1, జనవరి 2012, ఆదివారం

సంక్షేమం అంతంత మాత్రమే

రాష్ట్ర జనాభాలో గణనీయంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీల సమగ్ర అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించినప్పటికీ ఆర్ధికంగా, విద్యాపరంగా ఇతరేతర అవకాశాల పరంగా ఈ వర్గాలు ఇంకా వెనుకబడి ఉన్నాయి. 2011లో మన రాష్ట్ర ప్రభుత్వం దళిత, గిరిజన వర్గాల సంక్షేమానికై కోట్లాది రూపాయిలు ఖర్చు పెట్టినప్పుటికీ ఫలితాలు మాత్రం అంతంతమాత్రంగానే ఉన్నాయి..
ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ అమలుచేసేందుకు మానిటరింగ్‌ అపెక్స్‌ కమిటీని పునర్‌ వ్యవస్థీకరించారు. అయితే సబ్‌ప్లాన్‌ నిధులను మొత్తం దారీ తప్పించి.. పార్కుల అభివృద్ధికి వాడుకున్నారని దళిత సంఘాలు నెత్తినోరు మొత్తుకున్న ప్రభుత్వం పట్టించుకోలేదు. రూ.1600 కోట్లతో ఎస్సీ, ఎస్టీలకు పంపిణీ చేసిన భూముల అభివృద్ధికై ''ఇందిరా జలప్రభ'' పథకం ప్రారంభించారు. లక్ష బోరుబావులతో 10 లక్షల ఎకరాల సాగునీరు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఈ పథకం ఇంకా కొన్ని జిల్లాల్లో ప్రారం భానికే నోచుకోలేదు. ఎస్సీ, ఎస్టీ కాలనీలలో ఉపాధి హామీ పథకం కింద రూ.1000 కోట్లతో మౌలిక సదుపాయాలు పనులు చేపట్టారు. అయితే ఈ పనుల్లో అనేక అవకతవకలు జరిగినట్లు తనికీల్లో తేలింది.
ప్రభుత్వ ఉద్యోగాలలో ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీలకు వయో పరిమితిని 5 సంవత్సరాలు పొడిగించారు. అయితే వివిధ శాఖల్లో ఈ వర్గాల వారికి కేటాయించిన బ్యాక్‌లాగ్‌ పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేస్తే సరైన అర్హత కలిగిన అభ్యర్ధులు లభించడం కష్టమవుతుంది. ఉర్దూ మీడియం టీచర్ల పోస్టుల కోసం డియస్సీ నోటిఫికేషన్‌ జారీ చేస్తే సగం మంది కూడ దరఖాస్తు చేయలేదు. ఈ ఏడాది బకాయిలు లేకుండా 26 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీ వర్గ విద్యార్ధులకు ఫీజురీఇంబర్స్‌మెంట్‌ చెల్లించినట్లు ప్రభుత్వం చెబుతుంది. కానీ ఈ వ్యవహారంపై నిత్యం దుమారం లేస్తుంది, విద్యార్ధులు ఆందోళనలు కొనసాగిస్తూనే ఉన్నారు. మోయలేని భారం వంకతో ప్రస్తుతం వార్షిక బడ్జెట్‌లో బోధనా ఫీజులను రూ.3500 నుండి రూ.2500కు కుదించారు. స్క్రూటినీలో 1.40 లక్షల దరఖాస్తులను తిరస్కరించగా, 2.60 లక్షల దరఖాస్తులను పలు కారణాలు రీత్యా పెండింగ్‌లో పెట్టారు. పిజి కోర్సులు చేస్తున్న వారిలో అర్హతలేని 1071 మంది దరఖాస్తులను తొలగించారు. పెరిగిన ఫీజుల చెల్లింపుల భారాన్ని తగ్గించుకునేందుకు కనీస వయస్సు, హాజరు శాతం, బయోమెట్రిక్‌ విధానాన్ని ప్రవేశపెట్టారు. రాష్ట్రం మొత్తం 5910 వసతిగృహాలు ఉన్నాయి, వీటన్నింటికీ ఆహారధాన్యాలను అందించే బాధ్యత పౌరసరఫరాల సంస్థకు ప్రభుత్వం అప్పగించింది.
