15, నవంబర్ 2011, మంగళవారం

నాడు 'వారాలబ్బాయ్‌' నేడు 'రాజా'బాబు

త్రికరణశుద్ధిగా పనిచేస్తూ విజయం సాధించే వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు. సినీరంగం ఒక రంగుల ప్రపంచం. ఎంత క్రమశిక్షణతో ఉన్నా ఇందులో మసలుకోవడం కష్టమనే భావన చాలా మందిలో ఉంది. ఇక్కడ అనుకున్నది సాధించాలంటే అహర్నిశలు కష్టపడితే...ఫలితం దక్కుతుంది. రాబోయే ఫలితాన్ని ఊహిస్తూ...ప్రణాళికా బద్ధమైన జీవనం సాగిస్తూ... ముందుకు సాగి తన లక్ష్యం సాధించి చూపించిన వ్యక్తి మాగంటి రాజబాబు. అదే మన 'మురళీమోహన్‌'. అది సినిమాల్లో అయినా వ్యాపారంలో అయినా...ఇదే మంత్రం. తాను అంచెలంచెలుగా ఎదిగి సంపాదించిన దాంతో పేద విద్యార్థు లను ఆదుకోవాలన్న సదుద్దేశ్యంతో ఆచరించి చూపి నిజ జీవితంలోనూ తాను హీరో.
దాదాపు 350 చిత్రాల్లో నటించినా సౌమ్యంగా సూటిగా మాట్లాడతారు. తనకున్న భావాలని నమ్ముతూ.. దేనిపైనైనా ధైర్యంగా వ్యాఖ్యానించడం ఆయన నైజం. తాను డిగ్రీ చదువుకోని ఉద్యోగం దొరకని పరిస్థితి ఎదుర్కొని విద్య విలువ తెలుసుకున్నా అంటూ.. వ్యక్తిగత జీవనం, గతం, రాజకీయాలు, సమాజ పోకడలు, సినీరంగంపై తన అభిప్రాయాలను 'ఆంధ్రప్రభ'తో నిష్కర్షగా పంచుకున్నారు.
చిన్నప్పుడు చిల్లిగవ్వలేదు
ఇంటర్‌ తప్పడంతో సరైన ఉద్యోగం దొరకలేదని, పోనీ వ్యాపారం చేద్దామంటే పెట్టుబడికి డబ్బులేని స్థితి అంటూ తన 15 ఏళ్ల వయసులో ఎదుర్కొన్న గత స్మృతులను నెమరువేసుకున్నారు.స్వాతంత్య్ర సమరయోధుడు మాగంటి మాధవరావు ఇంట జూన్‌ 24వ తేదీ 1940 పశ్చిమగోదావరి జిల్లా ఏలూ రు దగ్గరలోని చాటపర్రు గ్రామంలో నేను పుట్టా. అమ్మ వసుమతి దేవి. నాకొక అక్క చెల్లి ఉన్నారు. అక్క చెల్లెళ్ల పెళ్ళికోసం ఉన్న సొమ్మంతా ఖర్చు చేసిన పేద గ్రామీణుడిని నేనప్పుడు. తండ్రి వారసత్వం గా వచ్చింది స్వాతంత్య్రం ఒక్కటే. మధ్య తరగతి ఆర్థిక సమస్యలు, ఏమి చేయాలో పాలుపోని పరిస్థితి. పదో తరగతి వరకు నా బాల్య జీవితం అంతా గ్రామీణ జీవనమే. ఇంటర్‌ ఏలూరులో చదివా. ఆస్థులు లేకపోయినా ఏదో సాధించాలన్న పట్టుదల ఉన్నా నా చదువుకు సరైన ఉద్యోగం రాదు. వ్యాపా రం పెట్టలేను. ఈ సమయంలో నాకు అండగా నిలబడింది మా బాబాయి మాణిక్యాలరావు.
