15, నవంబర్ 2011, మంగళవారం

పట్టుబడతామని ఒకరు పట్టెడన్నం కోసం మరొకరు

ఎవరి నోట విన్నా అదే మాట. లోకం తీరు మారిందని.. మధ్య తరగతి కుటుంబాలు వీధిన పడుతున్నాయని...
అయితే ఒక అంశం ధనిక, పేద తారతమ్యం లేకుండా అందరిపై ప్రభావం పడుతోంది.
ఒకరిది పట్టుబడతానేమోనన్న భయమైతే... ఇంకొకరిది పట్టెడన్నం దొరకదేమోనన్న భయం...
అవినీతికి అలవాటుపడ్డ రాజకీయ నాయకులు, ప్రభుత్వ ఉద్యోగుల శాతం నానాటికీ పెరుగుతోందని లెక్కలు చెబుతున్నాయి. ఆకాశన్నంటుతున్న ధరల కారణంగా సామాన్య ప్రజల సమస్యలు కళ్ళకు కట్టినట్టుగా దర్పణమిస్తున్నాయి.
సమాజంలో వివిధ తరగతుల ప్రజలుంటారు. సమస్యల ప్రభావం ఒక్కొక్కరిపై ఒక విధంగా పడుతుంది.
ప్రస్తుత పరిస్థితిని ప్రతిబింబించేలా వాస్తవాలను 'ఆంధ్రప్రభ' పాఠకుల ముందు ఉంచడానికి చేసిన ప్రయత్నమిది.

