1, జనవరి 2012, ఆదివారం

మహిళాభివృద్ధికి”చే“యూత

రాష్ట్ర మహిళల జీవనచిత్రంలో 2011 సంవత్సరం కీలకఘట్టంగా మారింది అనడంలో అతిశయోక్తిలేదేమో. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు మహిళల జీవితాల్లో నూతన ఉత్తేజాన్ని నింపుతున్నాయి. స్థానికసంస్థల్లో 50శాతం రిజర్వేషన్లు, వడ్డీ లేకుండా రుణాలు అందించేలా స్త్రీనిధి బ్యాంకు ఏర్పాటు ఈ సంవత్సర కీలకాంశాలు. మహిళలకు సాధికారత కల్పించే దిశగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్‌.కిరణ్‌కుమార్‌ రెడ్డి తీసుకున్న నిర్ణయాల్లో స్థానికసంస్థల్లో 50శాతం రిజర్వేషన్లు కల్పిస్తాం అన్ని నిర్ణయం చారిత్రాత్మకంగా మారింది. జనాభాలో సగం ఉన్న మహిళలకు చట్టసభల్లోనూ సముచిత స్థానం కావాలన్న డిమాండ్‌కు ఊతం ఇచ్చింది. క్షేత్రస్థాయి నుంచే మహిళల్లో నాయకత్వ లక్షణాలు పెంచడంలో ప్రభుత్వ నిర్ణయం కీలకంగా మారుతుంది. రాజకీయాల్లో మహిళల సంఖ్యను పెంచేందుకు స్థానిక సంస్థల్లో 50శాతం రిజర్వేషన్లు ఎంతో ఉపకరిస్తాయి. మహిళల సాధికారతకు, ఆత్మగౌరవానికి ఇది నాందిగా మారింది.
రాజకీయంగా మహిళలకు సముచిత స్థానం ఇచ్చిన ప్రభుత్వం ఆర్థికంగా వారిని బలోపేతం చేయాలన్న లక్ష్యంతో వెయ్యికోట్ల రూపాయలతో స్త్రీనిధి బ్యాంకును ఏర్పాటుచేసింది రాష్ట్ర ప్రభుత్వం. స్వయం సహాయక బృందాలకు తక్షణ బుణ సదుపాయం అందించడమే ఈ పథకం ముఖ్యఉద్దేశ్యం. ఈ బ్యాంకు ద్వారా పదిలక్షల స్వయం సహాయక బృందాలు రుణాలను అందుకునే అవకాశం లభిస్తోంది. రుణాలను సక్రమంగా చెల్లించిన వారికి నూటికినూరు శాతం వడ్డీ మాఫీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించి మహిళాఆర్థికాభివృద్ధికి చేయూతనిచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
మహిళలకు విద్య, ఆరోగ్యం, పౌష్టికాహారం అందించడానికి ప్రభుత్వం పలుచర్యలు తీసుకుంటుంది. రాష్ట్రంలోని 387 ఐసిడిఎస్‌ ప్రాజెక్టులలో 12.83 లక్షల మంది గర్భిణీలు, బాలింతలకు పౌష్టికాహారం అందిస్తున్నారు. 58,44 లక్షల మంది చిన్నారులకు పౌష్టికాహారంతో పాటు రోగనిరోధక కీటాలు అందించారు. ఫ్రీ స్కూల్‌ ఎడ్యుకేషన్‌ పథకం ద్వారా 18,06,855మందికి విద్యను అందిస్తున్నారు. ఈ సంవత్సరం అదనంగా మరో పది వేల అంగన్‌వాడీ సెంటర్లను ఏర్పాటుచేస్తున్నారు. ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన జనని పథకం ద్వారా గర్భిణీలకు నెలకు ఐదు కిలోల బియ్యం, ఒక కిలో కంద పప్పు, కిలో ఉప్పు పదినెలల పాటు ఉచితంగా అందిస్తున్నారు. పదికోట్ల రూపాయలతో రెండుజిల్లాల్లో ఇందిరాగాంధీ సహయోగ్‌ యోజన ద్వారా పదివేలమందికి సహాయం అందించారు. జిసిపిఎస్‌ పథకం ద్వారా లక్షా ఆరువేల 231మంది బాలికలకు 48కోట్ల రూపాయలతో వివిధ పథకాలను అమలు చేస్తున్నారు.
కేంద్రం దేశవ్యాప్తంగా రెండువందల జిల్లాలో పైలెట్‌ ప్రాజెక్ట్‌గా ప్రవేశపెట్టిన సబల పథకం రాష్ట్రంలోని ఏడు జిల్లాలల్లో అమలు జరుగుతున్నది. మహబూబ్‌నగర్‌, ఆదిలాబాద్‌, గుంటూరు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు తదితర జిల్లాల్లో అంగన్‌వాడీ కార్యకర్తలు సేకరించి వివరాల ప్రకారం ఎంపిక చేసిన కిశోరబాలికలకు శిక్షణ ఇస్తారు. జిల్లా కేంద్రాల్లో ఉన్న మహిళా ప్రాంగణాల్లో కేంద్రప్రభుత్వం రూపొందించిన నిబంధనల ప్రకారం 200వందల వృత్తికోర్సులలో శిక్షణనిస్తారు. ఈ పథకం ద్వారా ఇప్పటివరకు ఏడు జిల్లాల్లో కోటి 25లక్షల రూపాయలతో తొమ్మిది లక్షలమంది కిశోరబాలికలకు పౌష్టికాహారం, వృత్తివిద్యాకోర్సులలో శిక్షణనిస్తున్నారు.