నాటకం కోసం నాటకం
వ్యాపారం చేస్తున్నప్పుడే నాటకాలంటే అభిమానంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు వ్యాపారం చూసి, మా బాబాయికి తెలియకుండా ఏలూరు వెళ్ళి నాటకాలు వేసేవాడిని. అప్పట్లో స్నేహితులు నన్నొక మంచి నటుడనేవారు. అదే సమయంలో చెన్నై 'ఆంధ్రాక్లబ్‌' నిర్వహించిన నాటక పోటీల్లో 'పోలీస్‌' నాటకం ప్రదర్శించాం దానికి ఎలాంటి బహుమతీరాకున్నా...ప్రధాన పాత్ర వేసిన నాకు అను భవం మాత్రం వచ్చింది. ప్రత్యేకంగా శిక్షణ తీసుకోకుండా.. హాబీగా ప్రారంభించిన నటన అనతి కాలం లో నన్ను సినీ రంగానికి తీసుకొచ్చింది.
సినీరంగంలో అవకాశం
స్నేహితుల ప్రోత్సాహంతో అట్లూరి పూర్ణచంద్రరావు, పి.వి. సుబ్బారావులు నూతన తారలతో నిర్మించే 'జగమే మాయ' చిత్రం కోసం నేనూ ఫోటోలు పంపా. అదృష్టం వరించి, హీరోగా నటించే ఛాన్సొచ్చింది. ఏ.ఎన్‌.మూర్తి దర్శకత్వం వహించిన ఈ చిత్రం 1973లో విడుదలైంది. అసలు అంతకు ముందు ఏడాదే 1972లో దర్శకుడు కె. రాఘవేంద్రరావు తండ్రి కె.ఎస్‌.ప్రకాశరావు గారి దర్శకత్వంలో నటించే అవకాశం వచ్చినట్లే వచ్చి చివరి నిమిషంలో చే జారింది.
దశని మార్చిన దాసరి
తన చిత్ర కెరీర్‌ను మలుపు తిరగటానికి ముఖ్యకారకుడు దాసరే... 'తిరుపతి' (1974) చిత్రం సందర్భం గా తన వ్యక్తిత్వం, నటన నచ్చి 40 సినిమాలు తనకి అవకాశాలిచ్చారని దర్శకులు దాసరి నారాయణ రావుకు కృతజ్ఞతలు తెలిపారు.
నేను కాళ్లకు మొక్కిన ఏకైక నటుడు ఎన్‌.టి.ఆర్‌
తన సినీ జీవితంలో నందమూరి తారకరామారావును మించిన మహానటుడిని చూడలేదని, వినలేదు.. 'అన్నదమ్ముల అనుబంధం' చిత్రంలో ఓ తమ్ముడి తొలిసారి ఎన్‌.టి.ఆర్‌.ను కలిసే అవకాశం వచ్చిందని, అప్రయత్నంగానే ఆయన కాళ్లకు నమస్కరించా.. తన సినీ జీవితంలో కాళ్లకు నమస్కరించిన ఏకైక నటుడు ఎన్టీఆరే.. ఆ సినిమా తరువాత ప్రేక్షకులు నన్ను ఎన్‌.టి.ఆర్‌. తమ్ముడిగా పిలవడం ప్రారంభించారు.
డబ్బింగ్‌ సినిమాలొద్దు
ఇతర భాషా చిత్రాలు తెలుగు అనువాదానికి బద్ధ వ్యతిరేకిని. ఎందుకంటే... ఆయా రాష్ట్రాల సాంప్ర దాయాలను వారు చూపిస్తారు. అది తెలుగులో వస్తే వాటి ప్రభావం మన సంస్కృతిపైనా పడు తుంది. అలాగే మరి కొన్ని సాంకేతిక కారణాలూ ఉన్నాయి. అంతెందుకు కర్నాటక రాష్ట్రంలో డబ్బిం గ్‌ చిత్రాలను అనుమతించరు. ఈ విధానం ఇక్కడా అమలు చేయాలి.
బుల్లితెరపై తొలి అడుగు
బుల్లితెరపై వెండితెర నటులు నటించాలంటే వెనకడుగు వేస్తున్న రోజుల్లో రిస్క్‌ అని విశ్లేషించినా సాహసం చేసి టెలివిజన్‌ సీరియల్స్‌లో కనిపించారు 'మురళీమోహన్‌'. అక్కడా ఆయన సక్సెస్‌ చూడడంతో మిగతా నటులూ అనుసరించారనే చెప్పాలి.
