1, జనవరి 2012, ఆదివారం

వివాదాస్పదమైన పోలవరం టెండర్లు

ఇందిరా సాగర్‌ పోలవరం ప్రాజెక్టు 2011లో ఇయర్‌ ఆఫ్‌ ది డిస్ప్యూట్‌గా మారింది. పోలవరం ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంలో తీవ్రంగా జాప్యం చేస్తూ విఫలమయ్యిందనే విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. పోలవరం ప్రాజెక్టుకు తెలంగాణ సమస్య ప్రత్యేక అడ్డంకుగా మారినట్టుగా కూడా పులువురు పేర్కొంటున్నారు. 2011 అక్టోబర్‌ నెలలో పోలవరం టెండర్లపై ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నప్పటికి ఆ తర్వాత కాంట్రాక్టు కంపెనీల మధ్య పెద్ద వివాదం చెల రేగింది. సాగు నీటి శాఖలో ఈ వివాదం ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. ఈ అంశంపై ప్రత్యర్థి కంపెనీలు ఏకంగా కోర్టుకు ఎక్కి టెండరు దక్కించుకున్న ఎల్‌1 ష్యూ- పటేల్‌ కంపెనీలకు అర్హత లేదని వాదించింది. సోమ కంపెనీ కోర్టులో లేవనెత్తిన అభ్యంతరాలపై కోర్టు సానుకూలతను వ్యక్తం చేస్తూ, టెండర్‌ కేటాయింపులను పున:పరిశీలించాలని, ఇందుకు ఒక ఉన్నతస్థాయి కమిటిని ఏర్పరచాలని ఆదేశించింది. టెండర్లపై ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటి టెండర్లపై నిర్ణయం తీసుకోవడంలో ఎటూ తేల్చుకోలేకపోతుండటంతో ఆ సమస్య ఎడతెరిపి లేకుండా వాయిదా పడుతోంది. అంతకుముందు ఈ ప్రాజెక్టు విషయంలో అనుమతులు రాలేదన్న కారణంగా వివాదాలు తలెత్తగా ఇప్పుడు టెండర్ల విషయంలోనూ ఆ ప్రాజెక్టును వివాదాలు సులువుగా వదిలేట్టు లేవని పలువురు పేర్కొంటున్నారు. కాగా, పోలవరం ప్రాజెక్టు టెండర్ల విషయంలో చెలరేగిన వివాద ప్రభావం మిడ్‌ మానేరుపై పడింది. ఆ ప్రాజెక్టు కోసం పిలిచిన టెండర్లను కూడా వివాదాలు తలెత్తుతాయన్న ఉద్దేశంతో రద్దు చేశారు. పోలవరం ప్రాజెక్టు కోస్తాంధ్రకు చెందగా, మిడ్‌ మానేరు ప్రాజెక్టు మాత్రము తెలంగాణ ప్రాంతానికి చెందినది. టెండర్లలో నిర్ణయాన్ని తీసుకోవడంలో ఉన్నతాధికారులు సిద్ధంగా లేనట్టు తెలుస్తోంది. ప్రాజెక్టుల నిర్మాణంపై రాజకీయ నిర్ణయాలు జరగడంతో అధికారులు అందులో పావులుగా మారేందుకు జంకుతున్నారు. సిబిఐ, లోకాయుక్త లాంటి సంస్థలు చురుకుగా వ్యవహరిస్తుండటంతో ప్రాజెక్టుల వివాదాలలో అధికారులు బలికావడానికి సిద్ధంగా లేనట్టు వారు స్వయంగా పేర్కొంటున్నారు.