'దేశమంటే మట్టికాదోయ్‌ దేశమంటే మనుషులోయ్‌' అని నిర్వచించినా...
'ఉసురోమని మనుషులుంటే దేశ మేగతి బాగుపడునోయ్‌' అని ప్రశ్నించినా...
మనదేశం, అందులోని అందరు ప్రజలు బాగుపడాలనే.
అయితే ప్రస్తుతం సామాన్యప్రజలు అష్టకష్టాలు పడుతు న్నారు. దేశం సాంకేతికంగా ప్రగతి పథంలో ఉందని గొప్పలు చెప్పుకుంటున్నా పెరుగుతున్న అవినీతి కంపు ముక్కు మూసుకునేలా చేస్తోంది. అవినీతి వ్యవస్థీకృతం కావడం వల్ల మధ్యతరగతి ప్రజానీకం జనజీవనం అస్తవ్యస్తమవుతోంది. బడా రాజకీయ నాయకులు, పారిశ్రామిక వేత్తల ఆస్థులు వేల కోట్లకు చేరుతున్నాయి. ఎవరు ప్రగతి చెందుతున్నారన్న ప్రశ్నకు రైతుల ఆత్మహత్యల నుంచి నానాటికీ పెరుగుతున్న దిగువ మధ్యతరగతి కుటుంబాల సంఖ్య చెప్పకనే చెబుతున్న సమాధానం. సాక్షాత్తూ సుప్రీంకోర్టు కలుగ చేసుకోక పోతే... ఇటీవల జరిగిన లక్షల కోట్ల రూపాయల కుంభకోణాల పాత్రధారులు బయటికి వచ్చేవారు కాదు. మరి సూత్రధారులే పాతధారులా లేక సూత్రధారులు వేరే ఉన్నారా అన్న సంగతి తేలాల్సి ఉంది.
2జీ కుంభకోణం, కామన్వెల్త్‌ పోటీల నిర్వహణలో జరిగిన భారీ అవినీతి సొమ్ము వాస్తవానికి మనం పన్నుల రూపంలో ఇచ్చిన సొమ్ము. పెరుగుతున్న ధరలు, నల్లధనం, విదేశీ ఎకౌంట్లలో మూలుగుతున్న కోట్ల రూపాయలు, ఉగ్రవాదం, భూసేకరణ, వ్యవసాయం, ప్రకృతి వనరులు, పెరుగుతున్న నేరాలు, కుంటుపడుతున్న అభివృద్ధి, విద్యుదుత్పత్తిపై దుష్ప్ర భావం, ఆరోగ్యం, విద్య, పర్యావరణం లాంటి ప్రతి అంశంపై అస్తవ్యస్త ఆర్థిక వ్యవస్థ ప్రభావం ఉంటోంది. చిన్న పెద్ద అనే బేధం లేకుండా మన కుటుంబాలు చితికి పోతున్నాయి.
స్కాముల ఏడాదిగా 2010
మనదేశం స్వాతంత్య్రం సాధించిన తర్వాత ఎప్పుడూ లేని విధంగా 2010లో అవినీతి రికార్డు స్థాయికి చేరింది. ఎస్‌.బ్యాండ్‌లో దాదాపు 2లక్షల కోట్లు, 2జీ కుంభకోణంలో రూ. 1.76 లక్షల కోట్లు, కామన్‌ వెల్త్‌ గేమ్స్‌లో రూ. 77వేల కోట్లు, ఆహార ధాన్యాల్లో రూ. 58 వేల కోట్లు, 'సత్యం' కంప్యూటర్స్‌ అవకతవకలు రూ.24 వేల కోట్లు, బియ్యం ఎగుమతు లు రూ. 2500 కోట్లు, ఆదర్శ్‌ ఇళ్ళ కుంభకోణం దాదాపు 1000 కోట్లు, కొచ్చి క్రికెట్‌ యాజమాన్య హక్కుల వేలం పాటలో సైతం రూ. 70 కోట్ల కుంభ కోణం జరిగిందని అంచనా.
ప్రముఖులే నిందితులు
2జీ స్కాంలో అప్పటి టెలీకమ్యూ నికేషన్ల మంత్రి ఎ.రాజా, ఎస్‌.బ్యాండ్‌స్కాంలో ఏకంగా ప్రధాని కార్యాలయం, ఇస్రో అధికారుల ప్రమే యం ఉందన్న ఆరోపణ ఉంది. మహారాష్ట్ర రాజకీయ దిగ్గజాలు అశోక్‌ చవాన్‌, సుషీల్‌కుమార్‌ షిండే,
కన్వియాలాల్‌ గిద్వాని, బాబాసాహెబ్‌ కుపేకర్‌లున్నా రని ఆరోపణ.
పాడైపోయిన ఆహార ధాన్యాల కుంభకోణంలో కేంద్రమంత్రి శరద్‌పవార్‌, బియ్యం ఎగుమ తుల స్కాంలో ప్రభుత్వ పెద్దలు, కొచ్చి జట్టు ఐపిఎల్‌ వేలం పాటలో కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్‌, 'సత్యం' కంప్యూటర్స్‌ సంస్థ అప్పటి అధినేత రామలింగరాజులతో పాటు అంతగా ప్రచారం పొందని పిడిఎస్‌ కుంభకోణం, ఎల్‌ఐసి గృహరుణాల కుంభకోణాల వెనుక రాజకీయ నాయ కులు, సంస్థల అధిపతు లున్నారు.
ఈ సంఖ్యను చదవండి... రూ. 53,85,70,00,00,000
నిజానికి ఈ సంఖ్యను చదవడం కూడా కష్టమే. గణిత శాస్త్రం తెలిసిన వాళ్ళయినా రెండుమూడు సార్లు చదివితే గానీ అర్థం కానంత పెద్దసంఖ్య. రూ. 5,38,570 కోట్లు. ఇదీ 2010లో కుంభకోణాల అవినీతి సొమ్ము అని అంచనా.
