1, జనవరి 2012, ఆదివారం

లక్ష్యాన్ని అధిగమించిన”వసూళ్ల్లు” 2011లో ఆర్థిక శాఖ

ఆర్ధిక శాఖ వసూళ్ల లక్ష్యాన్ని అధిగమించింది. మొత్తంగా వార్షిక వసూళ్ల లక్ష్యం రూ.68,777 కోట్లు. అందులో రాష్ట్ర పన్నుల వసూళ్ల లక్ష్యం రూ. 56,438 కోట్లు కాగా ఇప్పటికే రూ. 72 వేల కోట్లకు పైగా వసూలు చేశారు. పన్నేతర ఆదాయ వసూళ్ల లక్ష్యం రూ. 12,339 కోట్లకు గాను ఇప్పటి వరకు రూ. 10,931 కోట్లు వసూలు చేశారు. పన్నుల వసూళ్లలో 22 శాతం ప్రగతి నమోదయింది. వాణిజ్య, అబ్కారీ, రవాణా, స్టాంపులు, రిజిస్ట్రేషన్‌ల నుండి రాబడులు ఆశాజనకంగా నమోదయ్యాయి. వసూళ్ల పర్వం కొనసాగుతునే ఉంది.
రాష్ట్ర బడ్జెట్‌ రూ. 1,28,542 కోట్లు. ఈ లక్ష్యాన్ని చేరుకొనేందుకు రూ. 1,00, 995 కోట్లు రాబడులుగా సమకూర్చుకోవాలని సంకల్పించారు. ఇప్పటికే రూ. 82,931 కోట్లు వసూలు చేశారు. మరో మూడు మాసాల్లో లక్ష్యాన్ని అధిగమించగలమనే ధీమాను ఆర్ధిక శాఖ వ్యక్తం చేస్తోంది. మార్చి 2012 వరకు మరింతగా వసూళ్లు పెంచుకొనే ప్రణాళిక ఇప్పటికే సిద్దమయింది. రాష్ట్రానికి కేంద్ర నిధుల బదలాయింపులు రూ. 32,218 కోట్ల వరకు ఉంటాయని అంచనా వేశారు. అందులో మూడవ వంతు నిధులు ఇప్పటికే ఖజానాలో జమైనట్లు వెల్లడించారు. ఎఫ్‌ఆర్‌బిఎం చట్టాన్ని సమర్ధవంతంగా అమలు పర్చడంతో వృద్ధి రేటు ఆశాజనకంగా ఉందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఇప్పటికే వ్యవసాయం, పరిశ్రమలు, సేవా రంగాల్లో రాష్ట్రం గణనీయమైన వృద్ధిని సాధించినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
ఆర్ధిక నిర్వహణలో సమర్ధవంతమైన పద్దతులను పాటించి, వనరులను పెంచుకొనడంపై ప్రధానంగా దృష్టి పెట్టడం వల్ల ద్రవ్య లోటును తగ్గించి, రెవెన్యూ లోటు లేకుండా చేయడంలో రాష్ట్రం మంచి ప్రగతిని సాధించింది. వ్యవసాయ రంగం 6.5 శాతం, పారిశ్రామిక రంగం 9.61 శాతం వృద్ధిని సాధించాయి. రాష్ట్ర ప్రణాళికలో ఆర్ధిక సేవలకు 57.64 శాతం, సామాజిక సేవలకు రూ. 40.78 శాతం, సాధారణ సేవలకు 1.58 శాతం నిధులు కేటాయించారు. ఈ కేటాయింపులకు మించి వ్యయం జరుగుంతుంది. కేటాయింపులను పరిగణలోకి తీసుకోకుండానే పథకారుల వెలుగుచూస్తున్నాయి. రెండు రూపాయలకు కిలో బియ్యం పథకాన్ని రూపాయి కిలో బియ్యంగా మార్చడంతో ఏటా రూ. 600 కోట్ల అదనపు భారం పడింది. ఉచిత విద్యుత్‌, రాజీవ్‌ ఆరోగ్యశ్రీ, ఇందిరమ్మ పథకం, గృహ నిర్మాణం, పావలా వడ్డి లాంటి పథకాల్లో మార్పులు చేయడం, కొత్తగా లబ్ధిదారులను ఎంపిక చేయడంతో వ్యయం భారీగా పెరిగింది.
సామాజిక భద్రతా పథకాల రూపకల్పన, ప్రజా పంపిణీ వ్యవస్ధలో వస్తున్న మార్పులు, మనుగడ కోసం ప్రకటిస్తున్న ప్రజాకర్షక పథకాలు ఆర్ధిక వ్యవస్ధను కుదిపేస్తున్నాయి. సబ్సిడీ బియ్యం పథకానికి బడ్జెట్‌లో రూ. 2,500 కేటాయించగా మరో రూ. 600 కోట్లు అదనంగా చెల్లించవలసిన పరిస్ధితి నెలకొంది. రచ్చబండలో ముఖ్యమంత్రి ప్రకటించిన వరాల అమలుకు రూ. 2,750 నుండి రూ. 3000 కోట్లు వ్యయం చేయాల్సి వస్తోంది. ఈ విధంగా ప్రణాళికేతర వ్యయం భారీగా పెరిగిపోతుంది. ఆర్ధిక క్రమశిక్షణకు గండి కొడుతుంది. రాజకీయ ప్రయోజనాలను నెరవేర్చడం కోసం పాలకులు ప్రజాకర్షక పథకాలను ప్రకటించంతో ప్రభుత్వాలు అప్పుల పాలవుతున్నాయి. ఫలితంగా, రాష్ట్ర వ్యయం అదుపుతప్పుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు జరుపుతున్న పన్నుల వ్యవస్థ అన్ని వర్గాలకు పెనుభారంగా పరిణమించింది. పాలకులు ప్రకటిస్తున్న ప్రజాకర్షక పథకాలతో ఖజాన ఖాళీ అవుతోంది. రాష్ట్ర ఆదాయం పెరిగినప్పడికీ అప్పుల చెల్లింపు తప్పడం లేదు.