ఇదిలావుండగా, తెలంగాణ ప్రాంతంలో భారీ ప్రాజెక్టు అయిన ప్రాణహిత -చేవెళ్ళ ప్రాజెక్టు వ్యవహారం ఒక్క ఇంచు కూడా ముందుకు సాగలేదు. ప్రాజెక్టు సర్వే, డిజైన్‌ల కోసం సుమారు 1100 కోట్లు ఖర్చు చేశారు. ఇంతకు మించి ఆ ప్రాజెక్టు వ్యవహారం ముందుకు కదలడంలేదు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రము ప్రాణహిత- చేవెళ్ళతో పాటు పోలవరం ప్రాజెక్టులకు రెండింటికి జాతీయ హోదా కల్పించాలని కేంద్రాన్ని కోరుతోంది. ఈ విషయంలోనూ ఎలాంటి ప్రగతి కన్పించడం లేదు. ప్రాణహిత- చేవెళ్ళ అతి పెద్ద ప్రాజెక్టుగా పేర్కొంటున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి జరిగే రిజర్వాయర్‌ నిర్మాణం వలన మహారాష్ట్రలో నీటి ముంపు ఉండటం వలన కూడా ప్రాజెక్టు పనులను ప్రారంభించేందుకు తీవ్ర అడ్డంకిగా మారినట్టు పలువురు పేర్కొంటున్నారు.
ఎఐబిపి ద్వారా 4,500 కోట్లు
ఎఐబిపి కేంద్ర ప్రభుత్వ పథకం. దీని ద్వారా వ్యవసాయ రంగంలో సత్వర సాగునీటి లబ్ధిని చేకూర్చేందుకు ఉద్దేశించి ఈ పథకాన్ని అమలుచేస్తున్నారు. 2011 సంవత్సరంలో ఏప్రిల్‌ నుండి అక్టోబర్‌ వరకు ఈ పథకం కింద 4,500 కోట్లు ఖర్చు చేసినట్టు రికార్డులు చెబుతున్నాయి. స్వర్ణముఖి ప్రాజెక్టులో భాగంగా రిజర్వాయర్‌ను కూడా నిర్మించేందుకు నిర్ణయించారు. ఈ ప్రాజెక్టు కోసం 23 లక్షలు మాత్రమే 2010-11కు సంబంధించి ప్రభుత్వం విడుదల చేసింది. వెల్లిగళ్ళు రిజర్వాయర్‌కు రెండేళ్ళలో సుమారు 8 కోట్లు కేటాయించారు. పాలెం వాగుకు 2010-12 మధ్య కాలంలో 38 కోట్లు కేటాయించారు. సుద్దవాగు ప్రాజెక్టుకు 2 కోట్లు కేటాయించారు. గొల్లవాగు 9 కోట్లు, కొమురం భీం ప్రాజెక్టుకు రెండేళ్ళలో 74 కోట్లు కేటాయించారు. నీల్‌వాయి ప్రాజెక్టు 12 కోట్లు కేటాయించారు. మోడికుంట వాగు ప్రాజెక్టుకు ఇందులో ఒక కోటి రూపాయలు కేటాయించారు. భారీ ప్రాజెక్టుల నిర్మాణం కోసం మొత్తంగా రెండేళ్ళలో 840 కోట్లు కేటాయించారు. ఇందులో గోదావరి బ్యారేజి, ప్రకాశం బ్యారేజి, ఏలేరు రిజర్వాయర్‌, తారకరామా కృష్ణవేణి ఎత్తిపోతల పథకం, సింగూరు ప్రాజెక్టు, డాక్టర్‌ కెఎల్‌ రావు పులిచింతల ప్రాజెక్టు తాండవ రిజర్వాయర్‌, మూసి ప్రాజెక్టు, నారాయణపురం ఆణికట్‌ లాంటి ప్రాజెక్టులన్ని ఇందులో ఉన్నాయి. అతి తక్కువ నిధులు కేటాయించడం వలన ప్రాజెక్టుల నిర్మాణం ముందుకు సాగడం లేదు. ఒకవైపు నిధుల కొరత, మరోవైపు ప్రాజెక్టులకు అనుమతుల సమస్యలు వేధిస్తున్నాయి. మధ్య తరహా ప్రాజెక్టుల నిర్మాణాలలో 68 ప్రాజెక్టులను నిర్మించేందుకు ప్రణాళికను సిద్ధం చేశారు. వీటి నిర్మాణాలకు 329 కోట్లను కేటాయించారు. నిధులు అరకొరగా ఉండటంతో ప్రాజెక్టుల నిర్మాణంలో ప్రగతి మందగించినట్టు విమర్శలున్నాయి.