15, నవంబర్ 2011, మంగళవారం

ఎక్కడ పడితే అక్కడ మదిని తడుతూ.. ముందుకు


  • పాటల రచయిత రామ్‌పైడిశెట్టితో ముఖాముఖి
ఈ మధ్య 'ఎక్కడ బడితే అక్కడ నువు కనబడుతూ వుంటే... రెక్కలు విప్పిన చప్పుడై మది తడబడుతూ వుంది....' అంటూ సాగే పాట నేటి యూత్‌లో రింగ్‌టోన్‌గా కాలర్‌ ట్యూన్‌గా తెగ పాపులారిటీ తెచ్చుకుంది. ఈ పాటని పదే పదే వినిపించాలని
ఎఫ్‌ఎం రేడియోలకి, టీవీలలోని పలు కార్యక్రమాలకి ఫోన్లు వెళ్తున్నాయంటే ఆశ్చర్యం కలిగించక మానదు.
అందరి హార్ట్‌ టచ్‌ చేసిన ఈ పాట 'జాజిమల్లి' చిత్రంలోనిదని తెలిసినా... ఇంత అందంగా రాసిన ఈ రచయిత ఎవరబ్బా అని ప్రశ్నించుకునే వారికి పరిచయం చేసే ప్రయత్నంలో
ఈ గీత రచయిత 'రామ్‌ పైడిశెట్టి'ని 'ఆంధ్ర ప్రభ' పలకరించగా... తన మనసులోని పలు ఊసుల్ని పంచుకున్నారు.
ఉత్తరాంధ్ర నుండి సినీ వినీలా కాశాన మెరిసిన మరో గీత రచయిత రామ్‌ పైడిశెట్టి... ఈ రచయిత పుట్టిం ది.. పెరిగింది.. విజయనగరం జిల్లాలో ఓ మారుమూల పల్లెలో అయినా.. తన కవి హృదయపు ఊసుల్ని అందరికి వినిపించాలన్న ప్రయత్నంలో వచ్చిన ఉద్యోగాలెన్నింటినో తలదన్ను కుని.. పదాలనే ఆలంబనగా.. నమ్ముకుని ఇండస్ట్రీకి వచ్చిన... ఈ వర్ధమాన గీత రచయిత ఇప్పటికి 47 చిత్రాలకి పాటలం దించి... అగ్రహీరోల చిత్రాలకు పాటలు రాయాలన్న కసితో ఆత్మ విశ్వాసంతో ముందుకు దూసుకు పోతున్నాడు...
పాట కు నాందీ ప్రస్తావన
విజయనగరంజిల్లా రామభద్రపురం మండలం బూసాయవలసలో పుట్టి పెరిగా. ప్రాథమిక విద్య ఊర్లోనే. బొబ్బిలి గురుకులంలో సంపాదించుకున్న మార్కులే వెంకటగిరి - నెల్లూరు ఎపిఆర్‌జెసిలో సీటు తెచ్చిపెట్టాయి. ఆపై విజయనగరం యం ఆర్‌ కాలేజీలో డిగ్రీ, తదుపరి పిజీ చేసా... ఇంటర్‌ చదివే రోజు ల్లో సరదాగా పాటల పోటీల్లో పాల్గొంటే వచ్చిన బహుమతులే నాకు ఉత్సా హాన్నిచ్చాయి. 1998లో 'జన్మభూమి' పాటల పోటీలకు నే పంపిన పేరడీకి వచ్చిన బహమతి మరిన్ని పేరడి సాంగ్స్‌ రాయటా నికి స్పూర్తి నింపింది. ఈ క్రమంలో నాలోనూ మంచి రచయిత ఉన్నాడని.. నన్ను అన్ని విధాలా ప్రోత్స హించిన నా మిత్రుల సూచన మేరకు పేరడిలకు గుడ్‌బై చెప్పి సొంత బాణితో పాటలు రాయటం ప్రారంభించాను.
పరిశ్రమకు ఎలాగొచ్చారు...
