15, నవంబర్ 2011, మంగళవారం

ఆయనే ఒక విద్యా సాంస్కృతిక మండలి

మాతృభాష పట్ల ఆయనకు గల అభిమానం ఎనలేనిది. పిల్లలకు చిన్ననాటి నుంచే మాతృభాష పట్ల, సంస్కృతి పట్ల ప్రగాఢమైన అభిమానం కలగటానికి అవసరమైన అన్ని చర్యలూ తీసుకున్నారు. పాఠ్య పుస్తకాల్లో “”జనగణమన’జాతీయ గీతంతో పాటు, తెలుగు తల్లి’గేయాన్ని కూడా ముద్రింపజేసి, పాఠశాలల్లో ఉదయం ప్రార్థన సమయంలో తెలుగుతల్లి గేయాన్ని తప్పనిసరిగా ఆలపించాలని ఉత్తర్వులు జారీచేశారు. అప్పటివరకు అస్థవ్యస్థంగా ఉన్న విద్యారంగాన్ని ప్రక్షాళన చేసి, చక్కదిద్దారు. గుర్తింపే లేని సాంస్కృతిక శాఖకు ప్రాధాన్యతను సంతరించారు. పిల్లల్లో విద్యాసాంస్కృతిక చైతన్యం తేవడం ద్వారా మానసిక వికాసం పెంపొందించవచ్చని భావించారాయన. విద్యాసాంస్కృతిక రంగాలను ఆ కాలం స్వర్ణయుగంగా చెప్పవచ్చు. అంతకుముందు రాష్ట్రాన్ని కుదిపివేసిన రెండు ప్రత్యేక రాష్ట్రోద్యమాల మూలంగా రాష్ట్రంలో విద్యాప్రమాణాలు పూర్తిగా పడిపోయాయి. విద్యార్థుల్లో క్రమశిక్షణ లోపించింది. చదువుపట్ల శ్రద్ధ తగ్గిపోయింది. పరీక్షల్లో అవినీతి పెచ్చరిల్లిపోయింది. ఈ రెండు సమస్యలను ఒక సవాలుగా తీసుకుని మండలి వెంకట కృష్ణారావుగారు కేవలం ఒక సంవత్సరం వ్యవధిలోనే అనుకున్నది సాధించారు.
విద్యాప్రమాణాలు పడిపోవడానికి అధ్యాపకులలో నెలకొనిఉన్న అసంతృప్తి కూడా ఒక కారణమని గ్రహించారాయన. వారి వేతనాల విషయంలోను, ఇతర సౌకర్యాలు, రక్షణ విషయంలోను ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ప్రైవేటు యాజమాన్యంలోని విద్యాలయాలపై ప్రభుత్వానికి ఎక్కువ అధికారాలను కల్పించడానికి గాను ఒక సమగ్రమైన విద్యా బిల్లును రూపొందించారు. మున్సిపాలిటీ పాఠశాలల్లోని ఉపాధ్యాయులకు సకాలంలో జీతాలు అందకపోవడం గుర్తించి, మున్సిపల్‌ పాఠశాలలన్నింటికీ పూర్తి గ్రాంటు ఇచ్చారు. ఉపాధ్యాయుల సంక్షేమ నిధికి గణనీయంగా నిధులను సమకూర్చారు. విద్యాశాఖ పరిపాలనను మెరుగుపరచడానికి అప్పటివరకు డైరక్టరేట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ ఇన్‌స్ట్రక్షన్‌గా వ్యవహరించబడుతున్న విద్యాశాఖ డైరెక్టరేట్‌ను ఉన్నత విద్యా డైరెక్టరేట్‌, పాఠశాల విద్యా డైరెక్టరేట్‌గా విభజించారు. ప్రాథమిక విద్యకు ప్రత్యేకించి ఒక అదనపు డైరెక్టర్‌ను నియమించి, విద్యాశాఖ డైరెక్టరేట్‌ను పునర్‌వ్యవస్థీకరించారు. అప్పటికి రాష్ట్రంలో ఉస్మానియా, ఆంధ్ర, శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయాలు మాత్రమే ఉండేవి. కృష్ణారావు గుంటూరులో నాగార్జున విశ్వవిద్యాలయం, వరంగల్‌లో కాకతీయ విశ్వవిద్యాలయం స్థాపించి అందరి మన్ననలు పొందారు.
