్యా లను పండిత పామర జనరంజకంగా ప్రవచించడం సుగమం కాదు. వితండవాదుల ప్రశ్న పరంపరలకు సంతృప్తికరంగా, సశాస్త్రీయంగా, అనుభవ పురస్సరంగా, సమాధానం మివ్వడం నల్లేరుపై బండినడక కాదు. ఎంతో శాస్త్ర
పరిచయం, గ్రంథావలోకనం, తపోనిష్ఠ, ప్రాచ్య, పాశ్చాత్య సాహిత్య పరిశీలన, పరిశోధన, లోకానుభవం, సమయస్ఫూర్తి, హాస్య చతురత, సమ్మోహనాశక్తి, శాబ్దిక మహేంద్ర జాలం ఎంతగానో అవసరం. ఇన్ని శక్తియుక్తులు కలిగి యుంటేనే, వేదికపై వీరవిహారం చేసి, ఆధ్యాత్మిక జైత్ర యా త్రను దిగ్విజయంగా కొనసాగించడం సాధ్యం. శ్రీ స్వామీజీలో ఈ లక్షణాలన్నీ పుష్కలంగా తిష్ఠ వేసుకున్న కారణం
చేతనే ఆయన ప్రసంగాలకు శ్రోతలు లక్షలాదిగా ఆకర్షితులవడం, శ్రీవారి ఉపన్యాసాలను అత్యంత భక్తి శ్రద్ధలతో ఆలకించడం, వారి వాగ్ధాటికి శిరస్సు వంచి నమస్కరించడం జరుగుతూ ఉంది. ఒక తత్త్వవేత్త, అద్వైత సంప్రదాయాని కి చెందిన గురువు వివిధ రంగాలలోని మహిమాన్వితుల ను, మేధావులను చలింప చేయడమనేది సాధారణమైన విషయం కాదు.
కవి పుంగవులనే కాకుండా, మేధావులైన పత్రికా ప్రతినిధులను సైతం కదిలించింది స్వామీజీ అపార మేధాసంపత్తి.
'ఓం' అంటే వెయ్యి వీణలు మంద్రస్థాయిలో మీటి నట్లుంటుంది ఆయన గొంతు.స్వామి వారి మాటలు -హిమవత్‌ పర్వత సానువుల నుండి ఉరకలు వేస్తూ వచ్చే అలకానంద గలగలలు! ఆర్ద్రతతో, ఆవేశంతో, ఆర్థ గాంభీర్యంతో, అనిమిషులు తలలూపే మార్దవమైన గానంతో భాగవతాన్ని స్వామి సుందర చైతన్యానంద చెబుతుంటే వినడం చెవులకు, మనసుకు పెద్ద పండగే.
కృష్ణుడు నుండి కబీరు దాకా, స్తోత్ర రత్నావళి నుండి నిర్గుణ మానసపూజ దాకా శ్రీ సుందర చైతన్యులు వ్యాఖ్యానించని సనాతన సాహిత్యాంశం లేదేమో? అనిపిస్తుంది.
ఈయన కాలెండరు లోనూ సంవత్సరానికి మూడువందల అరవై రోజులే కదా? రోజుకు 24 గంటలే కదా?' అని ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక పూర్వ సంపాదకులు, బహుగ్రంథ రచయిత శ్రీ వాకాటి పాండురంగరావు గారు ప్రస్తుతించారు. పత్రికారంగ ప్రముఖులే గాక విశిష్టులైన రాజకీయ విజ్ఞులు కూడా స్వామీజీ వక్తృత్వానికి ముగ్ధులయ్యారు.
