1, జనవరి 2012, ఆదివారం

రోడ్డు ప్రమాదాలు”తగ్గుముఖం”

గడచిన రెండేళ్ళ కాలంలో రాష్ట్రం లో జరిగిన రోడ్డు ప్రమాదాల కంటే ప్రస్తుత సంవత్సరం రోడ్డు ప్రమాదాల సంఖ్య తగ్గింది. అయితే పట్టణ ప్రాంతాలలో మాత్రం ప్రమాదాల సంఖ్య పెరిగింది. దీంతో పట్టణ ప్రాంతాలలో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాల సంఖ్యను తగ్గించేందుకు ప్రభుత్వం దృష్టిని సారించింది. పోలీసు శాఖ తన పరిపాలనా సౌలభ్యం కోసం రాష్ట్రంలోని 23 జిల్లాలను 30 జిల్లాలుగా విభజించింది. 30 జిల్లాలలో జరిగిన రోడ్డు ప్రమాదాల సంఖ్యను పరిశీలించగా ఆరు జిల్లాలలో వీటి సంఖ్య గడచిన రెండేళ్ళ కంటే ఈ ఏడాది పెరిగింది. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు వలస పెరగడం, కొత్త కాలనీలు వెలయడంతో పాటు వాహనాల సంఖ్య కూడా ఇబ్బడి ముబ్బడిగా పెరగడంతో పట్టణీకరణ అధికంగా ఉన్న ప్రాంతాలలో రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరిగిందని స్పష్టమవుతోంది.
రాష్ట్ర రాజధాని చుట్టూ ఉన్న సైబరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌ పరిధిలో రోడ్డు ప్రమాదాల సంఖ్య గణనీయంగా పెరిగింది. సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో 2009లో 3254 రోడ్డు ప్రమాద కేసులు నమోదవగా 3168 మంది క్షతగాత్రులై 1084 మంది మరణించారు. 2010లో 3333 రోడ్డు ప్రమాద కేసులు నమోదవగా 3299 మంది క్షతగాత్రులై 1088 మంది అవుసులు బాసారు. 2011 నవంబర్‌ మాసాంతం వరకు 3426 రోడ్డు ప్రమాద కేసులు నమోదవగా 3321 మంది క్షతగాత్రులై 1121 మంది మరణించారు. సైబరాబాద్‌ పరిధిలో ఉన్న ఔటర్‌ రింగ్‌రోడ్‌పై జరిగిన రోడ్డు ప్రమాదాలలో ఈ ఏడాది 36 మంది మరణించారని అధికారులు పేర్కొన్నారు. నిజామాబాద్‌ జిల్లాలో కూడా రోడ్డు ప్రమాదాల సంఖ్య ఈ ఏడాది పెరగింది. 2009లో 1173 రోడ్డు ప్రమాదాలు జరుగగా 1756 మంది గాయపడి 445 మంది మరణించారు. 2010లో 1315 రోడ్డు ప్రమాదాలు జరుగగా 1976 మంది గాయపడి 511 మంది మరణించారు. 2011 నవంబర్‌ మాసాంతం వరకు 1356 రోడ్డు ప్రమాదాలు జరుగగా 2099 మంది గాయపడి 514 మంది మరణించారు. నిజామాబాద్‌ జిల్లా గుండా హైదరాబాద్‌ -నాగ్‌పూర్‌ జాతీయ రహదారి వెళ్తుంది. ఈ ఏడాది ఈ రహదారిపై ప్రమాదాల సంఖ్య కూడా అత్యధికంగా ఉందని అధికారులు చెప్పారు.
రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో 2010 సంవత్సరంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య, క్షతగాత్రుల సంఖ్య, మృతుల సంఖ్య పెరుగగా మెదక్‌ జిల్లాలో తగ్గాయి. అయితే ఈ ఏడాది ఈ జిల్లాలో రోడ్డు ప్రమాదాల సంఖ్య భారీగా పెరిగింది. జిల్లాలో 2009లో 1631 రోడ్డు ప్రమాదాలు జరుగగా 2613 మంది గాయాలపాలవగా 727 మంది మృత్యువాత పడ్డారు. 2010లో 1556 రోడ్డు ప్రమాదాలు జరుగగా 2215 మంది గాయాలపాలవగా 702 మంది మృత్యువాత పడ్డారు. 2011 నవంబర్‌ మాసాంతం వరకు 1498 రోడ్డు ప్రమాదాలు జరుగగా 2094 మంది గాయాలపాలవగా 730 మంది మృత్యువాత పడ్డారు. ఈ జిల్లాలో దాదాపు 100 కిలోమీటర్ల వరకు నాగ్‌పూర్‌ -హైదరాబాద్‌ జాతీయ రహదారి విస్తరణ జరిగి వాహనాల వేగం అదుపు తప్పుతోంది. వరంగల్‌ అర్భన్‌ జిల్లాలో 2010లో 413 రోడ్డు ప్రమాదాలు జరుగగా 522 మంది గాయపడి 117 మంది మరణించారు. 2011 నవంబర్‌ మాసాంతం వరకూ 786 రోడ్డు ప్రమాదాలు జరిగి 1024 మంది గాయపడి 215 మంది మరణించారు. వరంగల్‌ -హన్మకొండలలో కొత్త కాలనీలు వెలయడం, వాహనాల సంఖ్య పెరగడంతో ప్రమాదాల సంఖ్య గణనీయంగా పెరిగింది. తిరుపతి అర్భన్‌ జిల్లాలో 2010లో 423 రోడ్డు ప్రమాదాలు జరుగగా 531 మంది గాయపడగా 152 మంది మరణించారు. 2011 నవంబర్‌ మాసాంతం వరకూ 633 రోడ్డు ప్రమాదాలు జరుగగా 899 మంది గాయపడగా 232 మంది మరణించారు. టెంపుల్‌ సిటీగా ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిన తిరుపతిలో వాహనాల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. సందర్శకుల సంఖ్య పెరగడంతో పాటు వాహనాల రద్దీ తీవ్రమవడంతో ప్రమాదాల సంఖ్య పెరిగిందని అధికారులు అంటున్నారు.
గుంటూరు అర్భన్‌ జిల్లాలో ప్రమాదాల సంఖ్య భారీగా పెరిగింది. 2010లో 369 రోడ్డు ప్రమాదాలు జరుగగా 424 మంది గాయలపాలవగా 136 మంది ప్రాణాలు కోల్పోయారు. 2011 నవంబర్‌ మాసాంతం వరకూ 1189 రోడ్డు ప్రమాదాలు జరుగగా 757 మంది గాయాలపాలవగా 233 మంది ప్రాణాలు కోల్పోయారు. రాజమండ్రి అర్భన్‌ జిల్లాలో 2010లో 318 రోడ్డు ప్రమాదాలు జరుగగా 330 మంది గాయాలపాలవగా 80 మంది మరణించారు. 2011 నవంబర్‌ మాసాంతం వరకూ 488 రోడ్డు ప్రమాదాలు జరుగగా 575 మంది గాయాలపాలై 139 మంది మరణించారు. డిసెంబర్‌ మాసాంతానికల్లా ఈ సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉందని అధికారులు అంటున్నారు. సైబరాబాద్‌ పరిధిలో ఏయేటి కాయేడు కాలనీల సంఖ్య పెరగడం, తామరతంపరగా వాహనాలు రోడ్లపైకి వస్తుండటంతో ప్రమాదాలకు అంతులేకుండా పోతోంది. పెరుగుతున్న వాహనాల సంఖ్యకు అనుగుణంగా రోడ్ల విస్తరణ జరగక పోవడం, కొన్ని చోట్ల రోడ్ల సౌకర్యం అంతంత మాత్రంగా ఉండటం, మరికొన్ని చోట్ల రోడ్లు అధ్వాన్నంగా ఉండటంతో ఈ సంఖ్య పెరుగుతోంది. కూడళ్ళలో ట్రాఫిక్‌ నియంత్రణకు సరిపోయేంత పోలీసు సిబ్బంది లేక పోవడం కూడా మరో కారణం అవుతోంది. ఇలాంటి పరిస్థితులే రాష్ట్రంలో అభివృద్ధి చెందుతున్న జిల్లాలలో నెలకొంది.