15, నవంబర్ 2011, మంగళవారం

సంకల్పమే విజయసోపానంగా..



ఆడపిల్లలకు చదువుసంధ్యలెందుకన్న సామాజిక నిస్పృహకు చెక్‌ పెడుతూ ఉన్నత విద్యాభ్యాసం చేసి జిల్లా ఉన్నత విద్యాశాఖాధికారిగా ఎదిగిన బసవ వెంకటనర్సమ్మ అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నది. మారుమూల పల్లెలో పుట్టి ప్రాథమిక విద్యను అక్కడే కొనసాగించి, అన్ని చదువులూ ప్రభుత్వ విద్యాసంస్థల్లోనే పూర్తిచేసి అత్యున్నత స్థాయికి చేరుకొని నేటితరం గ్రామీణ విద్యార్థులకు ఆమె ఓ దిక్సూచిలా దిశానిర్ధేశం చేస్తున్నారు. గ్రామీణ విద్యార్థినీలా, నలుగురు చెల్లెలకు అక్కగా, ఉపాద్యాయురాలిగా, గృహిణిగా, తల్లిగా, విద్యాశాఖాధికారిగా బహుముఖ పాత్రల్లో రాణిస్తూ విధుల నిర్వహణలో ప్రత్యేక స్థానాన్ని పొందిన వెంకటనర్సమ్మ మహిళలకూ ఆదర్శంగా నిలుస్తుంది. రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లా ముమ్మడివరం మండలంలోని గాడిలంక మారుమూల గ్రామంలో ఓం శివాజి, కాశీ అన్నపూర్ణ దంపతులకు జన్మించిన ఐదుగురు అమ్మాయిల్లో పెద్దకూతురుగా వెంకటనర్సమ్మ అదే గ్రామంలో 7వ తరగతి వరకు విద్యనభ్యసించింది. లోవోల్టేజీ సమస్యతో విద్యుత్‌ వెలుగులు సరిగా లేని ఆ గ్రామంలో ఆ దీపాల కిందనే కష్టపడి తన విద్యను కొనసాగించింది. 8 వ తరగతి నుండి పై చదువులు చదవాలంటే కిలోమీటర్‌న్నర గ్రామం నుండి మెయిన్‌రోడ్డుకు కాలినడకన ప్రతిరోజు నడిచి అక్కడి నుండి బస్సెక్కి ముమ్మడివరం వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాలినడకన పదవతరగతి వరకు ముమ్మడివరం ప్రభుత్వ పాఠశాలలో విద్యాభ్యాసం పూర్తి చేసి 442 మార్కులతో మండల టాపర్‌గా నిలిచింది. బస్సు దిగి తన గ్రామానికి తిరిగి చేరుకునే సమయానికి తన తండ్రి ఓం శివాజి కూతురు కోసం కళ్లలో ఒత్తులేసుకొని సాయంత్రం పొద్దుపోయే వరకు ఎదురు చూసి ఆమె బస్సు దిగి వచ్చిన తరువాత ఆమెను తీసుకొని ఇంటికి వెళ్లేవాడు. ఈ విధంగా దాదాపు ఐదు సంవత్సరాల పాటు ఓంశివాజి కన్నకూతురు పై చదువుల మీద ఉన్న ఆసక్తికి తన తోడ్పాటును అందించి తల్లిదండ్రులందరికీ స్ఫూర్తినిచ్చాడు. పదవతరగతిలో ఆమె సాధించిన మార్కులే ఆమెను ఇంటర్మీడియట్‌ చదువుకునేలా ప్రోత్సహించారు. అప్పటి సామాజిక పరిస్థితులను బట్టి ఆ గ్రామంలో ఎవరూకూడా ఆడపిల్లలను ఇంటర్‌ విద్యకు పంపించడానికి ఇష్టపడేవారు కాదు. ఆడపిల్లలు చదివి ఊళ్లేలాలా ?... రాజ్యాలేలాలా ?... అనే నిస్పృహలోనే కొట్టుమిట్టాడుతుండేవారు. వెంకటనర్సమ్మ పదవతరగతిలో సాధించిన మార్కులను చూసిన ఆమె బాబాయి నమ:శివాయ ఇంటర్‌ విద్యను చదివించాలని వెంకటనర్సమ్మ తండ్రికి ఇచ్చిన సలహాతో ఆమె తన ఇంటర్‌ విద్యను అవలీలగా పూర్తి చేసింది. ఇంటర్మీడియట్‌ ఎంపిసిలో 718 మార్కులు సాధించి కళాశాల టాపర్‌గా నిలిచిన వెంకటనర్సమ్మపై ప్రశంశల జల్లు కురిసింది. తన తల్లిదండ్రులు, బాబాయి ఇచ్చిన ప్రోత్సాహంతో ఆమె తిరిగి వెనక్కు చూడకుండా తన చదువును పకడ్బంధీగా కొనసాగించింది. డిగ్రీ విద్యను అమలాపురంలోని ఎస్‌కెబిఆర్‌ డిగ్రీ కళాశాలలో పూర్తి చేసింది. డిగ్రీలోనూ అత్యున్నత మార్కులు సాధించిన ఈమెకు బిఇడి చేయాలనే ఆలోచనతో రాజమండ్రిలోని ఐఏఎస్‌ఇ బిఇడి కళాశాలలో ప్రవేశం పొందింది. అయితే తన గ్రామానికి సుదూరంగా ఉన్న రాజమండ్రిలో ఉండి చదవాలంటే గగనకుసుమమైంది. అలాంటి సందర్భంలో తన అత్తయ్య నాగవేణి ఇంట్లో ఉండి చదువుకోవాలని భావించింది.