''స్వామీజీ కారణజన్ములు అనేది నా వ్యక్తిగతమైన భావన. వారి ప్రసంగాలు గంగా ప్రవాహంలా సాగుతాయి. ప్రతి పలుకు అర్థవంతంగా ఉంటుంది. ప్రసంగాలతో పాటు అనేకములైన రచనలు చేసి జనతను జాగృతంచేశారు. చేస్తున్నారు. బిడ్డ ఎంత ప్రయో జకుడైనా, బిడ్డ ప్రగతిని గాంచి తల్లిదండ్రులు ఎంతగా పరవశించినా, బిడ్డను బిడ్డ ముందే పొగడటానికి తల్లిదండ్రులు ముందు వెనుక లాడుతారు. కాని, శ్రీ సుందర చైతన్యానంద స్వామికి దీక్షా గురువులు, అంతర్జాతీయ ఖ్యాతి
గడించిన యోగి పుంగవులు, కవియోగి, మహర్షి శ్రీ శుద్ధానంద భారతీ స్వాములవారు స్వామీజీ ఔన్నత్యాన్ని గాంచి ఉప్పొంగి బహిరంగంగానే శిష్యుని స్తుతించడము ఒక అపూర్వమైన విషయంగా విజ్ఞులు విస్తుపోయారు.
అందుచేతనే, బహుముఖ ప్రజ్ఞాశాలురు, రచయితలు, మేధావులైన అమూత్యులు సైతం స్వామి వారి బాటను దేశానికి శ్రీరామరక్షగా అభివర్ణించారు. 'జనసముదాయాన్ని సమ్మోహనం చేయడంలో, తన్మయుల్ని చేయడంలో, ప్రభావితుల్ని చేయడంలో శ్రీ సుందర చైతన్యస్వామి సాటిలేని మేటి. జనచైతన్యానికి మరో నామమెె సుందర చైతన్యం.
విజ్ఞానం వెదజల్లి, ఆధ్యాత్మిక చింతన కలిగించి, పెంచి, మానవత్వపు విలువలు విస్తృతంగా వ్యాప్తి చేసేఅనంతమైన శక్తి శ్రీ సుందర చైతన్య స్వామిలో మూర్తీభవించి ఉంది. ఆయన మాట మధురం -ఆయన మనసు కోమలం.
అందుచేతనే స్వామీజీని వ్యక్తిగా కాకుండా శక్తిగా విజ్ఞులు అంచనా వేస్తున్నారు. యంత్రశక్తిగా, మంత్రమూర్తిగా వారి ని కీర్తిస్తున్నారు. నాలుగు దశాబ్దాలుగా దేశమంత పర్యటిం చి, ప్రవచన పరంపరలతో ప్రజానీకాన్ని పరవశింపచేసి, విశిష్టమైన రచనలతో సాహిత్య లక్ష్మి అర్చించి, సుందర సత్సంగములను స్థాపించి, జ్ఞానయజ్ఞ మహాక్రతువులను వైభవోపేతముగ నిర్వహించి, ధవళేశ్వరము, భాగ్యనగరము, విశాఖపట్టణములలో సుందరచైతన్యాశ్రమములను స్థాపించి, వే లాది భక్తజనుల హృదయ మందిరాలలో కొలువుండి, తమ జీవితాన్ని సమాజ కళ్యాణానికై సమర్పించిన త్యాగధనులు గురుదేవులైన శ్రీ సుందర చైతన్యస్వామి. స్వామివారి బహుముఖ ప్రజ్ఞాపాటవాలు సాహిత్య, సంగీత, వేదాంత లోకాలనే గాక, కళారంగాలను కూడా కదిపింది. సినీ దర్శకులు, కళాతపస్వి శ్రీ కె.విశ్వనాథ్‌ గారు వెలిబుచ్చిన అభిప్రాయాలు ఈ వాస్తవానికీ అద్దం పడతాయి.
'స్వామీజీ ప్రవచనం చేస్తూ ఉంటే లక్షలాది మంది పిన్డ్రోప్‌ సైలెన్స్‌తో విం టారు.వారిలో ఒక మహత్తరమైన సమ్మోహనా శక్తి ఉంది' అని చాలామంది నాతో అన్నారు. ఆ రోజు వారి మాటలు నేను నమ్మలేదు. ఆయన భక్తులు కదా! ఏదో అతిశయోక్తిగా చెప్పి ఉంటారులే అనుకున్నాను. ఒకరోజు సాయంత్రం నాకు కాస్త తీరిక దొరికితే ఊరకే చూసి వద్దామని విశాఖపట్టణంలో బుల్లయ్య కాలేజి ప్రాంగణానికి వెళ్లాను. అక్కడ చూసేసరికి అబ్బో!ఆ మైదానమంతా జన సమూహం కాదు, ఒక జన సముద్రం. స్వామి వారు 'గలగలగల' లాడించేస్తూ ఉన్నారు.
