15, నవంబర్ 2011, మంగళవారం

సేవాతత్పరతకి... శాల్యూట్‌

తనవాళ్ల కన్నా దేశమే మిన్న అన్న భావనతో ఖాకీ దుస్తుల్ని ధరించిన రోజే త్యాగాలకు సిద్దమై...
అను నిత్యం సరిహద్దుల్లో అప్రమత్తత ప్రదర్శిస్తూ... శత్రు దేశాల దాడుల్ని ఎదుర్కొంటూ..
కంటికి రెప్పలా దేశాన్ని కాపాడుకుంటూనే మరోవైపు దేశంలో జరుగుతున్న అన్యాయాలు,
అక్రమాలను ఎదుర్కొంటూ... శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిని ఉక్కుపాదంతో అణచివేస్తూ...
తమ కర్తవ్య నిర్వహణలో అసువులు బాసిన ఎందరో వీర జవాన్లను, పోలీసు అమర వీరులను
గుర్తు చేసుకోవాల్సిన బాధ్యత మనందరిదీ.
వైద్యం తర్వాత పవిత్రమైంది పోలీసు వృత్తే! ఒక విధం గా చెప్పాలంటే వైద్యం కంటే కూడా పోలీసు వృత్తే మరింత పవిత్రమైంది. ఎందుకంటే ప్రాణం పోసే వైద్యుడికి విధి, నిర్వహణలో ప్రాణాపాయం బహుఅరుదు. కాని పోలీసుల విధి అలా కాదు. ముప్పు ఏమూల నుం చి ఎప్పుడైనా ముంచుకొని రావచ్చు. యావత్‌ జాతినీ దిగ్భ్రాంతికి గురిచేసిన ముంబయి మారణహోమంలో ప్రాణాలు పోగొట్టుకుంది. జాతీయతకు మారుపేరు లాంటి పార్లమెంటుపై దాడి ఘటనను ధైర్యంగా తిప్పికొట్టి అసువులు బాసిందీ పోలీసులే. నాగరికత ఏర్పడినప్పటి నుంచీ ఏదో రూపంలో పోలీసులు సమాజానికి సేవ చేస్తూనే ఉన్నారు. ఆసుపత్రి వరకూ వెళ్ళే పరిస్థితి ఎప్పుడూ రాకూడదని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అంటే దాని అర్థం ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండాలనే. అలానే పోలీసు స్టేషన్‌కు వెళ్ళాల్సిన పరిస్థితి కూడా రాకుండా ఉంటే మంచిదే. కాని నానా రకాల రుగ్మతల తో సతమతం అవుతున్న సమాజంలో అది సాధ్యమా పోలీసుల ప్రమేయం లేకుండా మనుగడ సాధించడం కుదురుతుందా కానే కాదు. మనిషి మనుగడకు వైద్యం ఎంత ప్రాణప్రదమో ప్రజల ధన, మాన, ప్రాణాలు కాపాడే వృత్తి నిర్వహిస్తున్న పోలీసులు కూడా అంతే అవసరం. పోలీసు శాఖలో చిన్న చిన్న లోపాలు ఉంటే ఉండవచ్చు. దానివల్ల పోలీసులపై కొంత వ్యతిరేకత ఉంటే ఉండవచ్చు.
కాని ఇప్పటికీ ఎవరికి ఏ కష్టమొచ్చి నా ముందు గుర్తొచ్చేది పోలీసులే. అగ్నిప్రమాదాల వంటివి జరిగినప్పుడు కూడా ప్రజలు సంబంధిత అగ్నిమాపక శాఖతోపాటు మాకూ ఫోను చేస్తుంటారు. మేం కూడా అది మాకు సంబంధం లేదని వదిలివేయం. ప్రజలు బాధలో ఉన్నప్పుడు తమకేమీ పట్టనట్లు పోవడం పోలీసు రక్తంలోనే ఉండదు. ఏవైనా ప్రమాదాలు జరిగినప్పుడు సాయం చేయమని అధికారులు ఆదేశాలు జారీ చేయరు. విధి నిర్వహణలో ఉన్న పోలీసు లు వారంతట వారే రంగంలోకి దిగుతారు. ఎన్నో సంఘటనల్లో