వ్యాపారవేత్తగా 'జయభేరి'
సినీరంగంలో నిలదొక్కుకున్నాక తన కజిన్‌ కిషోర్‌తో కలిసి 1980లో 'జయభేరి ఆర్ట్స్‌' చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించి దాదాపు 25 చిత్రాలను నిర్మించారు. ఆపై దివంగత సినీనటుడు శోభన్‌బాబు ఇచ్చిన సలహా మేరకు జయభేరి గ్రూపును రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారానికీ విస్తరించి సక్సస్‌ బాట పట్టారు.
ప్రతిభకు కొదవలేదు
ప్రపంచంలో చాలా దేశాలకు నే వెళ్లా... అవిధనిక దేశాలే కావచ్చు. చైనాలో జనాభా ఉండొచ్చు. కానీ మేధస్సులో మన దేశమే ముందుంది. పేదరికం వల్లే తెలివితేటలు వినియోగించుకోలేక పోతు న్నాం. నేను 'ట్రస్ట్‌' పెట్టేటప్పుడు వృద్ధాశ్రమం, అనాథ శరణాలయం అంటూ కొందరు సలహా ఇచ్చినా.. 'ఇంట్లో ఒక్క వ్యక్తి ఉన్నత చదువు కలవారైతే సమాజం బాగుపడుతుందన్న నమ్మకంతో నిరుపేద విద్యార్థులకు సాయం చేయాలని భావించా.. వారిలో ప్రతిభ బయటకు తీయాంటే... ఆర్థికంగా ఆదుకొంటే మంచింది.. నేను చేస్తున్నదదే! ఉన్న వారందరూ తలచుకుంటే ఈ దేశం తిరిగి విజ్ఞానఖనిగా మార్చటం మరింత సులభం.
నేను కోరుకునే సమాజం, సంస్కరణలు
అధికార వికేంద్రీకరణ, పోలీస్‌ వ్యవస్థ సంస్కరణ జరగాలి... నదుల అనుసంధానంతో దేశానికి మేలు చేయాలి. మద్యపానంఆర్ధిక వనరుగా చూడటం మానేసి,వసూలు చేసే పన్నులు సద్వినియో గం చేయాలి. ప్రభుత్వ పాఠశాలలపై మక్కువ పెరిగేలా చూస్తూ... అవకతవకలకు మూలమైన రాజకీయాలని ప్రక్షాళన చేయాలి. అవినీతి పరులైన నాయకులను నిలదీసే చైతన్యం రావాలి. 'అన్నాహజారే'ని స్పూర్తిగా తీసుకుని విధికొకరు అలాంటి వ్యక్తి తయారైతే అవినీతిని రూపు మాపడం పెద్ద కష్టం కాదు.
చంద్రబాబు విధానం సరైనదే
ఆరాధ్యదైవంగా తాను పూజించిన ఎన్టీఆర్‌ పదవీచ్యుతుడిని చేసినప్పుడు చంద్రబాబును సమర్థించ డానికి కారణం తెలుగుదేశం పార్టీని కాపాడుకోవటం కోసమే...ఈ రాష్ట్రం చంద్రబాబు హయాంలో నే ఎనలేని అభివృద్ధి జరిగిందని నమ్మే వ్యక్తిని నేను...అందుకే రాజకీయాలు పడవనుకున్నా పార్టీ పిలుపందుకుని ప్రచార, సేవా కార్యక్రమాలలో పాల్గొనడానికి ముందుంటానన్నారు.
వరించిన పదవులు
నటునిగా, వ్యాపారవేత్తగా ఆయన విజయం గుర్తించిన చిత్రపరిశ్రమ, ప్రభుత్వం నేషనల్‌ ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఎన్‌ఎఫ్‌డిసి), రీజినల్‌ ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఎఫ్‌డిసి), మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ అధ్యక్షులుగా పదవులిచ్చాయి. ఆ పదవుల్లోనూ తనదైన ముద్రవేసేలా పని చేస్తూ... చిత్రపరిశ్రమ అభివృద్ధికి కృషి చెయటమే కాక బుల్లితెరకు సైతం 'నంది' అవార్డులను ప్రభుత్వం ప్రకటించేలా చేసి తన కీర్తిని సుస్థిరం చేసుకున్నారు మురళీమోహన్‌.