బాబోయ్‌! ఇదేమిటి! పది సంవత్సరాలుగా నేను సౌండ్‌ రికార్డిస్ట్‌గా పనిచేసినాను. ఇటువంటి వాయిస్‌, ఇటువంటి మోడ్యులేషన్స్‌ నేను ఎప్పుడూ ఎక్కడా వినలేదు. సాధారణంగా వేదంలో ఉదాత్త అనుదాత్తాలు ఉంటాయి. వాటిని అనుసరించి వేదం పఠిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మామూలు గద్యమే ఒక వేదంలా వినిపిస్తూ ఉందేమిటి అని ఆశ్చర్యపోయాను. ఇది సుమారు 20 సంవత్సరాల క్రితం విషయం. అది రామాయణంలో శ్రీరాముని పట్టాభిషేకం ఘట్టం.
ఎక్కడో సుదూరంగా ఆ జనసముద్రానికి ఆవ ల కారు నిలుపుకొని, అక్కడే ఒక ముప్పావుగంట నిలుచుని ముగ్ధుడినై ఆ ప్రవచనం విన్నాను. ఆ రోజు నాలో కలిగిన స్పందనను నేను ఈ నాటికీ మరువలేను. నా ఆనందాన్ని చూసి మరునాడు ఎవరో అన్నారు 'మీరు స్వామీజీతో మాట్లాడతారా?' అని. నేనన్నాను అమ్మో! ఆయనతోనా? ఆయనతో నేనెలా మాట్లాడగలను? అని. అప్పుడు వారన్నారు. 'లేదు, స్వామి వారు ప్రేమ హృదయులు. వారు అందరితో నూ మాట్లాడతారు' అని. మేము ఎప్పుడు ఆశ్రమానికి వెళ్ళి నా స్వామి వారు ఎంతో ఆప్యాయంగా మాతో కూర్చొని మాట్లాడతారు'అన్నారు కళాతపస్వి శ్రీ కె.విశ్వనాథ్‌ గారు.
సినీ కవి, సహజకవి, బహుగ్రంథ రచయిత శ్రీ మల్లెమాల సుందరరామిరెడ్డి గారు స్వామీజీ వాగ్వైభవాన్ని అమోఘం గా స్తుతించారు.
ఎంతో సునిశితంగా పరిశీలిస్తే గాని అర్థం కాని మరొక కోణం కూడా స్వామీజీలో విలక్షణంగా ఉంది. వారికి జ్ఞాన ప్రచారం విషయంలో ఎంత ప్రగాఢమైన నిబద్ధత ఉందో, అలాగే విలువలు క్షీణిస్తున్న సమాజ పతనాన్ని చూచి వ్యథ చెందే హృదయం కూడా ఉంది. అవసరమైతే, కలాన్ని కత్తి లా ఝళిపించే వాడి, వేడి కూడా ఉంది. చివరగా, స్వామీ జీ జన్మదిన వేడుకల ప్రస్తావన. స్వామీజీ 64వ జన్మదినోత్సవ వేడుకలు హైదరాబాద్‌ శివారులోని సుందర చైతన్యాశ్రమంలో నేడు వైభవంగా జరుగుతున్నాయి.
1947 డిసెంబర్‌ 25వ తేదీ క్రీస్తు పుట్టిన రోజున స్వామీజీ జన్మించారు. ఆ రోజే వైకుంఠ ఏకాదశి, గీతాజయంతి కూడా కలిసి రావడం విశేషం.