ఇది రుజువైంది. 2008 నాటి ముంబయి మారణకాండలో రైల్వే స్టేషన్‌లో ముష్కరులు దాడి చేసినప్పుడు

జిల్లూ యాదవ్‌ అనే రైల్వే కానిస్టేబుల్‌ వారిని ధీటుగా ఎదుర్కొన్నారు. ఉగ్రవాదులు అత్యాధునిక ఆయుధాల తో చెలరేగి పోతుంటే, అప్పటికే పెద్దసంఖ్యలో ప్రజలు చనిపోయి, మిగిలినవారు పారిపోతుంటే యాదవ్‌ మాత్రం తన వద్ద ఉన్న 303 పాతతరం తుపాకీతోనే ఉగ్రవాదంపై తిరగబడ్డాడు.
కాలంతోపాటు పోలీసు విధుల్లోనూ అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. కొత్త కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయి. వాటన్నింటినీ తట్టుకొని ముందుకు వెళ్లేందుకు యావత్‌ పోలీసు శాఖ పట్టుదలతో శ్రమిస్తూనే ఉంది. నేరగాళ్ళు తన అస్త్ర, శస్త్రాలకు పదును పెడుతున్నారు. ఒకప్పుడు కత్తులు, కర్రలతో దుండగులు దాడులకు పాల్పడితే ఇప్పుడు ఉగ్రవాదులు ఎ.కె.47 వంటి అత్యాధునిక ఆయుధాలతో విరుచుకుపడుతున్నారు. మనుషులు కనిపించకుండానే సైబర్‌ నేరాల ద్వారా ప్రజల ఆస్తులు కొల్లగొడుతున్నారు. సరిహద్దులు

చెరిపేసే కొత్తతరం నేరగాళ్ళు పుట్టుకొస్తున్నారు.
ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా సాంకేతిక నేరగాళ్ళు విజృంభిస్తున్నారు. ముష్కరులను ఎదుర్కొనేందుకు భుజబలం కావాలి. సైబర్‌ నేరగాళ్లను ఎదుర్కొనేందుకు బుద్ధి బలం