అయితే తన అత్తయ్య ఇంట్లో ఆర్థిక పరిస్థితులు సరిగా లేకపోయినప్పటికీ పెద్దమనస్సుతో వెంకటనర్సమ్మకు తన సహకారాన్ని అందించింది. అలాగే దీనికి తోడు 1996లోనే సంభవించిన పెనుతుఫాన్‌ ఈప్రాంతాన్ని కకావికలం చేసింది. ఈప్రాంతంలోని రైతులందరితో పాటు గాడిలంక గ్రామఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసింది. అయినప్పటికీ తన తండ్రి ఓంశివాజి ఇచ్చిన స్ఫూర్తితో మొక్కవోని దైర్యంతో బిఇడి విద్యను పూర్తి చేసింది. 1998 సంవత్సరంలో విశాఖపట్నంలోని ఆంధ్రాయూనివర్సిటీలో ఎమ్మెస్సీ కెమిస్ట్రీని పూర్తి చేసింది. అప్పుడే అన్ని ప్రాం తాల వారి జీవినవిధానాలు ఆమెకు అవగతమయ్యాయి. పిజి పూర్తి చేసి న అనంతరమే తాను పడిన కష్టానికి ఫలితంగా ఎస్‌జిటి టీచర్‌ పోస్టును సాధించింది. 2000 సంవత్సరంలో స్కూల్‌ అసిస్టెంట్‌ టీచర్‌గాను ఉద్యోగం పొందింది. 2002లో శ్రీనివాస్‌కుమార్‌తో వివాహం జరిగింది. తన మిత్రురాలు జ్యోతి ఇచ్చిన సలహాతో 2008లో డిప్యూటీ డిఇఓ పోస్టులకు దరఖాస్తు చేసుకొని తన చెల్లి చందు, తన భర్త కుమార్‌ ఇచ్చిన ప్రోత్సాహంతో 2008లో డిప్యూటీ డిఇఓగా ఉద్యోగాన్ని పొందింది. తరువాత రాష్ట్రవిద్యాశాఖ కల్పించిన అవకాశాన్ని బట్టి 2009లో ఖమ్మం జిల్లా విద్యాశాఖాధికారిగా బాధ్యతలు చేపట్టారు. రాష్ట్రంలోనే అత్యంత సమస్యాత్మక విద్యాశాఖగా పేరుపొందిన ఖమ్మం జిల్లా విద్యాశాఖలో ఉన్నత విద్యాశాఖాధికారిగా అత్యంత చాకచక్యంగా పనిచేసి అందరిచేత ప్రశంశలు పొందారు. ఈమె నియామకం తరువాత ఉపాద్యాయుల, విద్యార్థుల సమస్యలను పరిష్కరించడంలో సఫలీకృతులయ్యారు. జిల్లాలోని పాఠశాలలను సందర్శించి ఉపాద్యాయుల పనితీరు, విద్యార్థుల హాజరు తదితర విషయయాలను పర్యవేక్షించి పనితీరు మెరుగుపరిచారు. కార్యాలయంలో సిబ్బంది మద్య గతంలో ఉన్న వర్గరాజకీయాలను తగ్గించి పనివైపు మళ్లించారు. ఉపాద్యాయుల సమస్యలపై అవగాహనతో కార్యాలయ సిబ్బంది పనితీరును వేగవంతం చేయించారు. బదిలీలు, ప్రమోషన్లు , డిఎస్సీ కౌన్సిలింగ్‌లు పారదర్శకంగా సూర్యాస్తమయ సమయానికి పూర్తి చేసిన ఘనత వెంకటనర్సమ్మకే దక్కింది. ఉన్నత విద్యావంతురాలైన మహిళాశక్తిని చాటిన వెంకటనర్సమ్మ రాష్ట్రస్థాయిలో ఉన్నత శ్రేణి ప్రభుత్వ ఉన్నతాధికారిగా నిలిచే ప్రయత్నం సాకారం కావడానికి ఆమె తపన సఫలీకృతం కానున్నది. అలాగే మరిన్ని విద్యాసేవలు అందించడం లో చురుకుగా తన శక్తిసామర్థ్యాలను వినియోగిస్తున్నారు. జ్ఞానము, కృషి, పట్టుదల, తపన ఆయుధాలుగా చేసుకొని వివిధరంగాల్లో తన సామర్థ్యాన్ని నిరూపించుకుంటున్న వెంకటనర్సమ్మ మహిళలందరికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు. స్వామి వివేకానంద చెప్పినట్లు తన లక్ష్యాన్ని సాధించడంలో ఎల్లప్పుడూ మేల్కొని ఉండి అప్రమత్తంగా ఉన్నవారే అగ్రభాగాన నిలుస్తారన్న సూక్తిలకు వెంకటనర్సమ్మ జీవితం నిలువెత్తుసాక్ష్యంగా నిలుస్తున్నది.