వ్యయ నియంత్రణ నిబంధనలకే పరిమితమయ్యింది. ప్రజాకర్షక, పేరు ప్రఖ్యాతుల కోసం తీసుకుంటున్న నిర్ణయాలు ఆర్థిక వ్యవస్థకు గుదిబండగా మారుతున్నాయి. గత సంవత్సర కాలంలో కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల భారం రూ. 2750 కోట్లుగా ప్రభుత్వం అంచనా వేస్తోంది. రూపాయికి కిలో బియ్యం. రాజీవ్‌ యువకిరణాలు, వడ్డీ లేని రుణాలు, ఇందిర జలప్రభ లాంటి పథకాలు భారీ వ్యయంతో కూడుకున్నవి కావడంవల్ల ఖజానాపై పెనుభారం పడుతోంది. బడ్జెట్‌ తయారు చేసే ముందు ఊహించని అనేక పథకాలు మధ్యలో రూపుదిద్దుకుంటున్నాయి. ఇదో అనుకోని అదనపు వ్యయంగానే భావిస్తున్నారు. రాష్ట్రం ఇప్పటికే రూ. 1.36 లక్షల కోట్ల అప్పుల్లో కూరుకుపోయింది. విదేశీ సంస్థల అప్పులు రూ. 17,217 కోట్లకు చేరుకున్నాయి. ఆర్థిక పరిస్ధితిని పరిగణలోకి తీసుకోకుండానే ప్రజాకర్షక పథకాలను ప్రవేశపెట్టడానికి పాలకులు అలవాటు పడటంతో నిరర్థక, ప్రణాళికేతర వ్యయం భారిగా పెరిగిపోతోంది. ఏటేటా వార్షిక పడ్జెట్‌ను పెంచుకుంటూ పోవడం తప్ప బడ్జెట్‌లోని అంకెలకు ప్రామాణికం లేకుండా పోతోంది.
పొంతన లేని లెక్కలతో అందమైన బడ్జెట్‌ను రూపొందించడానికి పాలకులు అలవాటు పడటంతో బడ్జెట్‌లో శాస్త్రీయ దృక్పథం లేకుండా పోతోంది. ప్రణాళికా వ్యయాలు కుదించుకు పోవడం, అభివృద్ధి ఆశించిన మేరకు ముందుకు సాగక పోవడం, సంక్షేమం కుంటుపడటం వెనుక పాలకుల తప్పిదాలు వెక్కిరిస్తున్నాయి. ప్రణాళికేతర వ్యయం భారీగా పెరగడంతో ఉత్పాదక వ్యవస్ధలు బలపడలేక పోతున్నాయి. ప్రభుత్వ శాశ్వత నిరర్ధక ఆస్తులు కూడా పెంచుకోలేక పోతున్నారు. రాజకీయ నిర్ణయాలు జరుగుతుండడంతో ఆర్ధిక క్రమశిక్షణ లోపించడం వల్లనే ద్రవ్య వ్యవస్ధ గందరగోళంలో పడిపోతోంది. ఓటర్లను అన్ని ఆశించే వారుగా భావించి పాలకులు తీసుకుంటున్న ప్రజాకర్షక నిర్ణయాల్లో మార్పులు వచ్చేంత వరకు ఆర్థిక వ్యవస్థకు ఈ తిప్పలు తప్పవని విశ్లేషకులు భావిస్తున్నారు.
పథకాలు ప్రజాహితంగా, ప్రయోజనకరంగా, పేదరికాన్ని నిర్మూలించేవిగా , ఉపాధి అవకాశాలు మెరుగు పరిచేవిగా ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేసేవిగా, ప్రజల జీవన ప్రమాణాలను పెంచేవిగా, ఉత్పత్తికి ఊతమిచ్చేవిగా ఉండాలని అభిప్రాయపడుతున్నారు. ప్రజలకు కొద్ది పాటి ప్రత్యక్ష ప్రయోజనం కనబరిచి పన్నుల రూపంలో భారీ ఎత్తున వసూలు చేయడం సర్వసాధారణమయ్యింది. ఇటీవల రెండు రూపాయలకు కిలో బియ్యం పథకంను రూపాయి కిలో బియ్యంగా ప్రకటించిన ప్రభుత్వం రాబోవు కాలంలో ఇంధన సర్‌చార్జీగా రూ. 4500 కోట్లు, విద్యుత్‌ చార్జీల పేరుతో రూ. 3000 కోట్లు, వాణిజ్య పన్నుల ద్వారా మరో రూ. 1500కోట్లు, మద్యం ధరలను సవరించడంతో అదనంగా రూ. 1500 కోట్లు, ఆస్తి పన్నుల రూపంలో రూ. 1000 కోట్లు, మంచినీటి చార్జీల పెంపుతో రూ. 300 కోట్లు, విత్తనాల ధరలు పెంచడంతో రూ. 400 కోట్లు ప్రజల నుండి రాబట్టడానికి ప్రణాళిక రూపొందించింది. 2012 ఏప్రిల్‌ నుండి జూలై మాసాల మధ్యలో ఈ పన్నులు ప్రజల నుండి వసూలు చేయడానిక సిద్దపడింది. ఇక మీదట 10.30 శాతం సేవా పన్ను, 14.5 శాతం విలువ ఆధారిత పన్ను ప్రతి ఒక్కరి నుండి వసూలు చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నారు.