కావాలి. ఈ రెండింటినీ బ్యాలన్స్‌ చేసుకుంటూ పోలీసుశాఖ ముందుకు వెళుతోంది. ఇందుకు ప్రభుత్వాలు కూడా ఇతోధఇకంగా సహకరిస్తున్నాయి. ఈ మధ్యకాలంలో ప్రభుత్వాల తీరులో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. పోలీసులకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నాయి. గతం లో ఎన్నడూ లేనంత భారీగా నిధులు మంజూరు చేస్తున్నాయి. దేశంలోనే తొలిసారిగా సైబర్‌ పోలీసుస్టేషన్‌ ఏర్పాటు చేసిన ఘనత మనదే. పోలీసు శాఖ కంప్యూటరీకరణలోనూ మనమే ముందున్నాం. ఇప్పుడు ఎఫ్‌ఐఆర్‌ నమోదు మొదలు పోలీసుపనులన్నీ కంప్యూటర్‌ ద్వారానే జరుగుతున్నాయి. అందు కే కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకం గా చేపట్టిన సిసిటిఎన్‌ఎస్‌ ప్రాజెక్టులోమననే ప్రధాన భాగస్వామి గా చేసింది. వామపక్ష ఉగ్ర వా దంపై పైచేయి సాధించి దేశానికి ఆదర్శంగా నిలిచినఘనత కూడా మనకే సొంతం. అయితే సామర్థ్యంపరంగా ఎప్పటికప్పుడు మెరు గులు దిద్దుకుంటూనే పోలీసులకు కల్పించే వసతుల విషయం ఇంకా అనేక సంస్కరణలు చేపట్టాల్సి ఉంది. ఈ దిశగా కసరత్తు జరుగుతోంది.
పోలీసులంటే త్యాగానికి ప్రతీకలు. అయితే దురదృష్టవశాత్తూ పోలీసులు చేస్తున్న మంచి పనుల కంటే ఒకరిద్దరు చేసే చెడు పనులే ఎక్కువ ప్రాచుర్యం పొందుతున్నాయి. వాస్తవానికి ఎప్పుడూ పోలీస్‌ స్టేషన్‌కు వెళ్ళ ని వారికికూడా పోలీసుల పట్ల దురభిప్రాయం నెలకొని ఉం టుంది. కాని ప్రజలు, పోలీసులు మధ్య సత్సంబంధాలు ఉన్నప్పుడే సమాజంలో శాంతిభద్రతలు పరిఢవిల్లుతా యి. అందుకే ఇప్పుడు ఈ దిశగా కృషి మొదలుపెట్టాం. పోలీస్‌ స్టేషన్‌కు వచ్చే ప్రతి ఒక్కరూ తమకు న్యాయం జరిగిందనే సంతృప్తితో తిరిగి వెళ్ళేలా చూసేందుకు ప్రయత్నిస్తున్నాం.
అయితే పోలీసు వృత్తి ఎంతో సంక్లిష్టమైంది. సంఘటన ఏదైనా సరే బాధితులు ఎవరో, బాధ్యులు ఎవరో తేల్చి చెప్పడం కష్టం. కాని ఇప్పుడు ప్రజలు ఇన్‌స్టెంట్‌ ఫలితం ఆశిస్తున్నారు. దర్యాప్తు చేసే అవకాశం కూడా ఇవ్వడంలేదు. పోలీసులు మారాలి అని ఆశించే ప్రజలు ముందు సానుకూల దృక్పథం అలవాటు చేసుకోవాలి. అయితే ఇందులో ముందు గా కృషి చేయాల్సింది పోలీసులే.
ప్రజలతో మమేకం అయ్యేందుకు ప్రతి ఒక్కరూ పాటుపడాలి. ఇందుకు ముందుగా పై నుంచి అంటే అధికారుల నుంచి చొరవ తీసుకోవాలి.
త్యాగాలు నిరుపమానం.
గడచిన పదేళ్ళకాలంలో రాష్ట్రంలో వామపక్ష తీవ్రవాదం కారణంగా 180 మందికి పైగా పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. ప్రత్యేకంగా వీరికి మావోయిస్టులతో వ్యక్తిగత వైరం ఏమీ లేదు. విధి నిర్వహణలో... శాంతిభద్రతల పరిరక్షణలో బలి పశువులు అవుతున్నారు. దేనికీ వెరువకుండా కృషి చేస్తున్నారు.
చిన్నాచితకా పొరపాట్లు జరిగినా అవన్నీ విధి నిర్వహణలో జరిగే పొరపాట్లే. అయితే పోలీసు పొరపాట్లు ప్రజ ల మీద ప్రత్యక్ష ప్రభావం చూపిస్తాయి కాబట్టి ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. సాధ్యమైనంత వరకూ ఏ పొరపాటుకీ తావులేకుండానే ప్రయత్నిస్తుంటారు. అందుకే ప్రతి సంఘటననూ సవాలుగా తీసుకుంటాం. అందుకు తగ్గ ట్టు ఎంతో కృషి చేస్తాం. వివాదాస్పదం కావాలని ఎప్పు డూ కోరుకోం. కాని పోలీసు విధి నిర్వహణ అత్యంత సున్నితమైనప్పుడు అన్నింటినీ తట్టుకోగలిగే మానసికస్థైర్యం అలవరచుకోవాలి. ఒకరిద్దరు పోలీసుల ప్రవర్తన కారణంగా వారి త్యాగాలు మరుగున పడిపోతున్నాయి.
ప్రజలకు ఇప్పటికీ పోలీసులంటే అమితమైన గౌరవం ఉంది. అందులో ఏమాత్రం అతిశయోక్తి లేదు. లేకపోతే నొప్పి కలగగానే అమ్మా అన్నట్లుగానే సమస్య రాగానే పోలీసులు గుర్తుకు రారు. మా అవసరం రాకపోతే సంతోషమే. కాని మేం అవసరం ఉన్నప్పుడూ మా విధి నిక్కచ్చిగా నిర్వహించగలగాలని కోరుకుంటున్నాం. ఇందుకు తగ్గట్టుగా సిబ్బందిని సమాయత్తపరుస్తున్నాం.