అధ్యాపకుల పట్ల పిల్లల్లో భక్తి ప్రపత్తులను పెంపొందించడానికి టీచర్స్‌-డేను గురుపూజ దినోత్సవంగా మార్చారు. అవకాశం చిక్కినప్పుడల్లా పాఠశాలలను, కళాశాలలను సందర్శిస్తూ, ఉపాధ్యాయులతోనూ, విద్యార్థుతోను ప్రత్యక్ష సంబంధం పెట్టుకుని వారి కష్టసుఖాలను తెలుసుకునేవారు. విద్యార్థుల హాస్టళ్ళకు వెళు తూ, అక్కడి పరిస్థితులను స్వయం గా పరిశీలిస్తూ, హాస్టల్‌ విద్యార్థులతో పాటు కూర్చుని, వారికి వండిన భోజనమే తానూ తింటూ, చనువుగా మెలుగుతూ విద్యార్థుల బాగోగులను శ్రద్ధగా గమనిస్తూ విద్యామంత్రిగా విద్యార్థుల, ఉపాధ్యాయుల అభిమానాన్ని చూరగొన్నారు. వారికి ఆత్మీయుడుగా మెలిగారు.
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో సాంస్కృతిక వికాసానికి కృష్ణారావు చేసిన సేవ అపూర్వమైంది. 23.3.1974న ఆనందనామ ఉగాది నాడు ప్రారంభించి వారంరోజులపాటు హైదరాబాద్‌ లోని నిజాం కళాశాల మైదానంలో అఖిల భారత తెలుగు సాంస్కృతిక ఉత్సవాలను నిర్వహించారు. ఈ ఉత్సవాలకు భారతదేశంలోని తెలుగువారి ప్రతినిధులందరూ విచ్చేశారు. ఈ ఉత్సవాలిచ్చిన స్ఫూర్తితో ప్రపంచ తెలుగు మహాసభలను నిర్వహించాలని తలపెట్టారు. ఉత్సవాల ముగింపు సమావేశంలో అధికార భాషా సంఘాన్ని నెలకొల్పుతున్నట్లు, దానికి ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు వావిలాల గోపాల కృష్ణయ్యగారిని అధ్యక్షులుగా నియమిస్తున్నట్లు ముఖ్యమంత్రి జలగం వెంగళరావుగారు ప్రకటించారు. ఆనాటి నుంచి తెలుగును తాలూకా స్థాయిలో అధికార భాషగా ప్రవేశపెడుతున్నట్లుగా కూడా ఆయన ప్రకటించారు. తెలుగు వారమంతా ఒకే జాతి -మనకు గర్వించదగ్గ సాంస్కృతిక వారసత్వ సంపద ఉంది. అన్ని భాషల్లోనూ యాసలు ఉంటాయి. మాండలికాలు భాషకు సొగసును కూర్చే భాషణాలు. యాసలను కించపరచడం అవివేకం. మన భాషను సంస్కృతిని పరిరక్షించుకోవలసిన బాధ్యత మనందరి మీదా ఉంది. రాష్ట్ర ప్రజలందరూ సమైక్యంగా ఉండి, సహజ వనరులకు ఆలవాలమైన మన రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడపవలసిన కర్తవ్యం తెలుగుతల్లి బిడ్డలమైన మనందరిదీ’అని ఆయన పర్యటించిన ప్రదేశాలన్నింటిలోనూ ప్రజలకు స్ఫూర్తినిచ్చే విధంగా ప్రసంగాల ద్వారా తెలియజెప్పారు.
1974 దసరా సందర్భంగా అఖిల భారత తెలుగు బాలల మహోత్సవాలు, అంతర్‌ భారత బాలానందోత్సవాలు నిర్వహించారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన పిల్లలకు ఆంధ్రదర్శిని’పేరుతో రాష్ట్రంలోని ముఖ్యప్రదేశాలు చూపించారు. 1975 వ సంవత్సరాన్ని తెలుగు సాంస్కృతిక సంవత్సరంగా ప్రకటింపజేశారు. ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణకు ప్రజలను సన్నద్ధం చేయడానికి 1975 ఫిబ్రవరి నెలలో రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో జిల్లా సాంస్కృతిక మండలిని ఏర్పాటు చేశారు. సినీ కళాఖారులతో రాష్ట్రంలో పలు సాంస్కృతిక ప్రదర్శనలు ఇప్పించారు.
ప్రథమ ప్రపంచ తెలుగు మహాసభలు 1975 ఏప్రిల్‌ 12 నుంచి 18 వరకు హైదరాబాద్‌లో లాల్‌ బహదూర్‌ స్టేడియంలో “నభూతో న భవిష్యతి’ అన్న రీతిలో జరిపించారు. ఈ సభలకు అప్పటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావుఆహ్వాన సంఘం అధ్యక్షులుగా వ్యవహరించగా, మండలి వెంకటకృష్ణారావు కావ్యనిర్వాహక అధ్యక్షులుగా వుండి, అన్నీ తానే అయి సభలను జయప్రదం చేశారు. ఈ సభల సందర్భంగా ఏర్పాటు చేసిన తరతరాల తెలుగు జాతి చరిత్ర పేరుతో 2500 సంవత్సరాల తెలుగుజాతి చరిత్ర ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మహాసభల అనంతరం ఇతర రాష్ట్రాలలోను, ఇతర దేశాలలోను నివసిస్తున్న తెలుగువారి విద్యాసాంస్కృతిక అవసరాలు తీర్చడానికి అంతర్జాతీయ తెలుగు సంస్థను ఏర్పాటు చేశారు. అప్పట్లో రాష్ట్రంలో పనిచేస్తూ వుండిన ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమీ, సంగీత నాటక అకాడమీ, లలిత కళా అకాడమీ, సైన్స్‌ అకాడమీలకు వార్షిక గ్రాంట్లు రెట్టింపు జేశారు. వృద్ధకళాకారుల కిచ్చే పెన్షన్‌లు పెంచారు. రాష్ట్రంలో ఉర్దూ అకాడమీని, బాలల మనోవికాసానికి బాలల అకాడమీని స్థాపించారు. సాంస్కృతిక కార్యక్రమాలు, కవి సమ్మేళనాలు, సాహిత్య సమావేశాలు రాష్ట్రమంతటా జరిపించి, సాంస్కృతిక విప్లవానికి నాంది పలికారు. కళాకారుల్లో, సాహిత్య వేత్తల్లో ఉత్తేజాన్ని కలిగించారు. సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు ప్రతి జిల్లాలోను ఆడిటోరియంల నిర్మాణానికి ప్రతిపాదించారు.
ఆ తరువాత 1981లో మలేషియాలో రెండవ ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించడానికి గాను అంతర్జాతీయ తెలుగు సంస్థ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. ఈ పదవి వున్న కారణంగా అంజయ్య కేబినెట్‌లో కృష్ణారావుగారికి చోటు దక్కలేదు. 1981 ఏప్రిల్‌ నెలలో మలేషియాలోని కౌలాలంపూర్‌లో నాలుగు రోజులపాటు జరిగిన రెండవ ప్రపంచ తెలుగు మహాసభలకు రాష్ట్రం నుంచే కాక విదేశాల నుంచి కూడా మంచి స్పందన వచ్చింది. ఆ తరువాత ప్రభుత్వం పక్షాన ప్రపంచ తెలుగు మహాసభలు ఇంతవరకు జరుగలేదు. మళ్లీ ప్రపంచ తెలుగు మహాసభలను విశాఖపట్నంలో నిర్వహించాలనీ, రాష్ట్రం నలుమూలల నుంచి ఊరేగింపుగా జనం ప్రతి ముఖ్యమైన పట్టణంలోనూ ఉత్సవాలు చేస్తూ రావాలనీ ఆయన ఆశించారు. మరణ శయ్యపై వుండి, తుది శ్వాస విడిచే వరకు దీన్ని గురించే ఆయన పలవరించారు. ఆయన కోరిక ఈనాటికీ నెరవేరలేదు. మండలి వెంకట కృష్ణారావుగారి భాషా సాంస్కృతికోద్యమాన్ని ఆ తరువాత వచ్చిన ప్రభుత్వాలు కొనసాగించిఉంటే, ఈనాడు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఈ వేర్పాటు వాద ఉద్యమాన్ని, విపత్కర పరిస్థితిని ఎదుర్కొనేది కాదు.