ఈ ఏడాదీ లోటు బడ్జెట్‌
ఒక ప్రక్క లక్షల కోట్ల రూపాయలు కుంభకోణాలు జరిగి సామాన్యులపై భారం పడుతోంది. దేశ ఆర్థిక మంత్రి ఈ ఏడాది మళ్ళీ లోటు బడ్జెట్‌నే ప్రవేశపెట్టారు. మొత్తం బడ్జెట్‌ రూ. 12,57,729 కోట్లు కాగా లోటు బడ్జెట్‌ రూ. 4,12,817 కోట్లుగా చూపారు.
కేటాయింపులున్నా ప్రగతి మృగ్యం
కేంద్ర బడ్జెట్‌లో ఈ ఏడాది వ్యవసాయానికి రూ. 4,75,000 కోట్లు, మౌలిక సదుపాయాల కల్పనకు రూ. 2,14,000 కోట్లు, రక్షణ రంగానికి రూ. 1,64,415 కోట్లు, సామాజిక రంగానికి రూ. 1,60,877 కోట్లు, ఉపాధి కల్పనకు రూ. 58,000 కోట్లు, సర్వశిక్ష అభి యాన్‌కు రూ. 21,000 కోట్లు, కాశ్మీర్‌ ప్యాకేజీ రూ. 8,000 కోట్లు, న్యాయవ్య వస్థకు రూ. 1000 కోట్లు, ఇతర అన్ని రంగాలకు కలిపి రూ. 1,55,437 కోట్లు కేటాయిం చారు. అటూ ఇటుగా ప్రతి సంవత్సరం ఇలాంటి కేటాయిం పులు జరుగుతున్నవే. అయితే అవి కేటాయిం చిన పనికి పూర్తిగా వినియోగించడం లేదన్నదే సమస్య.
దేశ ఖర్చు వర్సెస్‌ అవినీతి
ప్రస్తుత సంవత్సరం మన దేశ జనాభా 121 కోట్లుగా పరిగణిం చినా ఖర్చు రూ. 12,57,729 కోట్లు. మనకు తెలిసిన గత ఏడాది అవినీతి సొమ్ము విలువ రూ. 5,38, 570 కోట్లు. అంటే ప్రతిపౌరుడికి రూ. 4500 ఉచితం గా ఇవ్వొచ్చు. ఒక్క ఏడాది అవినీతి మొత్తం విలువ ప్రస్తుత 2011-12 బడ్జెట్‌లో సుమారు 45శాతం.
సామాన్యులపై భారం
దాదాపు 44 కోట్ల మంది భారతీయులు దారిద్య్ర రేఖకు దిగువన ఉండి దినసరి వేతనం రూ. 22 కన్నా తక్కువ సంపాదిస్తున్నారని సర్వేలు చెబుతు న్నాయి. అవినీతి లేకపోతే దారిద్య్ర రేఖ దిగువ అంటూ పెట్టుకున్న గీటురాయిని తొలగించుకునే వారమని పాలకులు గ్రహించాలి.
అవినీతి సొమ్మును అరికట్టుంటే...
అంచనాల ప్రకారం గత రెండే ళ్ళలో జరిగిన రూ.5,38,570 కోట్ల అవినీతిని అరికట్టి ఉంటే, 54 కోట్ల ప్రజలకు సంవత్సరానికి వంద రోజుల పనితో పాటు కడుపునిండా ఆహారం పెట్టవచ్చు.
దారిద్య్రరేఖకు దిగువన ఉన్న 11కోట్ల మందికి ఇళ్ళు కట్టించవచ్చు. మనదేశంలో ప్రస్తుతం 6 నుంచి 16 ఏళ్ళలోపు పిల్లలు 16 కోట్ల మంది ఉన్నారు. వారందరికీ ఉచిత విద్యనియ్యవచ్చు. దేశవ్యా ప్తంగా 2,50,000 గ్రామపంచాయితీలకు రూ. 2.15 కోట్ల చొప్పున ప్రతి పంచాయితీ అభివృద్ధికి నిధులి వ్వవచ్చు.
దేశంలోని ప్రతి గ్రామానికి సిసి రోడ్డు, ప్రతి ఇంటికీ మంచినీటి సదుపాయం కల్పించవచ్చు. కొన్ని సంవత్సరాల పాటు ప్రతి పౌరునికి ఉచిత వైద్య సదుపాయం కల్పించేవారం. వేలాది మంది రైతుల ఆత్మహత్యలు ఆగేవి. ప్రతి రైతు రుణ విముక్తుడై ఇతర పంటలకు ధనం చేతిలో ఉండేది.
ప్రక్షాళన చేస్తేనే...
ప్రపంచబ్యాంకు అంచనాల ప్రకారం మనదేశం ప్రతిఏడాది రూ. 24 వేల కోట్లు నష్టపోతోంది. శిశుమరణాలు, పనిగంటల వ్యర్థం, రోగుల చికిత్స, పర్యాటక రంగాల నష్టాల వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలవుతోందన్నది నివేదికలో ఒక అధ్యాయం చెబుతోంది. జడలు విప్పిన అవినీతి వల్ల సంక్షేమ కార్యక్రమాలు సజావుగా సాగడం లేదు. దీని ప్రభావం సమాజంపై పడుతున్నది. కుటుంబంపై ఆపై ప్రతి ఒక్కరిపై పడుతోంది. లైఫ్‌ సాఫీగా సాగాలంటే ప్రక్షాళన జరగాలి. అది అన్ని స్థాయిల్లో. ఎక్కడి నుంచి అనేది ప్రతి ఒక్కరూ ప్రశ్నించుకోవాలి. నిర్ణయించుకొని ఆచరణలో పెట్టాలి. అపుడే లైఫ్‌ ఆల్‌ హ్యాపీస్‌!