రెండువందల పన్నెండు జ్ఞానయజ్ఞాలను నిర్వహించిన స్వామీజీకి, వందకు పైగా అద్భుతమైన గ్రంథాలను రచించి ప్రచురించిన గురువు పాతికేళ్ళుగా ఇరవై వేల మంది జీవిత సభ్యులను కలిగిన 'గిరిధారి' పత్రిక సంపాదకత్వం నెరపిన ఆచార్యునికి ఈ సంవత్సరం జయంతి వేడుకలను నిర్వహించడానికి మూడువేలమంది ప్రతినిధులు వివిధ రాష్ట్రాల నుండి, విదేశాల నుండి విచ్చేస్తున్న వేళ. జ్ఞానబ్రహ్మ, ఆర్షవిద్యా వాచస్పతి బిరుదాంకితులైన శ్రీ స్వామి వారి చిరకాల సేవలు సమాజానికి అందాలని ఆకాంక్షిస్తూ, ఆంధ్రప్రభ స్వామి వారికి జన్మదిన శుభాకాంక్షలు సమర్పిస్తున్నది.
'ఆంధ్రదేశంలో శ్రీ సుందర చైతన్యానందస్వామినిర్విరామంగా సాగిస్తున్న ప్రచార కార్యక్రమాలకు నేను పరమానంద భరితుణ్ణయ్యాను. ఉత్కృష్టమైన ఆశయాలతో వారు నిర్వహిస్తున్న పవిత్ర కార్యాలు నన్ను తన్మయుణ్ణి చేస్తున్నాయి. వేదాంత ప్రచారాల ద్వారా ఆర్షధర్మ పునర్వైభవ ప్రాప్తిని సాధించడానికి ఇలాంటి నిశ్శబ్ద ఆధ్యాత్మిక ఉద్యమాలే ఏకైక మార్గం. శక్తిమంతమైన వారి యజ్ఞ కార్యక్రమాలు ఎడతెగక నిత్యం కొనసాగాలని ప్రార్థిస్తూన్నాను'
-- స్వామి శ్రీ చిన్మయానంద
చిన్మయ మిషన్‌
'స్వామి సుందర చైతన్యానంద పాండిత్యం, ఆధ్యాత్మిక జీవనం, గాన వైదుష్యంతో పాటు అనంతమైన శక్తి సామర్థ్యాలు గల మహోన్నత వ్యక్తి. ఆధునిక విద్యతోపాటు దేవభాష సంస్కృతంలో ప్రావీణ్యంను పొందారు. రాష్ట్రవ్యాప్తంగా సనాతన ప్రచారం చేయటంలో స్వామీజీ తమ యావచ్ఛక్తిని ధారపోస్తున్నారు'
- స్వామి శ్రీ రంగనాథానంద.
నిలిచెనా మీ మహోజ్జ్వల భావనారథ్య
కఱివేల్పుదొర గీతికా రథమ్ము
వెలసెనా మీ మనోవీధిలో లోకమ్ము
నలరించు జయదేవు నష్టపదులు
తెలిపెనా మీ మేలు కొలువులో రామయ్య
యలఘు చరిత్రమ్ము తులసీదాసు
నిలిపెనా మీదు మంజుల కంఠసీమలో
అల కబీరుడు తనదైన పలుకు
లేని యెడల మీకు నీనాడు నెటులబ్బు
వారి దివ్య చరిత సారమెల్ల
స్వామీ! మీ చరిత్ర చైతన్య రూపమ్ము
భక్త వితతి కెల్ల ముక్తి పథము-
- కళాప్రపూర్ణ డా|| స్వామి శ్రీ జ్ఞానానంద కవి
సుందర చైతన్యానంద స్వామి అనే పేరుతో మీరు భోలోకానికి వెళ్ళి, ప్రజలలో విశేషమైన జ్ఞానసంపదను కలిగించండి. ఇదే మీ కార్యక్రమం' అని చెప్పి పంపించి ఉంటారని నా భావన
-శ్రీ కొణిజేటి రోశయ్య
తమిళనాడు గవర్నరు
