రాష్ట్రంలో స్థానిక పరిపాలన నత్తనడకన సాగుతోంది. స్థానిక సంస్ధల పాలకమండళ్ళ గడవు ముగిసినప్పటికీ ఎన్నికలను నిర్వహించలేని పరిస్థితి ప్రభుత్వానిది. దీంతో ఏడాది కాలంగా ప్రత్యేకాధికారులతో స్థానిక పాలన బండిని లాగిస్తున్నారు. ప్రస్తుతం పట్టణ స్థానిక సంస్థలు, పంచాయితీరాజ్ సంస్థలన్నీ ఖాళీగా ఉన్నాయి. 2010లో పట్టణ స్థానిక సంస్థల పాలకమండళ్ళు, 2011లో 22 జిల్లా పరిషత్, 1097 మండల పరిషత్‌లు, 21,807 గ్రామ పంచాయితీల పాలకమండళ్ళ గడవు ముగిసింది. 73, 74 రాజ్యాంగ సవరణల ప్రకారం స్థానిక సంస్ధల పాలకమండళ్ళ గడవు ముగిసేలోగా ఎన్నికలు జరపాలి. ప్రస్తుతం రాష్ట్రంలో పంచాయితీరాజ్ సంస్థలలో 60.5 శాతం రిజర్వేషన్లు ఉన్నాయి. అయితే ఈ రిజర్వేషన్ల 50 శాతం దాటరాదన్న సుప్రీంకోర్టు తీర్పు ఆధారంగా కొందరు హైకోర్టును ఆశ్రయించడంతో ఈ ఎన్నికలు నిలిచిపోయాయి. మరోపక్క పంచాయితీరాజ్ వ్యవస్థను మూడంచెలగా మారుస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. ప్రత్యేకాధికారుల పాలనను పక్కనపెట్టి వచ్చే 2012 మార్చి నాటికల్లా ఎన్నికలు నిర్వహిస్తామని పురపాలక శాఖ మంత్రి ఎం.మహీధరరెడ్డి కూడా ప్రకటించారు. కానీ మార్చి నెలలోగా ఎన్నికలను నిర్వహిస్తామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ రిజర్వేషన్ల సమస్యలు తేలకుండా ఎన్నికల నిర్వహణ ఎలా సాధ్యమనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇదిలావుండగా మహిళలను ఆకట్టుకునేందుకు స్థానిక సంస్థలలో మహిళలకు 50శాతం రిజర్వేషన్లు అమలుజేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. రాష్ట్రంలో అదనంగా 8 పంచాయితీలను పురపాలక సంస్ధలుగా మార్చేందుకు వచ్చిన ప్రతిపాదనలకు అనుమతి లభించింది. అలాగే 21 నగర పంచాయితీలను నగరపంచాయితీలుగా నోటిఫై చేశారు. వాటిలో అనంతపురంలో 3, నల్గొండలో 1, పశ్చిమగోదావరిలో 1, మహబూబ్‌నగర్‌లో 3, వరంగల్‌లో 1, తూర్పుగోదావరిలో 3, విజయనగరంలో 1, కర్నూలులో 2, పొట్టి శ్రీరాములు నెల్లూరులో 1, కరీంనగర్‌లో 5 నగర పంచాయితీలు ఏర్పడ్డాయి. గ్రామ సర్పంచ్‌ల పదవీకాలం ముగిసిన వెంటనే ప్రత్యేకాధికారుల పరిపాలన అమలులోకి వచ్చింది. రాష్ట్రంలోని మొత్తం 21,807 గ్రామ పంచాయితీలు ఉన్నాయి. వీటిలో రెండు, మూడు పంచాయితీలకు కలిపి దాదాపు ఏడువేల మందిని ప్రత్యేకాధికారులగా నియమించారు. పంచాయితీరాజ్ వ్యవస్థను మూడంచెలకు కుదిస్తూ.. ఎంపిటీసి, జెడ్పీటిసీ వ్యస్థను మంగళం పాడుతామని ముఖ్యమంత్రి కిరణ్, కేంద్ర పంచాయితీ రాజ్‌శాఖ మంత్రి కిశోర్‌చంద్రదేవ్ కూడా విడివిడిగా ప్రకటించారు. దీనిపై అనుమతులు లభించాక, చట్టాలు సవరించడం లేదా ఆర్డినెన్స్ తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి.