15, నవంబర్ 2011, మంగళవారం

స్నేహాన్ని పెంచే 'ఇరానీ ఛాయ్‌'

ఇన్నాళ్లు రాజధానికే తన గుభాళింపుతో మైమరపించిన ఇరానీ ఛాయ్‌.. ఇప్పుడు రాష్ట్రం నలుమూలల విస్తృతంగా కనిపిస్తోంది. అయితే ఇరానీ చాయ్‌ అంటే ముందుగా గుర్తొచ్చేది హైదరాబాద్‌ టీ స్టాళ్లే అన్నది వాస్తవం. నగర జీవనంలో ముఖ్యంగా ఇక్కడి పౌరుల్లో వారి సంస్కృతిలో ఓ ముఖ్యభాగమై నిలుస్తున్న ఈ టి రుచిముందు ఎన్ని రకాల టీలు వచ్చినా దిగదుడుపే... టీ అమ్ముకోవటం చిన్న చూపుగా చూసే వారే కాదు... ఓ నలుగురు మిత్రులు కలిస్తే... సరదాగా ఏ ఇరానీ హోటల్లోనో దూరి 'తీన్‌ మే చార్‌ ఛాయ్‌..' అంటూ ఆర్డర్చి.. తాగాల్సిందే...
లెమన్‌ టీ, గ్రీన్‌ టి, బ్లాక్‌ టీ, చాక్లెట్‌ టీ ఇలా బోలెడు రకాల టీలు పోటా పోటీగా వచ్చినా... ఎప్పటి కప్పుడు తన ప్రత్యేకతని నిలుపుకుంటూ... ఇరానీ ఛాయ్‌ దూసుకు పోతోందనటానికి నగరంలో ఇరానీ హోటళ్లలో కనిపించే కళకళ చాలు. ఉస్మానియా బిస్కట్లకి తోడుగా సాసర్లలో ఛాయ్‌ని ఒంపు కుని మై మరచి.. నోరారా ఏదో తెలియని ఆప్యాయతని రంగరించి జుర్రుతూ... మరీ తాగుతున్న వారెందరో మనకి కనిపిస్తారంటే ఆశ్చర్యం కలగక మానదు.
అప్పట్లోనే కాదు ... నేటి ఉర్దూ సాహిత్య కారులు కూడా ఈ ఇరానీ ఛాయ్‌పై కవిత్వాలు, గజల్స్‌ అల్లితే ... మరికొందరు సాహితీ ప్రియులు పద్యాలు, దండ కాలు, పాటలు కూడా రాసేరు. అంతెందుకు ఇక్కడి ప్రజల్లో మహదానందానికి ఇరానీ ఛాయ్‌ ఓ కారణమంటే బాగుంటుంది, ఇరానీ టీ తాగిస్తే చాలు హైదరాబాద్‌లు తెగ సంతోషిస్తారని, పెద్ద్ద విందుల కన్నా... ఇరానీ టీకే ప్రాధాన్యత ఇస్తారంటే... ఇక్కడి ప్రజల్ల్లో అదెంత మమేకం అయిపోయిందో అర్ధం చేసుకోవచ్చు.
అన్నట్లు ఇరానీ ఛాయ్‌ తాగే వారిలో ఇక్కడో ప్రత్యేక నియమం ఒకటి ఉండేదట. ఛాయ్‌ తాగేందుకు ఎవరు పిలుస్తారో... వారే ఆ బిల్‌ని చెల్లించాలి. అలా కాకుండా ఎదుటి వ్యక్తితో చెల్లించేట్లు చేస్తే... ఆ స్నేహాన్ని అవమాన పరిచినట్లేనని భావించే వారని.. ఇప్పటికి దాదాపుగా ఇక్కడ ఈ నియమం అమలు అవుతున్నట్లు ఇరానీ ఛాయ్‌ విక్రేతలు చెప్తుంటం విశేషం.
అయితే పెరుగుతున్న ధరల సెగ ఇరానీ ఛాయ్‌కి కూడా పడి సామాన్యజనంకి దూరమయ్యే ధరలకు ఎగబాకుతుండటం పట్ల ఆందోళనలూ వ్యక్తమవుతున్నాయి. ఒకప్పుడు కేవలం 50 పైసలు ఉండే కప్పు ఇరానీ ఛాయ్‌ ధర నేడు సాధారణ హోటల్‌లో 5,6 రూపాయలుండగా, కాస్త్త పేరెన్నిక గన్న హోటళ్లలో 8 నుండి 10 రూపాయల పైచిలుకుకు ఎగబాకింది. దీంతో అన్ని ఋతువుల్లో కళ కళలాడుతు ఓ పరి శ్రమగా ఎదిగి ఎందరికో ఉపాధి మార్గాలు చూపించిన ఇరానీ ఛాయ్‌ హోటళ్లు కొందరి కష్టమర్లని కోల్పోవాల్సి రావటం విచారకరమే... భాగ్యనగర పర్యాటక ప్రత్యేకతని వచ్చేవారి మదిలోనూ నిలిపే ఈ ఇరానీ ఛాయ్‌ని నిలపాలంటే తగిన చర్యలు తీసుకోకతప్పదని అమాత్యులు గ్రహించాల్సిన అవస రం ఎంతైనా ఉంది.