తేదీ 25.12.1947న నెల్లూరు జిల్లాలోని బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని కట్టుబడి పాలెంలో, శ్రీ పెరుంబుదూరు వెంకటశేషాచార్యులు, రంగనాయకమ్మ పుణ్యదంపతులకు ఎనిమిదవ సంతానంగా జన్మించిన శ్రీ స్వామి పట్టభద్రులు. చిన్నతనం నుండి దీక్షతో, తపనతో, దృఢ విశ్వాసంతో, త్రికరణ శుద్ధితో, ఎన్నో వ్యయప్రయాసలకోర్చి,కష్టనష్టాల నెదుర్కొని, కైవల్యా నదీతీరంలో సైకత ప్రదేశాలలో, ధ్యాన నిష్ఠాగరిష్ఠులై, అధ్యయనం కొనసాగించి అపూ ర్వ పాండితీ గరిమను, ప్రతిభా సంపత్తిని సముపార్జించిన శ్రీ స్వామి, పరమేశ్వర కరుణాకటాక్షలబ్ధ సమస్త విద్యా ప్రవీణులు. సుమధుర, సుందర, వాగ్విలాస, వైభవ, ప్రాభవ, శ్రీ సుశోభితులు. శ్రీ సుందర చైతన్యానంద మహావక్త. మహాద్గ్రంథ రచయిత. శ్రీ స్వా మి శతాధికగ్రంథాలను రచించి ప్రచురించారు. ఎన్నో గ్రంథాలకు వ్యాఖ్యానాలు వెలయించారు. ఉపనిషత్‌ మాధుర్యాలను అందించారు.
'నేను రెండు పర్యాయాలు వారి ఉపన్యాసం వినడం జరిగిం ది. సామాన్యునికి సైతం అర్థమయ్యే రీతిలో విపులంగా ప్రస్తుత సమాజానికి అవసరమైన ధర్మాలు ఏ విధంగా ఆచరించాలో తెలిపారు వారి కార్యక్రమాలకు ప్రతిసారీ వేల సంఖ్యలో ప్రజలు పాల్గొనటమే వారి ఔన్నత్యానికి తార్కాణం. సమాజం లో సత్సాంప్రదాయాన్ని, సహ జీవనాన్ని, శాంతి ప్రియత్వాన్ని, సోదర ప్రేమను, త్యాగశీలతను, పరోపకారాన్ని ఉద్బోధించి అవిరామ సేవ చేస్తున్నారు స్వామీజీ.
- -జస్టిస్‌ వై.భాస్కరరావు.
'పావన గోదావరీ నది ఆంధ్ర దేశంలో ప్రవహించడం ఎంత గర్వకారణో, ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తిరుమల తిరుపతి దేవస్థానం ఆంధ్రదేశంలో ఉండటం ఎంత గర్వకారణమో, శ్రీ సుందర చైతన్యానంద స్వామి ఆంధ్రుడు కావడం అంతే గర్వకారణము'
- మల్లెమాల.
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు జరుగుతున్నాయి.ఆ ఎన్నికలలో చెలరేగి పోయిన వికృత విన్యాసాలు స్వామి వారి హృదయాన్ని ఎంతగానో కలత పెట్టాయి. అంతే. 'ప్రజాస్వామ్య వెన్నెముకను విరిచేసిన ఎన్నికలు' అనే కవితను, తాను పాతికేళ్ళుగా నడుపుతున్న గిరిధారి పత్రికలో ప్రచురించారు. అంతే. 'ప్రజాస్వామ్య వెన్నెముకను విరిచేసిన ఎన్నికలు' అనే కవితను, తాను పాతికేళ్ళుగా నడుపుతన్న గిరిధారి పత్రికలో ప్రచురించారు. అది వ్యాసమా? కవితా? లేక విప్లవ గీతమా? అని చదువరులకు సందేహం కలుగుతుంది. నాయకుల మొదలుకొని ఉద్యోగుల వరకు, కార్యకర్తల మొదలుకొని కవుల వరకు స్వామీజీ ఎవ్వరినీ వదలిపెట్టలేదు. చివరగా, కుహనావాదులైన కవులపై స్వామీజీ విసిరిన వాగ్దాణాలు ఇలా వున్నాయి.