ఎక్కువగా సినిమా చూస్తూ నటుడు కావాలని 2002 నవంబర్‌ 26న హైదరాబాద్‌ కృష్ణానగర్‌లో అడుగు పెట్టా. ఛాన్సుల కోసం తిరగని స్టూడియో లేదు, తొక్కని ప్రొడ్యూసర్‌ గుమ్మం లేదు.అయితే ఖాళీగా ఉన్న సమయాల్లోనో.. రాత్రుళ్లు పడుకునే ముందో.. నే రాసుకున్న పాటల్ని హమ్‌ చేస్తూ ఉండటంతో.. నువ్వు నటుడిగా కన్నా పాటల రచయితగా పనికొస్తావ్‌గా.. ఆదిశగా ప్రయత్నించమని సల హా ఇచ్చారు మిత్రులు కొందరు. దీంతో నాలోని 'నటుడ్ని' కాస్త పక్కకి నెట్టి నే రాసు కున్న పాటల్ని కలిసిన ప్రతి ఒక్కరికీ వినిపించి అవకాశాన్ని దక్కించుకున్నా... ఆపై అందరి మది తలుపులు తట్టేలా పాటలు రాస్తూ... ముందుకు సాగుతున్నా....
తొలి అవకాశం....
'చంటిగాడు' మ్యూజిక్‌ సెటింగ్స్‌ జరుగుతుంది. వెళ్లిసంగీత దర్శకుడు వందేమా తరం శ్రీనివాసని కల్సి పాటలు వినిపించా! అక్కడే దర్శకురాలు బి. జయగారు సందర్భం చెప్పి పాట రాయమన్నారు. నేను 'సీతాకోక చిలుకలు రెండు స్నేహం చేశాయి ఆ స్నేహంతోనే గుండెలచాటున ప్రేమను దాచాయి. అని పాటరాసి వినిపిం చాను! అది ఆమెకి వెంటనే నచ్చేసి తన సినిమాలో ఎస్‌.పి. బాలసుబ్రహ్మణ్యం పాడటం నా అదృష్టం. నన్ను ప్రోత్సహించిన వారికి ఋణపడి వుంటాను.
ఎవరెవరు ప్రోత్సహించారు....
పరిశ్రమలో టాలెంట్‌ ప్రోత్సహించే వారిక్కడ ఉన్నారనటానికి నేనే సాక్ష్యం. కాబట్టే అతి తక్కువ వ్యవధిలోనే 47 సినిమాలకి పైగా పాటలు రాసానంటే ఆదు కున్న హస్తాలెన్నో ఉన్నాయి. గుండమ్మ గారి మనవడు, ప్రేమికులు, చంటి గాడు చిత్రాలలో బి.జయ, రాజావారి చేపల చెరువు, జెంటిల్‌మెన్‌ చిత్రాలలో పోసాని, ఏకలవ్యుడు మేడికొండ మురళీకృష్ణ (నరసింహనాయుడు నిర్మాత) దేవీ వరప్ర సాద్‌ 'రంగ ది దొంగ'లో మహాత్మా నిర్మాత సి.ఆర్‌. మనోహర్‌, దర్శకులు జి.వి., హిరో శ్రీకాంత్‌ ఇలా చెప్పు కుంటూ పోతే చాలా మంది వున్నారు. ముఖ్యంగా చక్రి, ఆర్‌పి, వందేమాతరం, చిన్నా బోలేషావలి, వంటి సంగీత దర్శకులు చాలమంది నన్ను ప్రోత్సహిస్తున్నారు.
ఇంకా ఏఏ చిత్రాలకు...
తారకరత్న జగపతిబాబు కాంబినేషన్‌లో రానున్న 'నందీశ్వరుడు'. రాజ శేఖర్‌ మహాంకాళి, సాయిరాం శంకర్‌ శ్రీహరిల 'యమహో యమ', శ్రీకాంత్‌ హీరోగా నానీ కృష్ణ దర్శకత్వంలో 'దేవరాయ', దునియా కేజీ కృష్ణ తమిళ రీమేక్‌, థర్డ్‌మాన్‌, దర్శకుడు జి.వి గారి తదుపరి చిత్రానికి రాస్తున్నా...
ఎవరి సాహిత్యం అంటే మీ కిష్టం?