రాజకీయాలంటే వ్యాపారం
రాజకీయమంటే ప్రజాసేవ అన్నది గతమని, ఇప్పుడు రాజకీయాలంటే వ్యాపారంగా మారింది.. 'ఎన్నికల్లో పెట్టుబడి పెట్టడం... గెలిచాక లాభాల కోసం అడ్డదారులు తొక్కడం..ఇది పరిస్ధితి' ..వాస్తవానికి గతంలో రాజమండ్రి పార్లమెంట్‌ స్థానానికి అయిష్టంగానే పోటీ చేసా... ప్రజాసేవ కి రాజకీయాలొక్కటే మార్గం కాదు...నేటి రాజకీయాలకు నాకు సరిపోనన్న భావన కలుగుతోం దన్నారు. నేడు ప్రభుత్వం రైతులపట్ల వివక్ష చూపుతున్న కారణంగా రాష్ట్రం క్షామంవైపు అడుగులు వేస్తోందని ఆవేదన వ్యక్తం చేసారు.


నెల జీతం నుంచి వ్యాపార భాగస్వామి వరకు
వాస్తవం వెక్కిరిస్తున్నా ఏనాటికైనా నేనో పెద్ద వ్యాపారవేత్తను కావాలని కలలు కనెవాడ్ని నిజం... మా బాబాయి దగ్గరే రూ. 100ల నెలజీతంకి పనిచేస్తుంటే.. నా పనితనం నచ్చి తన వ్యాపార భాగస్వామిగా చేర్చుకుని... 50 శాతం వాటాతో 1964లో విజయవాడలో వ్యవసాయ పంపుసెట్ల అమ్మేందుకు 'కిసాన్‌ ఇంజనీరింగ్‌ కంపెనీ'ని ప్రారంభించాం. ఇలా నేను నెలజీతం నుంచి వ్యాపార భాగస్వామినయ్యా. ఎప్పటికైనా పారిశ్రామిక వేత్త స్థాయిని చేరుకోవాలనుకున్నా తపనే తప్ప సినిమాపై అవగాహన లేనిరోజులవి.
చిన్న కుటుంబం:- వివాహం చేసుకొని ఇద్దరు పిల్లలున్న తర్వాత సినీరంగంలోకి హీరో పాత్రలో ప్రవేశించిన వ్యక్తులు నాకు తెలిసి ఎవరూ గుర్తుకు రావడం లేదు. నా భార్య పేరు విజయలక్ష్మి. కొడుకు రామమోహన్‌. వ్యాపారంలో స్థిరపడ్డాడు. కూతురు మధుబిందు వివాహం తర్వాత అమెరికా వెళ్ళి సెటిలయింది. ఆరోగ్యం పట్ల నేను ఇప్పటికీ తీసుకునే జాగ్రత్తే నా గ్లామర్‌ రహస్యం. క్లుప్తంగా ఇదీ నా కుటుంబం.


విద్యాదాత, వితరణశీలి
ఆర్థికంగా వెనుకబాటు తనం వల్ల పేద విద్యార్థుల చదువు ఆగిపోరాదన్న కాంక్షతో 2006లో 'మురళీమోహన్‌ ఛారిటబుల్‌ ట్రస్ట్‌'ను ప్రారంభించి, పదవ తరగతి, ఇంటర్‌లలో 85 శాతం వచ్చిన వారి ఉన్నత విద్య కోసం, సీటు సాధించినా కేవలం పేదరికం కారణంగా ఇంజనీరింగ్‌, మెడిసిన్‌, ఐఐటిలలో చేర్పించి..సరస్వతీకటాక్షం కల్గించాలన్న ఆశయంతో ఈ ట్రస్ట్‌ ద్వారా ఏటా రూ. 3 కోట్లు ఖర్చు చేస్తున్నాం..750 మంది విద్యార్థులు లబ్ధి పొందుతున్నారని, ప్రస్తుతం 'రియల్‌' వ్యాపారం మందగించినా ఇచ్చిన మాటకు కట్టుబడి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. ఈ ట్రస్ట్‌ ద్వారా లబ్దిపొంది, స్థిరపడిన వారు కనీసం ఒక్క విద్యార్థినైనా చదివించాలని దీనివల్ల తనవంతు సమాజసేవ చేసినట్లవుతుందని కోరుతున్నానని అన్నారు.