1, జనవరి 2012, ఆదివారం

నేతల 'భవిష్య దర్శనం'

గత ఏడాది అనుభవాల్ని మననం చేసుకుంటూ ఆందోళనకరంగానే ప్రజలంతా కొత్త ఏడాదిలో ప్రవేశించారు. నూతన సంవత్సర వేడుకల్ని ఘనంగానే జరుపుకున్నా 2011నాటి ప్రభావం ఈసారి ఏమేరకు ప్రసరిస్తుందోనన్న భయాందోళన ప్రతిఒక్కరిలో వ్యక్తమౌతోంది. కాగా, ప్రధాన రాజకీయ పార్టీల నేతలంతా 2014 ఎన్నికల్లో విజయానికి ఈ ఏడాదిలోనే పునాదులేసుకోవాలని పథకరచన చేస్తున్నారు. ప్రజాజీవితంలో తమ పాత్ర పటిష్టానికి ఎత్తుగడలు రచిస్తున్నారు. నూతనేడాదిలోకడుగిడుతున్న కీలకనేతల మనోభావాలు ఈ విధంగా ఉన్నాయి.
చిరంజీవి
2011 ఆశాజనకంగా లేదు. కాంగ్రెస్‌లో విలీన ప్రతిపాదన ఫలితాన్నివ్వలేదు. నన్ను తప్ప పార్టీలో మరింకెవరినీ కాంగీయులు విశ్వసించడంలేదు. మంత్రి పదవుల మాట భగవంతుడెరుగు నాతోవచ్చి కాంగ్రెస్‌లో చేరిన పిఆర్‌పి ఎమ్మెల్యేలకు 2014 ఎన్నికల్లో పోటీకి టికెట్లు కూడా కాంగ్రెస్‌ నుంచి దక్కే అవకాశాలు కనిపించడం లేదు. విలీనంకాకుండా పదవులేంటంటూ కిరణ్‌కుమార్‌ చేసిన వ్యాఖ్యలు నా హృదయానికి గాయం చేశాయి. రామచంద్రయ్యకు మంత్రి పదవొద్దంటూ కడప కాంగీయుల రాద్ధాంతం పిఆర్‌పి శ్రేణుల్లో స్థైర్యాన్ని దిగజారుస్తోంది. దీనికంటే పార్టీని పునరుద్ధరించుకోవడమే మేలు. ప్రజలు నిర్ణయించిన విధంగా బాధ్యతాయుత ప్రతిపక్షంగా వ్యవహరిస్తే 2014 నాటికి ఆశాజనక ఫలితాలుంటాయి.
కెసిఆర్‌
ఈ ఏడాదైనా సోనియా తెలంగాణ ఇస్తుందన్న విశ్వాసముంది. ఆ తర్వాత కాంగ్రెస్‌లో టిఆర్‌ఎస్‌ను విలీనం చేసినా తెలంగాణ ప్రాంతంలో నాదే ఏకఛత్రాధిపత్యం. ఇక్కడ జరిగే ఎన్నికల్లో నేను నిలబెట్టిన అభ్యర్థులంతా ఘన విజయం సాధించడం ఖాయం. ముఖ్యమంత్రి పీఠానికి దూరంగా ఉంటూనే రాజకీయ చక్రం తిప్పే అవకాశం చేతిలోకొస్తోంది. అవసరాన్ని బట్టి కేంద్రంలో కూడా రాజకీయం చేయొచ్చు. 2014 నాటికి కేంద్రంలో ఏర్పడ్డ ప్రభుత్వంలో కీలకపాత్ర పోషించే అవకాశాలు నాకే ఉంటాయి.