మంచి భావంతో పాటరాసే ఏ వ్యక్తినైనా (పాతకొత్త) ఇష్టపడతా. కాని ఎక్కువగా దేవులపల్లి, ఆత్రేయ, శ్రీశ్రీ, ఆరుద్ర, సినారే, సముద్రాల, వేటూరి, సిరివెన్నేల నుంచి చంద్ర బోస్‌ వరకు అందరి సాహిత్యాన్నీ ఇష్టపడతాను. పదాల పొందికతో అలవోకగా అక్షరాలను జార్చి ఎన్నో అద్భుత గీతాలు రాసిన అందరూ నాకు ఆదర్శ వంతులే.
ఖాళీ సమయంలో...
లక్ష్యం వైపు పరుగులు తీసే వ్యక్తికి ఖాళీ అన్న పదానికి చోటు ఉండకూడదని నా నమ్మకం. కొత్త తరహా భావాలను ఆలోచించి కాగితం మీద పెడతా. షిడ్ని, షెల్టన్‌, షెల్లిd కీట్స్‌, వర్డ్స్‌వర్త్‌, షేక్స్‌యర్‌, డేల్‌ కేర్నగి లాంటి ఇంగ్లీషు రచయితల పుస్తకాలు, యండమూరి, యుద్దనపూడి ఇలా నా కిష్టమైన రచయితల పుస్తకాలతో పాటు కనిపించిన ప్రతి పుస్తకాన్ని చదువుతా...
దేనికైనా రడీ...
సంగీత దర్శకులు ట్యూన్‌ కట్టాక పాట రాయమన్నా, బాణీ లేకుండానే పాట రాయమన్నా నే రెడీ! పాతకాల ట్యూన్‌ ఇచ్చి పాట రాయమంటే ట్యూన్‌ పరిధులు మించకుండా భావాన్ని ఇమిడ్చాలి. అప్పుడు రచయితకు కొంత ఇబ్బంది తప్పదు కాని... ఇప్పడు సంగీత దర్శకులకు సహకరిం చే విధంగా బాణీకి రాయమంటే రాయగలగాలి. రాసిన సాహిత్యానికి బాణీ కడతామన్నా సిద్ధంగా వుండాలి.
ఇష్టమైన పాటలు..
నే రాసిన పాటలన్నీ నాకిష్టమే. సీతాకొక చిలుకలు రెండు... మరీను'గుండమ్మగారి మనవడు'లో బ్రహ్మ ఎదురుగ వచ్చి ఒక వరమే కోరమంటే. 'ఒక పెళ్ళాం ముద్దు రెండో పెళ్ళాం వద్దు'లో ఆడదానికి ఆసులాటే పసుపు కుంకుమమ్మ కాసులు ఆస్తులు కాదమ్మా, 'కలెక్టర్‌ గారి భార్య'లో ఇంకా ఎన్నాళ్ళు బాబా స్త్రీ కళ్ళల్లో వరదల్లే పొంగే కన్నీళ్ళు ఇలా చాలా ఉన్నాయి.
ఈ పాట కు 2010 సంవత్సరానికి నంది అవార్డును ఆశించా! కాని... నిరాశ పడ్డాను. ఐటం సాంగ్స్‌లో నా ట్రంకు పెట్టే తాళం వేసే వుంది ఆ తాళం చెవి నా బావ దగ్గరుంది. 'రంగ ది దొంగ'లో నా ఒళ్ళే బెల్లం బుట్టే కళ్ళే చీమల పుట్టే, నాకు బాగా పేరు తెచ్చిన పాట 'ఎక్కడ బడితే అక్కడ నువ్వు కనపడుతూ వుంటే'.
కుటుంబ ప్రోత్సాహం....
తొలి నాళ్ళలో సినిమా పిచ్చోడిలా తిరుగుతుంటే బాధపడ్డ కళ్లు నాకు తెలుసు. ఆ కళ్లలో ఆనందం నింపాలన్న నా ప్రయత్నం ఫలించిన క్షణం నేను ఆనందించిన కన్నీటికి తెలుసు. ఉన్నత ఉద్యోగిగా నన్ను చూడాలనుకున్నా, సినీ గేయ రచయితగా ఎదుగుతున్న క్రమంలో నా వాళ్ల నుండి ప్రోత్సాహం అంతా ఇంతా కాదు.