మహిళలూ అతీతులు కారు
విధ్వంసం సంభవించినప్పుడు ప్రాణం కాపాడుకోవడం బదులు ప్రాణాలు కాపాడాలనే ధైర్యం పోలీసు యూనిఫాం ధరించిన ప్రతి ఒక్కరికీ పుట్టుకొస్తుంది. ఇందుకు మహిళా పోలీసులు కూడా అతీతం కాదు.
పార్లమెంటుపై దాడి జరిగినప్పుడు ముష్కరులను నిలువరించేందుకు ప్రయత్నించి ర్యాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌కు చెందిన మహిళా కానిస్టేబుల్‌ కమలేష్‌కుమార్‌ప్రాణాలు పోగొట్టుకుంది. చెప్పుకుంటూ పోతే ఇలాంటి ఉదంతాలు కోకొల్లలు.

ప్రాంతాలకతీతం... ఈ ఉద్యోగం
పోలీసులకు ప్రాంతాలతో సంబంధం లేదు. యూనిఫాం ధరించగానే అన్నింటికీ అతీతం అన్న భావన కలుగుతుంది. తాను నిర్వర్తించాల్సిన పనే గుర్తుంటుంది. మరీ మెతకగా ఉంటే ఉద్యమకారులు తిరగబడి ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేస్తారు. కాస్త కఠినంగా వ్యవహరిస్తే పోలీసుల దురుసుగా ప్రవర్తించారంటారు.రెండింటి మద్యా బాలన్స్‌ చేయడం కత్తి మీద సామే. ముఖ్యంగా గత 2 సంవత్సరాలుగా రాష్ట్రంలో జరుగుతున్న వివిధ రకాల ఉద్యమాల్లో పోలీసులు నిర్వహిస్తున్న పాత్ర నిజంగానే అభినందనీయం.

కె ఎస్‌ వ్యాస్‌
తీవ్రవాదాన్ని, రౌడీయిజాన్ని ఉక్కుపాదంతో అణచి వేసిన వ్యక్తిగా పేరున్న వ్యాస్‌. ఎప్పటిలాగే 1993 జనవరి 27
ఉదయం జాగింగ్‌ కోసం ఎల్బీ స్టేడియంకి వచ్చిన
ఆయన్ని నక్సల్స్‌ అతి దారుణంగా హత్య చేసారు.

పరదేశీ నాయుడు
మహబూబ్‌నగర్‌ జిల్లా ఎస్పీగా పని చేస్తున్న సమయంలో ఈయన కూంబింగ్‌ కోసం వెళ్లి వస్తుండగా... 1993 నవంబర్‌ 14న నక్సల్స్‌ పేల్చిన క్లైమూర్‌మైన్‌కి గాయపడి మరణించారు.

ఉమేష్‌ చంద్ర
ఫ్యాక్షన్‌ నాయకులని గడగడలాడించి సామాన్య జనానికి అందుబాటులో ఉండే పోలీసు అధికారిగా పేరుతెచ్చుకున్న ఉమేష్‌ చంద్రని 1999 సెప్టెంబర్‌ 4న హైదరాబాద్‌లోని ఎస్‌ఆర్‌ నగర్‌ చౌరస్తావద్ద పట్టపగలే నక్సల్స్‌ హత్య చేసారు.

అమరవీరులెందరో....
తీవ్రవాది ముజీబ్‌ అహ్మద్‌ని పట్టుకునే క్రమంలో మరణించిన ఏసీపి కృష్ణప్రసాద్‌, ఎస్‌ఐ సైదులు, కానిస్టేబుల్‌ సాయిలు, హౌం గార్డు సత్యనారాయణ, బాలస్వామి ఇలా ఎందరో నిరం తరం తమ ప్రాణాలను పణంగా పెట్టి మనల్ని రక్షిస్తున్నారు.

వ్యాస రచయిత :
వి. దినేష్‌ రెడ్డి
డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌, ఏపి