చంద్రబాబు
ప్రతిపక్షపాత్ర పోషణలో విజయవంతమౌతున్నా. తెలంగాణలోకూడా పార్టీని పటిష్ట పర్చడంలో కృతకృతులయ్యాం. రాష్ట్రం విడిపోయినా రెండు ప్రాంతాల్లోనూ పట్టున్నపార్టీగా తెలుగుదేశం గుర్తింపుపొందింది. తెలంగాణలో కూడా అధికారంలోకొస్తాం. మేం సూచించిన వ్యక్తే అక్కడ ముఖ్యమంత్రి అవుతాడు. వచ్చే ఎన్నికల నాటికి జాతీయస్థాయిలో చక్రం తిప్పుతాను. ఎన్‌టిఆర్‌ అధికారం కోల్పోయిన తర్వాత ఆయన నాయకత్వంలోని యునైటెడ్‌ ఫ్రండ్‌ కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రధాని పీఠమెక్కే అవకాశాల్ని ఎన్‌టిఆర్‌, ఆ తర్వాత నేను కూడా కావాలనే కాలదన్నుకున్నా. ఈసారి ఇలాంటి పొరపాటు చేయకూడదు. సీమాంధ్ర, తెలంగాణల్లో పార్టీని అధికారంలోకి తేవడంతో పాటు కేంద్రంలో కీలకపాత్ర పోషిస్తాను.
కిరణ్‌కుమార్‌
ఏడాది పాలన సజావుగానే ముగించా. ఇప్పటికీ రాష్ట్రంలో పార్టీ శ్రేణులపై నాకు పట్టులేదన్న అపప్రద ఉంది. దీన్ని తొలగించుకుంటాను. ఈ ఏడాది అన్ని జిల్లాల్లో పార్టీ శ్రేణులతో ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహిస్తా. వారితో మమేకమౌతా. పార్టీని మరోసారి అధికారంలోకి తెచ్చేందుకు 2012ను సమర్థమంతంగా వినియోగించుకుంటా. 2014 తర్వాత కూడా నేనే ముఖ్యమంత్రిగా కొనసాగుతా. వైఎస్‌ఆర్‌ కూడా కార్యకర్తల్ని పేరుపెట్టి పిలిచే స్థాయికి చేరిన తర్వాతే ముఖ్యమంత్రి పీఠం ఎక్కగలిగారు. అదృష్టవశాత్తు తొందరగానే లభించిన ముఖ్యమంత్రి అవకాశాన్ని దీర్ఘకాలం నిలబెట్టుకుంటా. ఒక వేళ తిరిగి పార్టీ అధికారంలోకి రాకపోయినా కార్యకర్తలతో ఉన్న స్నేహసంబంధాలు భవిష్యత్‌ను నిర్మిస్తాయి. కేంద్రంలో ఏదొక కీలక అవకాశం లభిస్తుంది.
బొత్స
అధిష్టానం కిరణ్‌కుమార్‌ను
ముఖ్యమంత్రిగా కొనసాగించే అవకాశాలు కనిపించడంలేదు. అన్ని జిల్లాలు, నియోజకవర్గాల్లో పార్టీ శ్రేణుల్తో వ్యక్తిగత అనుబంధాలు కలిగిన నాయకులకే కాంగ్రెస్‌లో ముఖ్యమంత్రి పదవి దక్కుతుంది. ప్రస్తుతం రాష్ట్ర పార్టీలో అలాంటి అవకాశం నా ఒక్కడికే ఉంది. ఎన్నికలకు ఏడాది ముందు 2013లోనే కిరణ్‌కుమార్‌ పీఠం కదిపేస్తారు. నన్ను ముఖ్యమంత్రిని చేస్తారు. ఈ ఏడాదంతా కిరణ్‌తో విభేదాల్లేకుండా గడిపేస్తాను. భావి ముఖ్యమంత్రిగా గుర్తింపు పొందే ప్రయత్నం చేస్తా.
జగన్‌
సిబిఐ విచారణకు భయపడాల్సిన అవసరంలేదు. కంగారు పడి అరెస్టు చేసినా ఆరుమాసాల్లో బయటకొచ్చేస్తాను. ఆ సానుభూతితో ఎన్నికల్లో పాల్గొంటాను. రాష్ట్రంలో ముఖ్యమంత్రి పదవి దక్కకపోయినా కేంద్రంలో చక్రం తిప్పగల శక్తుంది. ఈ విషయంలో మమతాబెనర్జీ, శరద్‌పవార్‌ల తీరును అనుసరిస్తా. కేంద్రం తన అవసరాలకనుగుణంగా నా మాట వినితీరుతుంది.