15, నవంబర్ 2011, మంగళవారం

కవలల గ్రామం

కేరళలోని మలప్పురం జిల్లాలోని కొడిన్హి గ్రామంలో ఎక్కడ చూసినా కవల పిల్లలే కానవస్తారు. ఇక్కడ మొత్తం రెండువేల కుటుంబాలకు గాను 15వేల మంది నివసిస్తున్నారు. ప్రతి 40 మంది స్త్రీలలో కనీసం ఒకరికి కవలలుంటారు. ప్రపంచంలో కవలల శాతం వెయ్యికి అరుగురైతే, భారతదేశంలో వెయ్యికి 8.1 శాతం. ఈ గ్రామంలో గతంలో శిశు మరణాలుండేవి. వైద్య వసతులు మెరుగవడంతో శిశు మరణాల సంఖ్య గణనీయంగా తగ్గింది. ఆడ కవల పిల్లల సంఖ్యే అధికంగా కానవస్తుంది.
తికమక మకతిక
కొడిన్హి గ్రామం సమీపంలోని తిరురంగాడి తాలూకా ఆస్పత్రిలోని డాక్టర్‌ ఎం.కె. శ్రీబిజు ఆసక్తిగా యిక్కడ కవలల గురించి అధ్యయనం చేస్తున్నారు. గల్ఫ్‌ దేశాలకు పలువురు పిల్లల తండ్రులు ఉద్యోగాల కోసం తరలివెళ్లారు. ట్విన్స్‌ అండ్‌ కిన్‌ అసోసియేషన్‌ (టాకా) ఉపాధ్యక్షుడు పాతూర్‌ అబ్దు రెహ్మాన్‌ ''ఈ కవలలను సాకటం కష్టంతో కూడిన పని. ముఖ్యంగా ఆడపిల్లల విషయంలో మరింత జాగ్రత్త వహించాలంటారు. వీరికి ఫజీహీ, ఫరీసా కవలలున్నారు.
తేరంబాల్‌ రెహ్మాత్‌కు ఐదుగురు పిల్లలు. వీరిలో రెండు జంటలు కవలలు. చిత్రమేమిటంటే కవలలో ఒకరికి జ్వరంవస్తే, రెండవ వారికి సోకటం సర్వసాధారణం. మరొక యిబ్బంది ఏమంటే, స్కూలులో కవలల్లో ఒకరినొకరిని టీచర్లు గుర్తించడం చాలా కష్టంగా వుందంటున్నారు. పేర్లు కూడా యించుమించు ఒకేలా వుంటాయి. ముసీదా, ముబీనా, షివశినా, ఇఫానా, షమీమ్‌, షమీమా రోజూ హాజరు పట్టీలో పేర్ల ఉచ్ఛారణలో తడబాట్లు కానవస్తాయి. ఫజీహా అని పిలిస్తే ఫరీసా, 'ఎస్‌, మేడమ్‌' అంటుంది. వయసు పెరిగే కొద్దీ వారిని గుర్తించడం కష్టమేమి కాదంటారు టీచర్లు.
బాల్య వివాహాల శాపమా?
కవలల జన్మకు ప్రధాన కారణం ముస్లింలలో బాల్య వివాహాలే అంటారు కొందరు. కానీ కవలలు ఇతర మతాలలో కూడా కానవస్తారు. ఈ గ్రామానికి వలసవచ్చిన వారు కూడా కవలల ప్రసవానికి నోచుకున్నారు. డాక్టర్‌ ఎం.కె. శ్రీబిజు పరిశోధనలలో తేలిందేమంటే, రెండు వీర్యకణాలకు రెండు అండాలు కనుగొన్నామంటారు.
కాలుష్య ప్రభావం
కొడిన్హి గ్రామం తన కవలల సంస్కృతికి చుట్టుపక్క గ్రామాలకు కూడా విస్తరింపజేస్తుందని టాకా ఉపాధ్యక్షుడు పాతూర్‌ అబ్దు రెహ్మాన్‌ తెలియజేశారు. కొడిన్హిలో రెండు సంవత్సరాల క్రితం కవలల సంఖ్య 260 వుంటే, ఇప్పుడు వీరి సంఖ్య 350 పైమాటే. ఈ గ్రామానికి నవదంపతులు కాపురానికొస్తే పండంటి కవలలు పుట్టడం ఖాయమంటున్నారు విశ్లేషకులు. ఈ గ్రామంలో కవలలు జన్మించటం 70 సంవత్సరాల క్రితం ప్రారంభమైంది. కొందరు యిక్కడ వాతావరణం గాలి, నీరు, ఆహారం కవలల సంఖ్యను పెంచడానికి దోహదం చేస్తాయంటారు. డాక్టర్‌ శ్రీబిజు ఇది వంశపారంపర్యం కావంటారు. కొందరు యిక్కడ వాతావరణ కాలుష్యం కవలల సంఖ్య పెరడటానికి ముఖ్య కారణమంటారు.
సాధారణంగా కవలలు వయసు అధికమించిన వారికే జన్మిస్తారు. కానీ కొడిన్హి గ్రామంలో యువ దంపతులకు కూడా కవలలు పుట్టిన సంఖ్య అనేకం. యువతులు ఎత్తు 5 అడుగుల 3 అంగుళాలు అధికమించిన వారికి కవలలు జన్మిస్తారు. కానీ యిక్కడ 5 అడుగుల ఎత్తు వారికి కూడా కవలలు జన్మించారు. టాకాలో 220 జంటలు గతంలో సభ్యులుంటే, యిప్పడు వీరి సంఖ్య 660 పైమాటే.