ఉపాధిహామీ పథకం కింద బీడుభూములు అభివృద్ధి చేసి, రాబోయో మూడేళ్ళలో 49.55 లక్షల ఎకరాల భూములు ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం రూ. 12908.6 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేసింది. అలాగే గిరిజనుల ఆధీనంలో ఉన్న భూములపై వారికి హక్కులను కల్పించే చట్టాన్ని పకడ్బందీగా అమలుచేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం 1.67 లక్షల గిరిజనులకు అటవీహక్కుల చట్టం కింద 14.45 లక్షల ఎకరాల అటవీభూమిపై హక్కుపత్రాలను ఇచ్చారు. రాష్ట్ర జనాభాలో బిసిలు 38.6 శాతం మంది ఉన్నట్లు గణాంకాలు తెలియజేస్తున్నాయి. బిసిలలో కొన్ని సంప్రదాయ వృత్తులలో ఉన్నవారి పరిస్థితి దయనీయంగా ఉంది. రాష్ట్రంలో బిసి ఫెడరేషన్లు నిధులు లేక మగ్గిపోతున్నాయి. బిసి సంఘాలు ఆందోళనలతో దిగొచ్చిన ప్రభుత్వం బిసి కార్పోరేషన్‌కు రూ. 2.77 కోట్లు, వడ్డెర ఫెడరేషన్‌కు రూ.6.25 లక్షలు, ఉప్పర ఫెడరేషన్‌కు రూ. 7.50 లక్షలు, వాషర్‌మెన్‌ ఫెడరేషన్‌కు రూ. 1.25 లక్షల నిధులను విడుదల చేసింది. మరోపక్క బిసి విద్యార్ధుల కోసం రూ.600 కోట్లతో 1000 హాస్టళ్ళను నిర్మాణాన్ని ప్రభుత్వం చేపట్టింది. అయితే ఆ హాస్టళ్ళ భవనాలు కూడా నత్తనడకన నడుస్తున్నాయి.
రాష్ట్రంలో ఆర్ధికంగా, సామాజికంగా, విద్యాపరంగా బాగా వెనుకబడిన మైనారిటీల సంక్షేమం కోసం ప్రభుతం ఎన్ని పథకాలు ప్రవేశపెట్టినా అవి ఆశించినంత మేరకు ఫలితాలు ఇవ్వడం లేదని వివిధ సర్వేలు వెల్లడించాయి. మైనారిటీలకు ప్రస్తుతం కల్పిస్తున్న 4 శాతం రిజర్వేషన్లను మరో పది సంవత్సరాలు పొడిగించారు. ఈ ఏడాది ''దారుల్‌ మారిఫ్‌ -ఉల్‌ -ఉస్మానియా'' సంస్థకు రూ.57 లక్షలు అదనంగా కేటాయించారు. 2011 జూన్‌ నుంచి ప్రీ మెట్రిక్‌ మైనారిటీ వెల్ఫేర్‌ వసతి గృహాల్లో ఉంటే 3 నుండి 10వ తరగతి విద్యార్ధులకు డైట్‌ ఛార్జీలను పెంచారు. అయితే తమ శాఖకు చెందిన నిధులు సరిపోవడం లేదని అదనం మరో వంద కోట్ల రూపాయలు పైబడి ఇవ్వల్సిందిగా మైనారిటీ శాఖ మంత్రి ప్రభుత్వానికి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా అరకొర నిధులు విదిలించి సరిపెట్టడం గమనార్హం.
వికలాంగుల సంక్షేమానికి ఎన్నిరకాల పథకాలు ప్రవేశపెట్టినప్పటికీ వాటి ఫలాలు అర్హులైన వికలాంగులకు అందడం లేదు. వికలాగుంలకు ఉపాధి హామీ పథకం కింద 150 పని దినాలు కల్పించాలని నిర్దేశించినప్పటికీ రాష్టంలో ఎక్కడా ఆ నిబంధనలు అమలుకావడం లేదు. ఉపాధి హామీ పథకం ఖర్చులో భాగం కేవలం 1.29 కోట్లు మాత్రమే వికలాంగుల కోసం ఖర్చు పెట్టారు.