విద్యా విధానంలో మార్పురావాలి
గతంలో విద్య విజ్ఞానానికి.. నీతిచంద్రిక, సుభాషితాలు, పెద్ద బాలశిక్షల వల్ల విద్యార్థుల మనోవికాసానికి
ఉపయోగపడి, ఆలోచనా సరళి మారి ఉత్తమ పౌరులు తయారైతే... నేడు భిన్నంగా మారిన విద్యా బోధనా పద్ధతిలో అతివేగం 'సామాజిక స్పృహ' అంటే ఏమిటో తెలియని స్థితికి చేర్చేసింది. మాతృభాషతో పాటు దేశభక్తి గీతాలు, మహనీయుల జీవిత చరిత్రను బోధిస్తే.. అవినీతి రహిత సమాజాన్ని రూపొందించే ఆదర్శవంతులు తయారవ్వటం ఖాయం.
- జి. శ్రీలక్ష్మీ, ఉపాధ్యాయురాలు

నిత్యావసర ధరలు ఆకాశన్నంటాయి
నాకైతే ఏమీ అర్థం కావట్లేదు. ఏం కొనేటట్టు లేదు. ఏం తినేటట్టు లేదు. నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. మా ఆయన జీతం ఇంటి అద్దెకు, నెల సరుకులు, పిల్లల చదువులకు చాలటం లేదు. మరి కొట్లు అవినీతి జరుగుతోందనే మాట వింటుంటే, ఆ భారమంతా మధ్య తరగతి జీవితం ఈడుస్తున్న మాపైనే గదా అన్న నిట్టుర్పు మిగుల్తోంది.
- లయ, గృహిణి

మళ్లిd స్వాతంత్య్ర పోరాటమే

అవినీతి, లంచగొండితనంకు వ్యతిరేకంగా ఉద్యమం జరుగుతోంది. ఒక రోజు సెలవు సైతం తీసుకొని రిలే నిరాహార దీక్షలో పాల్గొన్నా. లోక్‌పాల్‌ బిల్లు, సిబిఐ పనితీరు అంటే నాకు వీటి గురించి పెద్దగా తెలియదు. అయితే మార్పు రావాలని కోరుకుంటున్న యువతరానికి ప్రతినిధిగా నా వరకు నేను కృషి చేస్తా.
- సుధీర్‌, సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి

కలికాలం.. పోయేకాలం
కలికాలంలో ధర్మం ఒక్క పాదంపై నడుస్తుందని నా చిన్నప్పుడు చదివా. కానీ ఇప్పుడది ఒక్క పాదం కాదు ఒక్క వేలు మీద నడుస్తోందని పిస్తోంది. తులం బంగారం రూ. 30 వేలా... బియ్యం రూ. 25లా? ఇదెక్కడి కాలమండీ! అవినీతికి వ్యతిరేకంగా మా వయసు వాళ్ళు నిరాహార దీక్షలు చేయాల్సిన దుస్ధితిని నేను కలలో కూడా ఊహించలే. ఇది కలికాలం కాదు. పోయే కాలం.
సౌభాగ్యమ్మ, హైదరాబాద్‌