1, జనవరి 2012, ఆదివారం

'ప్రత్యేక' పర్యవేక్షణలో పడకేసిన పాలన 2011లో పురపాలక పట్టణాభివృద్ధిశాఖ

పట్టణాలు, నగరాలలో మౌలిక సదుపాయాలను కల్పించాల్సిన రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధిశాఖ ఈ ఏడాది ఆదాయం కోసం పన్నుల విధింపునే మార్గంగా ఎంచుకుని వసూళ్ళే లక్ష్యంగా పనిచేసింది. ఈ ఏడాది ప్రారంభంలో పురపాలక పట్టణాభివృద్ధిశాఖ పన్ను వసూళ్ళు రూ.900 కోట్లు కాగా సంవత్సరాంతానికి ఈ మొత్తం రూ.1500 కోట్లకు చేరుకుంది. పన్నుల వసూళ్ళ కోసం ఏకంగా కొత్త మున్సిపాలిటీల ఏర్పాటుకు కూడా శ్రీకారం చుట్టింది. గతంలో తమ ప్రాంతం మున్సిపాలిటీగా ఏర్పాటవడాన్ని గొప్పగా చెప్పుకునే ప్రజలు పన్నుల భారాన్ని భరించలేక ఆ హోదా వద్దనే స్థితికి చేరుకున్నారు. 2010 సెప్టెంబర్‌లో 108 మున్సిపాటిటీలు, నగర పాలక సంస్థలలో ప్రారంభమైన ప్రత్యేకాధికారుల పాలన అస్తవ్యస్తంగా తయారవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఆస్తిపన్నుతో పాటు చెత్త, మంచినీటిపై కూడా పన్ను విధించడంతో అన్ని ప్రాంతాల ప్రజలు ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పదమూడవ ఆర్థిక సంఘం విధించిన నిబంధనలను అనుసరించి ప్రజలపై భారాన్ని మోపుతున్నారు. ఆస్తిపన్నును పెంచకపోతే ప్రణాళిక సంఘం నిధులు విడుదల చేయదనే బూచిని చూపించి ఆస్తిపన్ను వసూళ్ళపై ఉన్న సీలింగ్‌ను ఎత్తివేయడంతో ప్రజల జేబులకు చిల్లు పడనుంది. ఈ నిర్ణయం వలన కొన్ని మున్సిపాలిటీలలో 5నుంచి 300శాతం మేరకు ఆస్తిపన్ను పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రజలకు ఉచితంగా అందించాల్సిన సేవలన్నింటిపై పన్ను రూపంలో పడుతున్న భారాన్ని వసూలు చేసేందుకు ఆయా శాఖలను ఏకంగా ప్రైవేటు పరం చేశారు. చివరకు వీధి దీపాల నిర్వహణను కూడా ప్రైవేటు వ్యక్తులకు అప్పగించారు. ఈ ఏడాది మహానగరాలలో ఉచిత టాయ్‌లెట్‌లు కనుమరుగయ్యాయి. రాష్ట్రంలోని పలు పురపాలక సంఘాలకు ప్రభుత్వం నుంచి వివిధ పద్దుల కింద రావాల్సిన నిధులు విడుదల కాకపోవడంతో ఆయా మున్సిపాలిటీలు ఆర్దికంగా దివాళా తీశాయి. రాజీవ్‌ యువ కిరణాల పేరిట జెఎన్‌యుఆర్‌ఎం ద్వారా 40 వేల ఉద్యోగాలు ఇస్తామని ఆర్భాటంగా ప్రకటించినప్పటికీ వాటిని ఏ రూపంలో ఇవ్వాలో తెలియక పురపాలక అధికారులు తలలు పట్టుకున్నారు. ఈ పథకం కింద కేంద్ర నిధులు రాబట్టుకునేందుకు అవసరమైన ప్రణాళికలను రూపొందించేందుకే ఈ సంవత్సరమంతా అధికారులకు సరిపోయింది. పట్టణాలలో మురికి కాలువల శుభ్రం కోసం రూ.4500 కోట్ల ప్రతిపాదనలను కేంద్రం బుట్ట దాఖలు చేసింది. ఈ ఏడాది పట్టణ ప్రాంతాలలో 2 లక్షల ఇళ్ళను నిర్మించి ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఆ లక్ష్యాన్ని నేరవేర్చడంలో చేతులెత్తేసి కేవలం 50వేల ఇళ్ళను మాత్రమే అందించింది. పట్టణాలు, నగరాలలో పెరిగిపోతున్న అక్రమ నిర్మాణాలపై దృష్టి సారించిన మున్సిపల్‌ అధికారులు వాటి ద్వారా భారీ ఎత్తున అపరాధ రుసుంను వసూళ్ళు చేశారు. ఒక్క హైదరాబాద్‌ నగరంలోని మూడు సర్కిళ్ళ పరిధిలలోనే లక్షా 20 వేల అక్రమ నిర్మాణాలను అధికారులు కనుగొన్నారు. విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, వరంగల్‌ తదితర నగరాలలో కూడా ఈ తరహ వసూళ్ళు మొదలయ్యాయి. వచ్చేసరికి సాంకేతిక కారణాలను చూపిస్తూ చేతులెత్తేశారు. ఉప ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని చేసిన ఈ ప్రకటన ఎంతవరకూ అమలవుతుందో వేచి చూడాల్సిందే.