ఇక,
కలతల భారతంలో
కవితల బాజాలు
కాలం మారిపోయింది
కవి కలం మారిపోయింది
కొత్త ఇంకు నింపుకొని
కొంగ్రొత్త లింకు పెట్టుకుంది
నోటుకు మాట లమ్ముకొని
డబ్బుకు డప్పు వాయిస్తూ
ఓట్ల పాట పాడుతోంది
కొట్లాట పాట పాడుతోంది
పేగులు వెనక్కి లాగే పేదరైతును
ముందుకుపో -ముందుకుపో అని
కొరడా మాటలు పలికేశక్తి
కవి కలాని కిచ్చిందెవరు?
కాకి కూతలు కవిత్వా లవుతాయా?
పైసా పైత్యంలో కళ్ళు మూసుకు పోతాయా?
విశ్వాన్ని తట్టిలేపిన విశ్వకవి మరో రవి
ఉదయించిన భారతిలో ఇదేనా సాహితి?
కాసుకు కళలు కాసోహ మనే సమాజంలో
ఏ మిగుల్తుంది సంస్కృతి?
ఎలా వస్తుంది ప్రగతి?
ఇది ప్రజాస్వామ్య మోయ్‌!
పిచ్చోడి చేతిలో రాయి!
నిరుపేదల బ్రతుకు నేతలకు అలుసు
ఇది ప్రజాస్వామ్యమని ఎందరికి తెలుసు?
ఇంత చూసినా
ఎందుకనో, చావదు ఆశ!
వేసవి ఎండల్లా మండే గుండెల్లో
చల్లదనం నింపే మంచితనం కావాలి.
నిరాశా నీడల్లో నీరసించిన జనం
ఆశా విహంగాలై విహరిస్తేనే ఘనం!
కుళ్ళిన రాజకీయాల నుండి మళ్ళిన యువత
విద్యపై దృష్టిని సారించి నపుడే ఘనత!
మాటలమ్మ మానసపుత్రులైన కవులు
పలకాలి కాంతులు విరజిమ్ము పలుకులు
ఉన్నవారు మనసున్న వారు కావాలి
లేనివారికి తోడున్న వారుగా మారాలి
మాగాణిలో గానము కమ్మగా వినిపించాలి
మనిషిలో జ్ఞానము నిండుగా కనిపించాలి.
అరుపు లొద్దు మనకు పైపై మెరుపు లొద్దు
మంచిని త్రుంచే వంచన మాట లొద్దు.
బ్రతుకుదాం బ్రతుకు అందాలు నేర్చి
అందరం అందరిలో ఉన్నామని తెలిసి
బ్రతికించే గాలి కనిపించ దెప్పుడూ
పరిపాలన పవిత్రగాలి కావా లిప్పుడు.
పరిస్థితులను చూసి కలత చెందిన స్వామీజీ ఈ కవితలో నిరాశావాదిగా ఎక్కడా కనిపించలేదు. పైగా పరమ ఆశావాదిగా కనిపించారు. సమస్యను అర్థం చేసుకోమని అర్థించడమే గాక, సమాజ అభ్యుదయం ఎలాఉండాలో కూడా సూచించారు. ఇది స్వామీజీ లోని విలక్షణమైని మరొక కోణం.
వారిది అలసట ఎరుగని గళం విరామం ఎరుగని కలం
దివారాత్రుల తారతమ్యం తెలియని తపోదీక్ష!
అదే దేశానికి శ్రీరామరక్ష!'
- శ్రీ భాట్టం శ్రీరామమూర్తి
మాజీ మంత్రివర్యులు, బహుగ్రంథ రచయిత
'స్వామి సుందర చైతన్యానందులు ఏకత్వానికి, దివ్యత్వానికి, పవిత్రతకుప్రతిరూపం.నేడు మన కున్న మహాత్ములలో, ప్రమాణ పురుషులలో వీరు ఒకరు. ఆత్మజ్ఞానాన్ని పంచుతూ, నిత్యశాంతి వైపుకు మానవాళిని మరలిస్తున్న మహనీయులు వీరు. సనాతన ధర్మానికి వీరు చేస్తున్న సేవ అమోఘం'
- -స్వామి శ్రీ శుద్ధానంద భారతీ.